Begin typing your search above and press return to search.

బాబు పాల‌న గాలి తీసేసిన వాసిరెడ్డి

By:  Tupaki Desk   |   3 May 2018 12:37 PM GMT
బాబు పాల‌న గాలి తీసేసిన వాసిరెడ్డి
X
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పాల‌న‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ప్ర‌తినిధి వాసిరెడ్డి ప‌ద్మ‌. తాజాగా ఏపీలో మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న దాడుల గురించి ఆమె గ‌ణాంకాల్ని ఉటంకించారు. ఇటీవ‌ల అసోసియేష‌న్ ఫ‌ర్ డెమొక్ర‌టిక్ రిఫార్మ్స్ సంస్థ విడుద‌ల చేసిన నివేదిక‌లో మ‌హిళ‌ల‌పై వేధింపుల‌కు పాల్ప‌డుతున్న ప్ర‌జాప్ర‌తినిధుల జాబితాలో టీడీపీ ప్ర‌జాప్ర‌తినిధులు ఐదుగురు ఉండ‌టంపై మండిప‌డ్డారు.

బాబు పాల‌న‌లో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌న్న వాసిరెడ్డి ప‌ద్మ‌.. గ‌డిచిన నెల రోజుల్లో గుంటూరు జిల్లాలో 20 అత్యాచారాలు జ‌రిగాయ‌న్నారు. రాజ‌ధాని ప్రాంతంలో అత్యాచార ఘ‌ట‌నలు జ‌ర‌గ‌టం సిగ్గు చేటుగా అభివ‌ర్ణించారు. రెండు తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిప‌డేలా.. దాచేప‌ల్లిలో తాజాగా ఎనిమిదేళ్ల బాలిక‌ను 55 ఏళ్ల వ్య‌క్తి అత్యాచారం చేయ‌టం తీవ్ర క‌ల‌క‌లాన్ని రేప‌టం తెలిసిందే.

బాబు పాల‌న‌లో ఫెయిల్యూర్స్ పై ఏక‌రువు పెట్టిన వాసిరెడ్డి.. బెజ‌వాడ‌లో కాల్ మ‌నీ సెక్స్ రాకెట్‌కు టీడీపీ పెద్ద త‌ల‌కాయ‌ల అండ‌దండ‌లు ఇస్తే.. బాబు వారికి మ‌ద్ద‌తు ప‌లికిన‌ట్లుగా త‌ప్పు ప‌ట్టారు. ఈ కార‌ణంతోనే ఏపీలో మ‌గాళ్లు మృగాళ్లుగా మారి ప‌సి పిల్ల‌ల‌పై దాడులు చేస్తున్న‌ట్లు మండిప‌డ్డారు.

మ‌హిళ‌ల‌పై దాడుల్ని మొద‌ట్లోనే చంద్ర‌బాబు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకొని ఉంటే.. ఈ రోజు రేప్ ఘ‌ట‌న‌లు జ‌రిగి ఉండేవి కాద‌న్న వాద‌న‌ను ఆమె వినిపించారు. మైన‌ర్ల‌పై అత్యాచారాల ఘ‌ట‌న‌లు జ‌రిగితే.. టీడీపీ నేత‌లు వాటికి సెటిల్‌మెంట్లు చేస్తున్నార‌న్నారు. బాబు సెటిల్ మెంట్ల‌ను ప్రోత్స‌హిస్తున్న‌ట్లుగా ఆరోపించారు.

ఏపీలో జ‌రుగుతున్న అవినీతిపై కానిస్టేబుల్ తో విచార‌ణ జ‌రిపినా.. చంద్ర‌బాబు జైలుకు వెళ్ల‌టం ఖాయ‌మ‌న్న ఆయ‌న‌.. రాజ‌కీయాల‌పై ఉన్న శ్ర‌ద్ధ బాబుకు పాల‌న మీద లేద‌న్నారు. ప్ర‌జాస‌మ‌స్య‌ల్ని ప‌ట్టించుకోని బాబు కార‌ణంగా.. పాల‌న కుంటుప‌డింద‌న్నారు. మంత్రివ‌ర్గ స‌మావేశాల‌న్నీ భూసంత‌ర్ప‌ణ కోస‌మే జ‌రిగాయ‌ని.. నెల్లూరులో ఎక‌రా మూడు ల‌క్ష‌ల రూపాయిల‌కు ప్ర‌భుత్వం కేటాయింపులు జ‌ర‌ప‌టం ఇందుకు ప‌రాకాష్ఠ‌గా ఆమె అభివ‌ర్ణించారు.