Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌ ను వంద ప్ర‌శ్న‌లు అడిగిన వ‌ర్ల‌

By:  Tupaki Desk   |   6 Nov 2017 5:16 AM GMT
జ‌గ‌న్‌ ను వంద ప్ర‌శ్న‌లు అడిగిన వ‌ర్ల‌
X
ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి పాద‌యాత్ర ప్రారంభ‌మైంది. పాద‌యాత్ర ప్ర‌క‌ట‌న వెలువ‌డినంత‌నే ఉలిక్కి ప‌డిన తెలుగు త‌మ్ముళ్ల‌కు.. డేట్ ద‌గ్గ‌ర ప‌డిన కొద్దీ వారెంత ద‌డ‌ద‌డ‌లాడిపోతున్నార‌న్న విష‌యం వారి మాట‌ల్లోనే క‌నిపిస్తున్న ప‌రిస్థితి. గ‌తంలో.. ఏపీ మీద కానీ.. త‌మ అధినేత చంద్ర‌బాబు మీద కానీ ఎవ‌రైనా విమ‌ర్శ‌ల దాడి చేసిన‌ప్పుడు సౌండ్ చేయ‌ని తెలుగు త‌మ్ముళ్లు ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా అడ‌గ‌కున్నా రియాక్ట్ అయిపోతున్నారు.

జ‌గ‌న్ మీద ఏదో ఒక నిందలు వేసి వార్త‌ల్లోకి వ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. జ‌గ‌న్ ను నీ క‌న్నా నేనే బాగా విమ‌ర్శించాను అంటే.. కాదు.. కాదు నేనే బాగా విమ‌ర్శించాన‌న్న‌ట్లుగా త‌మ్ముళ్ల ప‌రిస్థితి ఉంది. ఇలా ఎవ‌రికి వారు జ‌గ‌న్ పాద‌యాత్ర‌పై స్పందించేందుకు.. విప‌క్ష నేత‌పై విరుచుకుప‌డేందుకు కిందామీదా ప‌డుతున్నారు. ఇలాంటి వేళ‌.. టీడీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి.. ఏపీ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ వ‌ర్ల రామ‌య్య ఓ బ‌హిరంగ లేఖ రాశారు.

ఇందులో జ‌గ‌న్‌ కు వంద ప్ర‌శ్న‌ల్ని సంధించారు.

ఈ వంద ప్ర‌శ్న‌ల్లో చాలావ‌ర‌కూ తెలిసిన‌వే. అయితే.. పాద‌యాత్ర నేప‌థ్యంలో మిగిలిన వారి కంటే భిన్నంగా నిలిచేందుకు గ‌తంలో వ‌చ్చిన అంశాల్ని గుది గుచ్చిన‌ట్లుగా మార్చి.. స‌రికొత్త ప్రెస్ నోట్‌రిలీజ్ చేశారు. ఇప్పుడు వ‌ర్త రామ‌య్య అడిగిన వంద ప్ర‌శ్న‌లు ఇచ్చే క‌న్నా.. అందులో ఆయ‌న ప్ర‌ముఖంగా ప్ర‌స్తావించిన కొన్నింటి చూస్తే అనిపించేది ఒక్క‌టే. ప్ర‌భుత్వంలో ఇప్పుడు ఉన్న‌ది చంద్ర‌బాబే. ఒక‌వేళ జ‌గ‌న్ అవినీతి భారీగా చేసి ఉంటే గ‌డిచిన మూడున్న‌రేళ్ల‌లో ఆయ‌న అవినీతిని నిరూపించేలా సాక్ష్యాలు ఎందుకు బ‌య‌ట‌పెట్ట‌లేదు? అన్న‌ది ప్ర‌శ్న‌. దాన్ని ప‌క్క‌న పెట్టేసి వ‌ర్ల‌వారు అడిగిన ప్ర‌శ్న‌ల్ని చూస్తే..

+ మీ నాన్న సీఎం కాక ముందు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మీ కుటుంబం రాష్ట్ర ప్ర‌భుత్వం ఇచ్చిన స్థ‌లాన్ని అమ్మి అప్పులు తీర్చుకోవాల‌ని నాటి సీఎం చంద్ర‌బాబుకు లేఖ రాసింది నిజ‌మా కాదా?

+ 2004కు ముందు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మీ కుటుంబం ఈ రోజు దేశంలోనే అత్యధిక ఆదాయ‌ప‌న్ను చెల్లించే అతి కొద్ది కుటుంబాల్లో ఒక‌టిగా ఎలా రూపాంతం చెందింది?

+ మీ మీద ఉన్న 11 సీబీఐ చార్జిషీట్ల‌లో పేర్కొన్న అవినీతిపై ఒక్కొక్క‌టిగా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు వివ‌రించి మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటారా?

+ బెంగ‌ళూరు య‌ల‌హంకలో 35 ఎక‌రాల విస్తీర్ణంలో రూ500 కోట్ల‌తో మీరు నిర్మించిన విలాస‌వంత‌మైన భ‌వ‌నం గురించి రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తారా?

+ మీ నాన్న సీఎం కాక ముందు మీకు ఇటువంటి ఆస్తులు లేవు.. అవి ఎక్క‌డ నుంచి వ‌చ్చాయో ప్ర‌జ‌ల‌కు చెబుతారా?

+ బెంగ‌ళూరు హెచ్ఎస్ఆర్ లే అవుట్ లో బినామీ పేర్ల‌తో వేల కోట్లు విలువ చేసే వంద‌ల బినామీ భ‌వ‌నాలు మీకు ఉన్న‌ది నిజ‌మా? కాదా?

+ బెంగ‌ళూరు న‌గ‌ర న‌డిబొడ్డున ఉన్న మంత్రి మాల్‌.. అరికేరిలో వంద‌లాది ఎక‌రాల భూములు గేటెడ్ టౌన్ షిఫ్ మీకు ఎలా వ‌చ్చాయి? వీటి బినామీలుగా క‌డ‌ప సామాన్య ప్ర‌జ‌ల పేర్లు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు చెబుతారా?

+ మీకు.. మీ కుటుంబానికి లండ‌న్‌.. సైప్ర‌స్‌.. మార్జియ‌న్‌.. బ్రిటీష్ వ‌ర్జ‌న్ ఐల్యాండ్‌.. త‌దిత‌ర దేశాల్లో మీరు జ‌రిపే ఆర్థిక లావాదేవీల గురించి రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయ‌గ‌ల‌రా?

+ కొండా దంప‌తులు రూ.200 కోట్లు మీ ద‌గ్గ‌ర దాస్తే.. ఆ సొమ్ము ఎగ‌వేత‌తో మీపై ఒత్తిడి తెచ్చి.. మీకు భ‌య‌ప‌డి మీ పార్టీ వ‌దిలి పారిపోయింది నిజ‌మా? కాదా?

+ మీనాన్న సీఎంగా ఉన్న‌ప్పుడు ఆయ‌న చాంబ‌ర్ లో కూర్చొని మార్చి 2న 389 జీవోలు మీకు అనుకూలంగా జారీ చేసుకొని అవినీతి సొమ్ము మూట‌ల మేడ క‌ట్టింది నిజ‌మా? కాదా?

+ సాక్షి పుట్టుక‌.. దానికి అవ‌స‌ర‌మైన ఆర్థిక వ‌న‌రులు ఎక్క‌డి నుంచి వ‌చ్చాయో రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తారా?