Begin typing your search above and press return to search.

వారాహి.. మార్చాల్సిందే... రిజిస్ట్రేషన్ కి అభ్యంతరాలు...?

By:  Tupaki Desk   |   12 Dec 2022 4:45 AM GMT
వారాహి.. మార్చాల్సిందే... రిజిస్ట్రేషన్ కి అభ్యంతరాలు...?
X
జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార యుద్ధానికి దిగడానికి సొంత వాహనం సమకూర్చుకున్నారు. దాని పేరు వారాహి అని కూడా పెట్టారు. ఇక ఈ వాహనం రంగు ఆలీవ్ కలర్ లో ఉండడం, ఇక బస్సు అని చెప్పినా అది సైనికుల వాహనంగా డిజైన్ చేయడంతో ఆదిలోనే అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.

మొదట వారాహి రంగు మీద దాని ఎత్తు మీద దాని రూపు మీద కామెంట్స్ వైసీపీ నుంచి వచ్చాయి. అయితే వాటిని జనసేన మద్దతుదారులు కొట్టిపారేశారు. ఇదంతా చవకబారు విమర్శలు అన్నారు. జనసేన డిప్యూటీ లీడర్ అయిన నాదెండ్ల మనోహర్ అయితే రంగుల గురించి మీరు మాకు చెప్పేదేంటి అని వైసీపీ మీద ఘాటైన విమర్శలు రివర్స్ లో చేశారు.

పవన్ కళ్యాణ్ నేరుగా ట్విట్టర్ లో కూడా కొన్ని కామెంట్స్ చేశారు. నన్ను ఊపిరి కూడా తీసుకోనీయరా అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. సరే అవన్నీ రాజకీయ విమర్శలు పరస్పరం కామెంట్స్ అని అనుకున్నా వారాహికి ఇపుడు రిజిస్ట్రేషన్ సమస్య ఎదురయింది అని ప్రచారం బయటకు వచ్చింది.

ఇలా వచ్చిన ప్రచారం బట్టి చూస్తే వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని లేవనెత్తిన అభ్యంతరం అయిన రంగు గురించే రిజిస్ట్రేషన్ అధికారుల నుంచి అబ్జక్షన్ వచ్చింది అని అంటున్నారు. ఇక వారాహి ఎత్తు కూడా మరో సమస్య అంటున్నారు. బస్సు అని చెప్పి ఆ షేప్ లేకుండా లారీ చాసిస్ తో దీన్ని డిజైన్ చేశారు అని రిజిస్ట్రేషన్ అధికారులు పేర్కొన్నారు అని ప్రచారం అయితే సాగుతోంది.

అలాగే వారాహి వాహనానికి ఉపయోగించిన టైర్లు కూడా గనులలో వాడే ట్రిప్పర్లకు ఉండే విధంగా ఉపయోగించారు అని అంటున్నారు. దాన్ని కూడా మార్చాలని కోరారని అంటున్నారు. రోడ్ల మీద ఈ తరహా టైర్లను ఉపయోగించడం సాధ్యం కాదు అని అధికారులు చెప్పారని అంటున్నారు.

ఇక మామూలు పౌర వాహనానికి ఆర్మీ వాహనాలకు ఉపయోగించే కలర్ ని ఉపయోగించడం కూడా ప్రధాన అభ్యంతరంగా ముందుకు వచ్చింది అని చెబుతున్నారు. ఇలా చాలా రకాలైన అభ్యంతరాలను రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల నుంచి వచ్చిందని అంటున్నారు. వాటిని మార్చుకుని వస్తేనే రిజిస్ట్రేషన్ చేయిస్తామని చెప్పారుట. మరి తొందరలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయిపోతే తెలంగాణాలోని కొండగట్టు ఆంజనేయ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించి వారాహిని జనంలోకి తీసుకురావాలని జనసేన ఆలోచించింది.

ఇపుడు కొంత మార్పులు చేర్పులు తప్పనిసరి కావడంతో వాటిని పూర్తి చేసి రిజిస్ట్రేషన్ కి వెళ్ళాలి. అపుడే వారాహి జనంలోకి వచ్చేది అని అంటున్నారు. ఏది ఏమైనా వారాహి వాహనం మీద పవన్ తన ట్విట్టర్ లో పెట్టిన వీడియో బైట్ కి మంచి రెస్పాన్స్ దక్కింది. మరి ఇపుడు మార్పు చేర్పుల తరువాత వారాహి ఎలా ఉంటుందో చూడాలని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.