Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ కు వ్య‌తిరేకంగా ఇన్ని సంఘాలా?

By:  Tupaki Desk   |   26 Sep 2015 6:28 AM GMT
కేసీఆర్‌ కు వ్య‌తిరేకంగా ఇన్ని సంఘాలా?
X
వరంగల్‌ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్‌ కౌంటర్ తెలంగాణ ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్ రావుకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ఎన్‌ కౌంట‌ర్ జ‌రిగి దాదాపు 15రోజులు కావస్తున్నా...ఇప్ప‌టికీ ఆ ఘ‌ట‌న జ‌రిగిన‌ తీరును ప్ర‌స్తావిస్తూ ప్ర‌జాసంఘాలు తెలంగాణ ముఖ్య‌మంత్రి తీరుపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇన్నాళ్లు విమ‌ర్శ‌ల‌కే ప‌రిమిత‌మైన ప్ర‌జాసంఘాలు తాజాగా ప్ర‌త్యక్ష కార్య‌చ‌ర‌ణ‌ను ప్ర‌క‌టించాయి. అదికూడా భారీ స్థాయిలో ఉండ‌టం గ‌మ‌నార్హం.

వరంగల్‌ జిల్లా గోవిందరావు మండలం మొద్దుగుట్ట అడవుల్లో మావోయిస్టులు శృతి - విద్యాసాగర్‌ రెడ్డిల మృతికి బూటకపు ఎన్‌ కౌంటరే కారణమని విరసం నేత వరవరరావు ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలు లేకుండా బూటకపు ఎన్‌ కౌంటర్లు జరగవని ఆయ‌న దుమ్మెత్తిపోశారు. మైనింగ్‌ మాఫియా కోసం ప్రాజెక్టుల్లో బినామీలుగా సంపాదనకు మరిగిన అధికార పార్టీ తొత్తులే మావోయిస్టులు తమ కార్యకలాపాలకు అడ్డువస్తున్నారని ఈ దారుణానికి పూనుకున్నారని ఆక్రోశించారు. ఎమర్జెన్సీ కాలంలో ప్రాథమిక హక్కులను రద్దు చేసినా జీవించే హక్కు ఉండిందని, కానీ కేసీఆర్‌ ప్రభుత్వం ఆ హక్కును కూడా కాలరాసిందని ధ్వజమెత్తారు. ఎన్‌ కౌంట‌ర్‌ కు కేసీఆరే బాధ్యత వహించాలని వ‌ర‌వ‌ర‌రావు డిమాండ్ చేశారు.

ఎన్‌ కౌంటర్‌ సంఘటనపై రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తోందని అన్నారు. ఎఫ్‌ ఐఆర్‌ నమోదు చేసిన ఎస్సై దీపక్‌ ఈ నెల 13న కూబింగ్‌ ప్రారంభించినట్లు పేర్కొన్నారని, దీన్ని బట్టి 14న ఉదయం మావోలను పట్టుకొన్న పోలీసులు 15న ఎన్‌ కౌంటర్‌ జరిగినట్లుగా పోలీసులు కట్టుకథ అల్లారని వరవరరావు ఆరోపించారు. పోలీసులు చట్టానికి విరుద్ధంగా వ్యవహరించి ఇద్దరి హత్యలకు పాల్పడ్డారన్నారు. ప్ర‌భుత్వం - పోలీసుల తీరుకు నిరసనగా అసెంబ్లీ తిరిగి స‌మావేశం అయ్యే రోజైన ఈనెల 30న 370 ప్రజా సంఘంల ఆధ్వర్యంలో చలో ఆసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వ‌ర‌వ‌ర‌రావు ప్ర‌క‌టించారు. ప్ర‌జాసంఘాల ఉనికితో అయిన కేసీఆర్‌ కు ప్ర‌జాస్వామ్య ఆకాంక్ష తెలిసివ‌స్తుంద‌ని అన్నారు.