Begin typing your search above and press return to search.

సొంత నేత‌ల‌ను కాద‌ని..జంపింగ్ నేత‌ను గౌర‌వించిన కేసీఆర్‌

By:  Tupaki Desk   |   23 Oct 2019 4:31 PM GMT
సొంత నేత‌ల‌ను కాద‌ని..జంపింగ్ నేత‌ను గౌర‌వించిన కేసీఆర్‌
X
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు ఒక‌నాటి సన్నిహితుడికి....తెలంగాణ సీఎం కేసీఆర్ ఊహించ‌ని గిఫ్ట్ ఇచ్చారు. దీర్ఘ‌కాలంగా త‌న‌కు ప్ర‌త్య‌ర్థిగా ఉన్న‌ప్ప‌టికీ....త‌న పార్టీలో చేరినందుకు నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న మిగ‌తా నేత‌ల‌ను ప‌క్క‌న పెట్టి ఆయ‌న‌కు ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. ఆయ‌నే గజ్వేల్‌ టీఆర్ ఎస్‌ నేత వంటేరు ప్రతాప్‌ రెడ్డి. ఆయ‌న్ను తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ గా ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా నియమించారు.

వంటేరు ప్రతాప్‌ రెడ్డి తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నాయకుల్లో ఒక‌రిగా గుర్తింపు పొందారు. పార్టీ అనుబంధ విభాగ‌మైన తెలుగు రైతు అధ్య‌క్షుడిగా కూడా ప‌నిచేశారు. గత ఎన్నికల్లో గజ్వేల్‌ లో కేసీఆర్‌పై పోటీ చేసి...గట్టి పోటీ ఇచ్చారు. ఓడిపోయిన త‌ర్వాత కూడా పార్టీ బలోపేతం కోసం కృషి చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న సొంత జిల్లా మెద‌క్‌ లో నిర్మించ త‌ల‌పెట్టిన మల్లన్న సాగర్ ప్రాజెక్టు విష‌యంలో పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు చేశారు. ఈ విష‌యంలో అరెస్టైన ఆయ‌న్ను తెలుగుదేశం పార్టీ స‌రిగా గౌర‌వించ‌లేద‌ని అసంతృప్తి చాలామందిలో వ్య‌క్త‌మైంది. దీంతో ఆయ‌న పార్టీ మారేందుకు సిద్ధ‌మ‌య్యారు.

మ‌రోవైపు గజ్వేల్‌ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసిన న‌ర్సారెడ్డి ఆ త‌ర్వాత టీఆర్ ఎస్‌ లో చేరారు. ఈ నేప‌థ్యంలో గ‌జ్వేల్ లో మంచి నాయకుడి కోసం వెతుకుతున్న కాంగ్రెస్ వంటేరుకు గాలం వేసింది. అనంత‌రం ఆయ‌న కాంగ్రెస్ అభ్య‌ర్థిగా కేసీఆర్‌ పై 2018 ముంద‌స్తు ఎన్నికల్లో పోటీ చేశారు. ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన స‌మ‌యంలో....ఎన్నికల అధికారి కార్యాలయం వద్ద రాత్రి ఆయన దీక్షకు దిగి తెరాస నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని.. విచ్చలవిడిగా మద్యాన్ని పారిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు అక్కడకు చేరుకుని దీక్ష విరమించాలని కోరగా ఆయన నిరాకరించారు. ఆయన్ను అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించగా తీవ్రంగా ప్రతిఘటించారు.తాను ఎక్కడికీ రానని భీష్మిస్తూ పోలీసు జీపు ఎక్కడానికి నిరాకరించడంతో ఆయన కారులోనే గజ్వేల్‌ ఠాణాకు తరలించారు. పోలీసులతో మాట్లాడుతుండగానే సొమ్మసిల్లి పడిపోవడంతో ప్రైవేట్‌ ఆస్పత్రికి - అక్కడి నుంచి హైదరాబాద్‌ యశోదా ఆసుపత్రికి తరలించారు. ఈ ప‌రిణామం ఉత్కంఠ‌ను సృష్టించింది.

2018 మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయం అనంతరం - టీఆర్ ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాకర్షక పథకాలకు ఆకర్షితులైన ప్రతాప్‌ రెడ్డి టీఆర్ ఎస్‌ లో చేరారు. 1014 - 2018 ఎన్నికల్లో త‌న‌పై పోటీ చేసి, ఓడిపోయిన నేత‌ - ఇటీవ‌లే పార్టీలో చేరిన‌ప్ప‌టికీ ప్రతాప్‌ రెడ్డికి సీఎం కేసీఆర్ కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ గా నియ‌మించారు.