Begin typing your search above and press return to search.

సీఎం కేసీఆర్ నుంచి నా ప్రాణాల‌కు ముప్పు

By:  Tupaki Desk   |   30 Jan 2018 5:21 AM GMT
సీఎం కేసీఆర్ నుంచి నా ప్రాణాల‌కు ముప్పు
X
కొద్దికాలం చంచ‌ల్ గూడ జైల్లో ఉంటున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత‌.. తెలుగు రైతు రాష్ట్ర అధ్య‌క్షుడు వంటేరు ప్ర‌తాప‌రెడ్డి బెయిల్ పై విడుద‌ల‌య్యారు.ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ నుంచి త‌న ప్రాణాల‌కు ముప్పు ఉందంటూ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. పోలీసుల చేత త‌న‌ను ఎన్ కౌంట‌ర్ చేయించేందుకు కుట్ర జ‌రుగుతోంద‌న్నారు.

ఉస్మానియా వ‌ర్సిటీలో ఆత్మ‌హ‌త్య చేసుకున్న విద్యార్థి ముర‌ళిని ప‌రామ‌ర్శ కోసం వెళ్లిన వంటేరును పోలీసులు అరెస్ట్ చేశారు. అనంత‌రం బెయిల్ ల‌భించింది. అయితే.. మ‌రో మూడు కేసుల‌కు సంబంధించి అరెస్ట్ చేస్తార‌న్న అనుమానంతో అండ‌ర్ గ్రౌండ్‌ లోకి వెళ్ల‌టం.. అనంత‌రం టాస్క్ ఫోర్స్ పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డారు. ఈ నేప‌థ్యంలో కోర్టులో హాజ‌రుప‌ర్చ‌గా ప‌ద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించారు.

అప్ప‌టి నుంచి చంచ‌ల్ గూడ జైల్లో ఉన్న ఆయ‌నకు తాజాగా బెయిల్ ల‌భించింది. ఈ నేప‌థ్యంలో మీడియాతో మాట్లాడిన వంటేరు త‌న‌కు ప్రాణ‌హాని ఉంద‌ని వ్యాఖ్యానించ‌టం గ‌మ‌నార్హం. ఒక పార్టీ రాష్ట్ర స్థాయి నేత ఇన్నేసి రోజులు జైల్లో ఉండ‌టం.. అది కూడా పాత కేసుల‌కు సంబంధించి కావ‌టం రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. టీటీడీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్య‌క్షుడైన వంటేరు.. ఇంత కాలం జైల్లో ఉండ‌టం ఏమిట‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. వాస్త‌వానికి ఓయూలో విద్యార్థి ఆత్మ‌హ‌త్య స‌మ‌యంలో ప‌రామ‌ర్శ‌కు వెళ్లిన ఉదంతంలో పోలీసులు న‌మోదు చేసిన కేసుపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం.. ప‌రామ‌ర్శ‌కు వెళ్లిన వంటేరుపై పోలీసుల‌పై దాడికి య‌త్నం కేసు న‌మోదు చేసిన‌ట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. వంటేరు లాంటి నేత ఒక‌రిని ఇన్నేసి రోజులు జైల్లో పెట్టిన ఉదంతంపై టీటీడీపీ నేత‌లు కానీ.. పార్టీ అధినేత కానీ సీరియ‌స్ గా తీసుకోలేద‌న్న విమ‌ర్శ కూడా ఉంది. ఈ స‌మ‌యంలోనే వంటేరు త‌న ప్రాణాల‌కు సీఎం కేసీఆర్ కార‌ణంగా ముప్పు ఉంద‌ని వ్యాఖ్యానించ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. 2019లో గ‌జ్వేల్ లో ఓడిపోతాన‌న్న భ‌యంతోనే కేసీఆర్ త‌న‌పై త‌ప్ప్ఉడు కేసులు బ‌నాయించి జైల్లో పెట్టించార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

శాంతిభ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లుగుతుంద‌ని చెబుతూ కోదండం ప‌ర్య‌ట‌న‌ను అనుమ‌తించ‌ని పోలీసులు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌ర్య‌ట‌న‌కు అనుమ‌తి ఎలా ఇస్తార‌ని ప్ర‌శ్నించారు. త‌న‌కు జ‌రిగిన అన్యాయాన్ని గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌తి ఇంటికి వెళ్లి చెబుతాన‌న్నారు. వంటేరు విడుద‌ల స‌మ‌యంలో జైలు ప‌రిస‌రాల్లో నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఆయ‌నకు స్వాగ‌తం ప‌లికేందుకు వంద‌లాది మంది కార్య‌క‌ర్త‌లు జైలు వ‌ద్ద‌కు చేరుకున్నారు. పోలీసులు వారిని అనుమ‌తించ‌లేదు. దీనిపై కార్య‌క‌ర్త‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జైలు నుంచి విడుద‌లైన వంటేరు.. శామీర్ పేట వ‌ద్ద కార్య‌క‌ర్త‌ల్ని క‌లుసుకున్నారు. త‌న‌కు తీవ్ర అన్యాయం జ‌రిగింద‌ని.. సీఎం కేసీఆర్ వ్య‌క్తిగ‌తంగా త‌న‌పై క‌క్ష క‌ట్టార‌ని వంటేరు త‌న స‌న్నిహితుల వ‌ద్ద చెప్పుకున్న‌ట్లు తెలిసింది. కేసీఆర్ తీరుపైనా ఆగ్ర‌హంగా ఉన్న ఆయ‌న‌.. ఈ విష‌యాన్ని వ‌దిలిపెట్ట‌న‌ని.. ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర‌కు వెళ‌తాన‌ని చెబుతున్నారు. మ‌రి.. వంటేరు ఆరోప‌ణ‌ల‌పై సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తార‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.