Begin typing your search above and press return to search.

కేసీఆర్ స్పందించ‌లేని స‌వాల్‌ విసిరిన వంటేరు!

By:  Tupaki Desk   |   12 Oct 2018 4:16 AM GMT
కేసీఆర్ స్పందించ‌లేని స‌వాల్‌ విసిరిన వంటేరు!
X
తెలంగాణ కాంగ్రెస్ నేత వంటేరు ప్ర‌తాప‌ రెడ్డి అన్నంత‌నే కాస్త కొత్త‌గా అనిపిస్తుంది కాదు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ రైతు సంఘం అధ్య‌క్షుడు అన్నంత‌నే ఆయ‌న్ను ఇట్టే గుర్తు ప‌ట్టేస్తారు. సుదీర్ఘ‌కాలం ప‌చ్చ కండువా క‌ప్పుకున్న ఆయ‌న తాజాగా రెండు భారీ స‌వాళ్ల‌ను విసిరారు.

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు ఆగ్ర‌హం వ‌స్తే అదెంత క‌ఠినంగా ఉంటుంద‌న్న విష‌యాన్ని స్వ‌యంగా అనుభ‌వించిన నేత‌గా వంటేరును చెప్పొచ్చు. కేసీఆర్‌ కు వ్య‌తిరేకంగా ఉస్మానియా విద్యార్థుల‌తో క‌లిపి నిర‌స‌న ర్యాలీ ఒక‌టి ప్లాన్ చేశారంతే. దానికి వంటేరు చెల్లించిన మూల్యం ఎంత‌న్న‌ది ఆయ‌న‌కు.. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు తెలిసినంత బాగా మ‌రెవ‌రికీ తెలీదేమో?

కేసుల మీద కేసులు.. బ‌య‌ట‌కు రాలేన‌న్ని కేసులు. జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేస‌రికి.. జీవితంలో మ‌ళ్లీ ఉస్మానియా వైపు క‌న్నెత్తి చూసేందుకు సైతం వ‌ణికే అనుభ‌వాలెన్నో వంటేరు సొంత‌మ‌య్యాయ‌ని చెబుతారు. సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడిగా త‌న‌కెప్ప‌టికీ ఎదురుకాని అనుభ‌వాలు వ‌రుస‌పెట్టి రావ‌టంతో ఆయ‌న వ‌ణికే ప‌రిస్థితి.

ఇలాంటి వేళ‌.. పార్టీ అధినేత‌గా.. ఏపీ ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ చంద్ర‌బాబు ఏ మేర‌కు అండ‌గా నిలిచింది లేదు. మారిన కాలానికి త‌గ్గ‌ట్లు పార్టీ మార‌కుంటే ఇబ్బందేన‌న్న విష‌యాన్ని అర్థం చేసుకొన్న ఆయ‌న ప‌సుపు కండువాల‌ను వ‌దిలేసి కాంగ్రెస్ కండువాను క‌ప్పుకున్నారు.

అప్ప‌టి నుంచి ఆచితూచి అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తూ జాగ్ర‌త్త‌గా ఉంటున్నారు. అలాంటి వంటేరు తాజాగా రియాక్ట్ అయ్యారు. ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ కు రెండు సూటి స‌వాళ్లు విసిరారు. స‌హ‌జంగానే స‌వాళ్ల‌కు వెనువెంట‌నే రియాక్ట్ అయి.. నీ ద‌మ్మేందో నువ్వు చూపించి.. నా ద‌మ్మేమిటో నేను చూపిస్తాన‌నే కేసీఆర్ సైతం నీళ్లు న‌మిలేలా ఆయ‌న స‌వాళ్లు ఉన్నాయ‌ని చెప్పాలి.

ఇంత‌కీ వంటేరు విసిరిన స‌వాళ్ల‌ను చూస్తే.. అందులో ఒక‌టి గ‌జ్వేల్ బ‌రిలో నిలిచిన కేసీఆర్ కానీ మ‌ళ్లీ గెలిస్తే తాను రాజ‌కీయాల నుంచి వైదొలుగుతాన‌ని శ‌ప‌ధం చేశారు. దీనికి కేసీఆర్ రియాక్ట్ అయ్యే ప‌రిస్థితి ఉండ‌దు. ఎందుకంటే.. వంటేరు లాంటి నేత‌లు తన ముందు కూర్చునే అర్హ‌త లేద‌న్న భావ‌న‌లో ఉండే కేసీఆర్‌.. ఆయ‌న శ‌ప‌ధాన్ని ప‌ట్టించుకునే ఛాన్సే ఉండ‌దు.

ఇక‌.. ఆయ‌న తాజాగా విసిరిన మ‌రో స‌వాల్ మ‌రికాస్త చిత్ర‌మైంది. తాను అవినీతికి పాల్ప‌డ‌లేదంటూ గ‌జ్వేల్ లోని కోట మైస‌మ్మ గుడిలో కేసీఆర్ ప్ర‌మాణం చేయ‌గ‌ల‌రా? అంటూ ప్ర‌శ్నించారు. ఈ భారీ స‌వాల్‌కు కేసీఆర్ బ‌దులిచ్చేది లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. రాజ‌కీయంగా త‌న‌కు మేలు చేసేవి.. త‌న‌ను మ‌రో స్థాయికి వెళ్లేందుకు వీలుగా ఉన్న స‌వాళ్ల‌ను మాత్ర‌మే స్పందించే అల‌వాటున్న కేసీఆర్‌.. వంటేరు లాంటోళ్ల ఛాలెంజ్ ల‌ను ఎందుకు స్వీక‌రిస్తారు?

అందునా.. త‌న‌కున్న న‌మ్మ‌కాల నేప‌థ్యంలో గ‌జ్వేల్ కోట మైస‌మ్మ ఆల‌యంలో ప్ర‌మాణం లాంటి వాటికి స్పందించే ఛాన్సే లేదు. ఒక‌వేళ ఓకే అంటే అంత‌కు మించిన సంచ‌ల‌నం మ‌రొక‌టి ఉండ‌దు. ఏమైనా.. రెండో స‌వాల్ ఓకే కానీ.. మొద‌టి శ‌ప‌ధం వంటేరుకు అవ‌స‌ర‌మా? అన్న క్వ‌శ్చ‌న్ రాక మాన‌దు. రాజ‌కీయాల్లో హ‌త్య‌లు ఉండ‌వు ఆత్మ‌హ‌త్య‌లే ఉంటాయ‌నే మాట వంటేరు లాంటోళ్ల‌ను చూసిన‌ప్పుడు గుర్తుకొస్తే.. త‌ప్పు కాదేమో?