Begin typing your search above and press return to search.

ఓటుకు నోటు విచార‌ణ‌లో బాబు శిష్యుడికి చుక్క‌లు?

By:  Tupaki Desk   |   13 Feb 2019 5:07 AM GMT
ఓటుకు నోటు విచార‌ణ‌లో బాబు శిష్యుడికి చుక్క‌లు?
X
సంచ‌ల‌నం సృష్టించిన ఓటుకు నోటు కేసులో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఈ ఇష్యూలో కీల‌క భూమిక పోషించిన వారి చుట్టూ ఉచ్చు బిగించే కార్య‌క్ర‌మం షురూ అయిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు. ఓటుకు నోటు సంద‌ర్భంగా మ‌నీ లాండ‌రింగ్ జ‌రిగింద‌న్న ఆరోప‌ణ‌ల‌పై డైరెక్ట‌రేట్ ఆఫ్ ఎన్ ఫోర్స్ మెంట్ ద‌ర్యాప్తును ముమ్మ‌రం చేయ‌టంతో పాటు.. కీల‌క స‌మాచారాన్ని సేక‌రించిన‌ట్లుగా చెబుతున్నారు.

మాజీ ఎమ్మెల్యే.. టీడీపీ నేత‌.. బాబు శిష్యుడైన వేం న‌రేందర్ రెడ్డిని.. ఆయ‌న ఇద్ద‌రు కుమారుల్ని ఈడీ అధికారులు విచారించారు. వేర్వేరుగా జ‌రిగి ఈ విచార‌ణ ప్ర‌క్రియ ఏకంగా ఏడున్న‌ర గంట‌ల పాటు సాగ‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇంత సుదీర్ఘంగా ఈడీ అధికారులు ఏం విచారించారు? ఏమేం అంశాల్ని వారు ప్ర‌స్తావించారు. దానికి వేం న‌రేంద‌ర్ రెడ్డి.. ఆయ‌న కుమారులు ఎలాంటి స‌మాధానాలు ఇచ్చార‌న్న విష‌యాల‌పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. తెలంగాణ‌లో 2015లో జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేయ‌టానికి భారీ కుట్ర జ‌ర‌గ‌టం తెలిసిందే. ఇందులో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కీల‌క భూమిక పోషించిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్ర నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ స‌న్ కు రూ.5 కోట్లు ముట్ట‌జెప్ప‌టం ద్వారా.. ఆయ‌న టీడీపీ నేత‌లు చెప్పిన వారికి ఓటు వేసేలా ప్లాన్ చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా రూ.50 ల‌క్ష‌ల మొత్తాన్ని స్టీఫెన్ స‌న్ ఇంటికి రేవంత్ రెడ్డి స్వ‌యంగా తీసుకెళ్ల‌టం.. అదే స‌మ‌యంలో అవినీతి నిరోధ‌క విభాగం వారు రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకోవ‌టం.. ముంద‌స్తుగా ఏర్పాటు చేసిన సీసీ కెమేరాల్లో ఈ వ్య‌వ‌హారం రికార్డు కావ‌టం అప్ప‌ట్లో పెను సంచ‌ల‌నానికి దారి తీసింది. ఈ ఉదంతంపై ఇప్ప‌టికే ఎసీబీ విచార‌ణ సాగుతుండ‌గా.. ఈ వ్య‌వ‌హారం పెద్ద ఎత్తున నిధులు జోక్యం ఉండ‌టం..మ‌నీ లాండ‌రింగ్ కు అవ‌కాశం ఉండ‌టంతో ఈడీ రంగ ప్ర‌వేశం చేసిన‌ట్లు చెబుతున్నారు.

మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం ప‌న్నెండు గంట‌ల స‌మ‌యంలో వేం న‌రేంద‌ర్ రెడ్డి.. ఆయ‌న ఇద్ద‌రు కుమారులు ఈడీ కార్యాల‌యానికి చేరుకున్నారు. అప్ప‌టి నుంచి విచార‌ణ ప్ర‌క్రియను షురూ చేసిన అధికారులు సాయంత్రం ఏడున్న‌ర గంట‌ల వ‌ర‌కూ విచార‌ణ‌సాగిన‌ట్లుగా తెలుస్తోంది. ముగ్గురిని అధికారులు వేర్వేరుగా విచారించిన‌ట్లుగా చెబుతున్నారు. ప‌లు కీల‌క అంశాల్ని ఈడీ తెలుసుకున్న‌ట్లు స‌మాచారం. కొన్ని డాక్యుమెంట్ల‌ను కూడా ఈడీ సేక‌రించిన‌ట్లుగా చెబుతున్నారు.

ఇదే ఉదంతంపై ఇప్ప‌టికే ఉద‌య‌సింహ‌.. రేవంత్ రెడ్డిల‌కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో సంబంధం ఉంద‌ని భావిస్తున్న మిగిలిన వారికి కూడా త్వ‌ర‌లో నోటీసులు ఇవ్వ‌నున్నారు. స్టీఫెన్ స‌న్ తో చంద్ర‌బాబు మాట్లాడిన మాట‌ల టేపులో ఉన్న‌ది బాబు వాయిసేన‌ని ఇప్ప‌టికే ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేట‌రీ నిర్దారించింది. ఏసీబీ అధికారులు దాఖ‌లు చేసిన అభియోగ ప‌త్రాల్లో బాబు పేరును 22 సార్లు ప్ర‌స్తావించింది. మొత్తంగా ఈడీ రంగ‌ప్ర‌వేశం బాబు బ్యాచ్ కు కొత్త క‌ష్టాలు షురూ అయిన‌ట్లుగా చెబుతున్నారు. ఇక‌.. ఈడీ విచార‌ణ‌తో బాబు శిష్యుడికి..వారి కుమారుల‌కు సినిమా క‌నిపించిన‌ట్లుగా తెలుస్తోంది.