Begin typing your search above and press return to search.

ప్ర‌తాప్‌ రెడ్డి ఆందోళ‌న వెనుక ఓట‌మి భ‌య‌మే కార‌ణ‌మా?

By:  Tupaki Desk   |   26 Nov 2018 7:25 AM GMT
ప్ర‌తాప్‌ రెడ్డి ఆందోళ‌న వెనుక ఓట‌మి భ‌య‌మే కార‌ణ‌మా?
X
గజ్వేల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి వంటేరు ప్రతాపరెడ్డి ఆదివారం హల్‌ చల్‌ సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఎన్నికల అధికారి కార్యాలయం వద్ద ఆదివారం రాత్రి ఆయన దీక్షకు దిగి తెరాస నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని.. విచ్చలవిడిగా మద్యాన్ని పారిస్తున్నారని ఆరోపించారు. కుల - మత - సంఘాల సమావేశాలు నిర్వహిస్తూ డబ్బు ఎర చూపుతున్నారన్నారు.. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇవన్నీ అధికారులకు కనిపించటం లేదా? ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. అప్పటి వరకు నేను పచ్చి మంచినీళ్లు కూడా ముట్టను..’ అంటూ విరుచుకుప‌డ్డారు. ఎన్నికల అధికారి కార్యాలయం ముందు ప్రతాప్‌ రెడ్డి దీక్షకు దిగిన విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని దీక్ష విరమించాలని కోరగా ఆయన నిరాకరించారు. ఆయన్ను అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించగా తీవ్రంగా ప్రతిఘటించారు.తాను ఎక్కడికీ రానని భీష్మిస్తూ పోలీసు జీపు ఎక్కడానికి నిరాకరించడంతో ఆయన కారులోనే గజ్వేల్‌ ఠాణాకు తరలించారు. పోలీసులతో మాట్లాడుతుండగానే ఆయన సొమ్మసిల్లి పడిపోవడంతో ప్రైవేట్‌ ఆస్పత్రికి - అక్కడి నుంచి హైదరాబాద్‌ యశోదా ఆసుపత్రికి తరలించారు.

అయితే, ఓ వైపు ఎన్నిక‌ల ప్ర‌చారం గడువు స‌మీపిస్తుండ‌టం - మ‌రోవైపు తాను ఎట్టి పరిస్థితుల్లో ప్ర‌తాప్ రెడ్డి ఇంత ప‌ట్టుద‌ల‌గా దీక్ష‌కు ఉప‌క్ర‌మించ‌డం మ‌రియు ఆస్ప‌త్రిలో చికిత్స పొందే స్థితికి చేర‌డం వెనుక కార‌ణాలు ఏంట‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ గెలిచి తీరాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న ప్ర‌తాప్ రెడ్డి ఈ క్ర‌మంలో వేస్తున్న అడుగులు విఫ‌లం అవ‌డం వ‌ల్లే..ఇలా కొత్త `రాజ‌కీయానికి` తెర‌లేపారని అంటున్నారు. ప్ర‌తాప్‌ రెడ్డి దీక్ష‌కు రెండు రోజుల ముందు జ‌రిగిన ప‌రిణామాలు కార‌ణ‌మ‌ని ప‌లువురు వాదిస్తున్నారు. ప్ర‌తాప్‌రెడ్డి అనుచ‌రుడు డ‌బ్బులు త‌ర‌లిస్తూ ప‌ట్టుబ‌డ‌టం వ‌ల్ల దాన్ని తెర‌మ‌రుగు చేసేందుకు ఈ ఎత్తుగ‌డ వేశార‌ని అంటున్నారు.

గ‌జ్వేల్ నియోజకవర్గంలోని ములుగు మండలం ఒంటిమామిడి చెక్‌ పోస్ట్ దగ్గర తనిఖీలు చేస్తుండగా వంటేరు ప్రతాప్‌ రెడ్డి అనుచరుడు హన్మంత్ దగ్గర రూ.20లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హన్మంత్ ఆర్టీసీ బస్సులో తరలిస్తుండగా నగదు పట్టుకున్నారు. హన్మంత్‌ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. అయితే, ఈ బండారం బ‌య‌ట‌ప‌డ‌టంతో వంటేరు ప్ర‌తాప్‌ రెడ్డి కొత్త ఎత్తుగ‌డ‌కు దిగారని టీఆర్ ఎస్ పార్టీ నేత‌లు ఆరోపిస్తున్నారు.