Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్‌ లోకి ఒంటేరు...ముహుర్తం ఖరారు?!

By:  Tupaki Desk   |   17 Jan 2019 12:59 PM GMT
టీఆర్ ఎస్‌ లోకి ఒంటేరు...ముహుర్తం ఖరారు?!
X
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఊహించ‌ని షాక్ త‌గ‌ల‌నుంది. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం పాలైన కాంగ్రెస్ పార్టీకి ముఖ్యనేత ఒక‌రు గుడ్ బై చెప్ప‌నున్న‌ట్లు వార్తలు వ‌స్తున్నాయి. టీఆర్ ఎస్ పార్టీ అధినేత‌ - తెలంగాణ సీఎం కేసీఆర్‌ పై పోరాడి ఓడిపోయిన కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్‌ రెడ్డి టీఆర్ ఎస్‌ లో చేరబోతున్నార‌ని మీడియాలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు కేసీఆర్ సమక్షంలో ఒంటేరు టీఆర్ ఎస్‌ లో చేరబోతున్నారని ప‌లువురు పేర్కొంటున్నారు.

టీడీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడిగా గజ్వేల్‌ నియోజకవర్గ ఇన్‌ చార్జిగా ఉన్న ఒంటేరు ప్రతాప్‌ రెడ్డి ఆ పార్టీకి 2018 మార్చిలో గుడ్‌ బై చెప్పారు. ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబుకు లేఖ రాసి మల్లన్నసాగర్‌ బాధితులకు అండగా పోరాటం - ఓయూలో విద్యార్థి మురళి ఆత్మహత్యకు పాల్పడిన సందర్భంగా బాధిత కుటుంబానికి అండగా నిలిచిన సందర్భంలో ప్రభుత్వం తనపై కక్ష గట్టి అక్రమ కేసులతో జైలుకు పంపిందని, అయితే ఈ పోరాటాల్లో టీడీపీ తెలంగాణ నాయకత్వం తనకు అండగా నిలవకపోవడంతో దిగ్భ్రాంతికి గురయ్యానని రాజీనామా లేఖలో పేర్కొన్నారు. అనంత‌రం కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. గ‌త ఎన్నిక‌ల్లో గ‌జ్వేల్ నుంచి బ‌రిలో దిగారు.

2014 - 2018 ఎన్నికల్లో గజ్వేల్‌ నుంచి కేసీఆర్‌ పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇటీవ‌ల జ‌రిగిన‌ ఎన్నిక‌ల్లో ప్ర‌తాప్‌ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌లు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పై 50 నుంచి 60 వేల మెజారిటీతో గెలబోతున్నానని ప్రతాప్‌ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. వీవీ ప్యాట్‌ లో వచ్చిన స్లిప్పులను లెక్కించకపోతే ఆమరణ దీక్ష చేస్తాననీ - చచ్చినా వదిలేది లేదని హెచ్చరించారు. అయితే, ఆయ‌న‌కు ప‌రాజ‌యం త‌ప్ప‌లేదు. కాగా, తాజాగా ప్ర‌తాప్‌ రెడ్డి కాంగ్రెస్‌ కు గుడ్‌ బై చెప్పి టీఆర్ ఎస్‌ లో చేర‌నున్నార‌నే వార్త సంచ‌ల‌నంగా మారింది.