Begin typing your search above and press return to search.

వాసవి.. ఫీనిక్స్.. ఒకటి తర్వాత ఒకటి ఏం జరుగుతోంది?

By:  Tupaki Desk   |   24 Aug 2022 4:32 AM GMT
వాసవి.. ఫీనిక్స్.. ఒకటి తర్వాత ఒకటి ఏం జరుగుతోంది?
X
హైదరాబాద్ కు చెందిన పేరు ప్రఖ్యాతులున్న రియల్ ఎస్టేట్ సంస్థల్లో వాసవి.. ఫినిక్స్ సంస్థలు కూడా ఉన్నాయి. ఈ రెండే కాకుండా చాలానే రియల్ ఎస్టేట్ సంస్థలు ఉన్నప్పటికీ.. గురి పెట్టినట్లుగా ఈ రెండు సంస్థల్లోనే ఐటీ దాడులు జరిగిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీని వెనుక పొలిటికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఈ రెండు సంస్థలకు చెందిన యజమానులు ఇద్దరు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు అత్యంత సన్నిహితులుగా విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.

మొన్నటికి మొన్న వాసవి రియల్ ఎస్టేట్ సంస్థలో పెద్ద ఎత్తున ఐటీ దాడులు నిర్వహించిన అనంతరం.. రోజుల వ్యవధిలోనే మరో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అయిన ఫినిక్స్ మీద ఏకకాలంలో పది చోట్ల ఐటీ దాడులు జరగడం గమనార్హం. అంతేకాదు..

సంస్థకు చెందిన ఛైర్మన్.. డైరెక్టర్ల ఇళ్లల్లోనూ సోదాల్ని నిర్వహిస్తున్నారు. ఫినిక్స్ సంస్థ ఛైర్మన్ చుక్కపల్లి సురేశ్ కు రాజకీయ.. అధికార యంత్రాంగంతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా చెబుతారు. పైకి కనిపిస్తున్ ఐటీ సోదాల వెనుక అసలు విషయం వేరే ఉందంటున్నారు.

రాజకీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ రెండు సంస్థల్లోనూ మంత్రి కేటీఆర్ కు భాగస్వామ్యం ఉందంటున్నారు. ఈ రెండు సంస్థల ఆర్థిక మూలాల్లో కేటీఆర్ జాడలు ఉన్నాయన్న మాట వినిపిస్తోంది. వీటిని పట్టుకునేందుకే ఐటీ దాడులు జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. కేంద్రంలోని మోడీ సర్కారుకు తెలంగాణలోని కేసీఆర్ సర్కారు మధ్య పంచాయితీ నడుస్తున్న సంగతి తెలిసిందే. తమను అదే పనిగా టార్గెట్ చేస్తున్న కేసీఆర్ కు చుక్కలు కనిపించేందుకు వీలుగా.. ఐటీ దాడులు జరుగుతున్నట్లుగా చెబుతున్నారు.

కేటీఆర్ కు సంబంధాలు ఉన్నాయన్న మాటే కానీ.. ఆధారాలు దొరికింది లేదని.. తాజా సోదాలతో పెద్దగా ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. ఇలాంటివి జరిగే అవకాశాన్ని గుర్తించి.. ముందస్తు జాగ్రత్తలు చాలానే తీసుకొని ఉంటారంటున్నారు. కాకుంటే..

ఒత్తిడి పెంచేందుకు వీలుగా ఈ సోదాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. కేంద్రంలోని మోడీ సర్కారును ఉద్దేశించి సీఎం కేసీఆర్ ఘాటు విమర్శలు చేస్తున్న కొద్దీ.. ఒకటి తర్వాత ఒకటి చొప్పున సోదాలు జరుగుతాయన్న మాట వినిపిస్తోంది. ఇందులో నిజం ఎంత? అన్నది తేలాల్సి ఉంది. ఏమైనా.. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థల్లో వరుస పెట్టి సాగుతున్న సోదాలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయని చెప్పక తప్పదు.