Begin typing your search above and press return to search.

మోడీ ఉక్కిరిబిక్కిరి అయ్యేలా వరుణ్ గాంధీ కీలక వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   21 Nov 2021 2:30 AM GMT
మోడీ ఉక్కిరిబిక్కిరి అయ్యేలా వరుణ్ గాంధీ కీలక వ్యాఖ్యలు
X
కాలం మహా సిత్రమైంది. కొన్నిసార్లు తామేం చేసినా తిరుగులేని రీతిలో అన్నట్లుగా ఉంటుంది. మరికొన్నిసార్లు.. ఎంత ప్రయత్నించినా.. ప్రతిది ఇబ్బందికరంగా మారుస్తూ ఉంటుంది. మొండితనానికి నిలువెత్తు రూపంగా ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. తాను స్వయంగా ఆమోదింపచేసిన మూడు రైతు చట్టాల్ని రద్దు చేస్తానని తానే స్వయంగా జాతిని ఉద్దేశించిన ప్రసంగంలో చెప్పటం తెలిసిందే.

మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల్ని మొదట్నించి వ్యతిరేకిస్తున్న బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ తాజాగా ప్రధాని మోడీకి రాసిన బహిరంగ లేఖ.. ఇప్పుడు సంచలనంగా మారింది. మోడీ అండ్ కో ఇరుకున పడేలా ఉన్న ఈ లేఖలోని అంశాలు ఇప్పుడు కొత్త చర్చకు తెర తీసేలా మారాయి. మూడు వ్యవసాయ చట్టాల్ని రద్దు చేస్తానంటూ ప్రధాని మోడీ చేసిన ప్రకటనను స్వాగతించిన ఆయన.. మరికొన్ని డిమాండ్లను ఇప్పుడు ఆయన ముందు పెట్టారు.

కనీస మద్దతు ధరపై రైతులు చేసిన డిమాండ్లు అంగీకరించాలన్న వరుణ్ గాంధీ.. మోడీ సర్కారు అలాంటి పని చేయని పక్షంలో అన్నదాతల ఉద్యమం ఆగదన్నారు. లఖింపూర్ ఖేరిలో చోటు చేసుకున్న ఘటనను ఆయన ప్రస్తావించటం ఇప్పుడు మరో సంచలనంగా మారింది. ఈ ఉద్యమంలో పోరాడిన వారిలో 700 మంది రైతులు తమ ప్రాణాల్ని కోల్పోయారని.. ఒకవేళ చట్టాల రద్దు నిర్ణయాన్ని ముందే తీసుుకొని ఉంటే మరికొందరు జీవించి ఉండేవారన్నారు.

‘‘ఆ అమాయకులు ప్రాణాలు పోగొట్టుకునే వాళ్లు కాదు. అందువల్ల నేను కోరుతున్నదేమంటే.. మరణించిన కుటుంబాలకు సానుభూతి ప్రకటించి.. ఒక్కో కుటుంబానికి రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వండి. ఉద్యమంలో భాగంగా రైతులపై నమోదు చేసిన కేసులన్నింటిని కొట్టేయాలి. రైతులు డిమాండ్ చేస్తున్నట్లుగా వారు పండించిన పంటకు కనీస మద్దతు ధరను ప్రకటించి.. వాటికి చట్టబద్ధమైన హామీ ఇవ్వాలి’’ అని కోరారు.

ఈ డిమాండ్లు తీరే వరకు రైతుల ఉద్యమం ఆగదన్న వరుణ్ గాంధీ.. రైతుల పంటకు చట్టపరమైన మద్దతు ధర కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం తాను చెప్పిన విషయాల్ని అంగీకరించాలన్న ఆయన.. ఇలాంటి నిర్ణయం తీసుకుంటే రైతులకు ఆర్థికపరమైన భద్రత లభిస్తుందన్నారు.

అంతేకాదు.. వ్యవసాయ చట్టాల్ని రద్దు చేయాలన్న డిమాండ్ తో ఆందోళన చేస్తున్న రైతులపై జరిగిన లఖింపూర్ దాడి గురించి వరుణ్ తన బహిరంగ లేఖలో ప్రస్తావించారు. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రిపైన కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ చేశారు. మూడు వ్యవసాయ చట్టాల్ని రద్దు చేసిన చేత్తోనే.. మోడీ మాష్టారు చేయాల్సిన డిమాండ్ల జాబితాను తెర మీదకు తీసుకొచ్చిన వరుణ్ తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక భూమిక పోషించాలని తపిస్తున్న వరుణ్.. మోడీ అండ్ కోకు కొత్త ఫజిల్ గా మారారని చెప్పక తప్పదు.