Begin typing your search above and press return to search.

5వేల మంది ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణం ఎవ‌రు బాబు?

By:  Tupaki Desk   |   19 April 2017 1:13 PM GMT
5వేల మంది ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణం ఎవ‌రు బాబు?
X
కాంట్రాక్టు - ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను టీడీపీ సర్కార్‌ మోసం చేసిందని వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్‌ విమర్శించారు. ఎన్నికల ముందు కాంట్రాక్టు ఉద్యోగులను - ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను వాడుకొని అధికారంలోకి వచ్చాక వారి గొంతు కోసే విధంగా రెగ్యులరైజ్‌ చేసిదిలేదని మ‌త్రివర్గ ఉపసంఘం కుండబద్ధలు కొట్టినట్లుగా వారిని తేల్చిచెప్పిందని అన్నారు. టీడీపీ మ్యానిఫెస్టోలో కాంట్రాక్టు - ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. రెగ్యులరైజ్‌ చేస్తామని మూడు సంవత్సరాలుగా ఆశ కల్పించి చివరకు ఉద్యోగులను నట్టేట ముంచారని చంద్రబాబుపై వెల్లంప‌ల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు రాక ప్రతీ ఏటా 350 నుంచి 400 మంది యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చంద్రబాబు మూడేళ్ల పరిపాలనలో దాదాపు 5 వేల మంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చంద్రబాబు రాక్షసపాలనకు నిదర్శనం కాదా అని ఆయ‌న సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేయడంలో విఫలమైన చంద్రబాబు తన కుటుంబానికి మాత్రం ఉద్యోగాలు ఇప్పించుకున్నారని వెల్లంపల్లి విమర్శించారు. లోకేష్‌ కు మంత్రి పదవి ఇచ్చారు.. రాష్ట్ర యువతనేమో గాలికొదిలేశారు....ఇది న్యాయమా చంద్రబాబు అని నిలదీశారు.

ఎన్నికల సమయంలో ప్రతీ ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటానని హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ ఇళ్లనే నాశనం చేసే వ్యక్తిగా తయారయ్యాడని ఆరోపించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో దాదాపుగా 27.23 లక్షల నిరుద్యోగులు ఉన్నారని వెల్లంపల్లి శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. విశాఖపట్నం రైల్వేజోన్‌ కోసం ప్రసాద్‌ అనే వ్యక్తి ప్రభుత్వానికి లేఖ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడని, ఇవన్నీ చంద్రబాబుకు కనిపించడం లేదా అని నిలదీశారు. దీన్ని ప్రభుత్వ హత్య కింద భావించాలన్నారు. ఉద్యోగాల కోసం - రాష్ట్ర హక్కుల కోసం ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు పలికి ప్రజాపోరాటం చేసి సాధించుకోవాలన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు - నిరుద్యోగులకు వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఉద్యోగం కల్పించకపోతే ప్రతి ఒక్కరికి రూ. 2 వేల నిరుద్యోగ భృతి కల్పిస్తామన్నారు. మూడేళ్లయినా అది అమలుకు నోచుకోకపోవడం బాధాకరమన్నారు.

టీడీపీ మ్యానిఫెస్టో 30వ పేజీలో ఐకేపీ - ఎన్‌ ఆర్‌ ఐజీఎస్ - ఆర్టీసీ - వైద్య - ఆరోగ్య - విద్యుత్‌ ఇలా ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని క్లియర్‌ గా ఉందని వెల్లంప‌ల్లి వివరించారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన మాటలను నిలబెట్టుకోలేని అసమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబేనని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజమండ్రిలో కాంట్రాక్టు - ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని దీక్షా శిబిరాన్ని ప్రారంభించిన చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయడం లేదని వెల్లంపల్లి ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా రెండు నాలుకల ధోరణిలో చంద్రబాబు వ్యవహరించడం బాధాకరమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే రైతు - డ్వాక్రా సంఘాల రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఉద్యోగాలు మాఫీ చేస్తున్నారని వెల్లంపల్లి ధ్వజమెత్తారు. బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల్లో ప్రచారం చేయించుకున్న చంద్రబాబు ఉన్న ఉద్యోగాలను ఊడబెరుకుతున్నాడని వెల్లంపల్లి మండిపడ్డారు. విశాఖ జోన్‌–1 పరిధిలో 18 మంది అంగన్‌వాడీ సూపర్‌ వైజర్‌లను, రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల మంది ఆదర్శ రైతులను, ఉపాధి క్షేత్రస్థాయి సహాయకులను 15 వేల మందిని, గృహ నిర్మాణ శాఖలో 3,600 మందిని, వైద్య, ఆరోగ్యశాఖలో 4 వేల మందిని, ఇరిగేషన్‌ శాఖలో 7 వేల మందిని, విద్యుత్‌ శాఖలో 1998 నుంచి పరిచేస్తున్న 21,800 మంది కాంట్రాక్టు ఉద్యోగులను చంద్రబాబు విధుల నుంచి తొలగించారని మండిపడ్డారు.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/