Begin typing your search above and press return to search.

పట్టాభిని కలిసిన వంగవీటి రాధ: వైసీపీపై సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   20 Oct 2021 10:30 AM GMT
పట్టాభిని కలిసిన వంగవీటి రాధ: వైసీపీపై సంచలన వ్యాఖ్యలు
X
ఏపీలో రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న టీడీపీ సీనియర్ నేత కొమ్మినేని పట్టాభిరామ్ ఇంటిపై, టీడీపీ కార్యాలయాలపై వైసీపీ నాయకులు దాడులు నిర్వహించారని టీడీపీ పార్టీ ఆరోపిస్తోంది. ఇందుకు ఆ పార్టీ రకరకాలుగా నిరసనలు తెలుపుతున్నారు. సీఎం జగన్ పై పట్టాభిరామ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆ పార్టీ కార్యకర్తలు కొందరు పట్టాభి ఇంట్లో హంగామా చేశారనని అంటున్నారు.

అంతేకాకుండా మహిళలను అని చూడకుండా కొందరు మహిళా వైసీపీ కార్యకర్తలు సైతం పట్టాభి ఇంట్లోకి చొరబడ్డారని, దీంతో పట్టాభి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ఇందుకు నిరసనగా టీడీపీ నేడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలపునిచ్చింది.

ఈ సందర్భంగా పట్టాభిని పలువురునాయకులు పరామర్శిస్తున్నారు. ఇందులో భాగంగా టీడీపీ నేత వంగవీటి రాధ పట్టాభి ఇంటికి స్వయంగా వెళ్లారు. దాడి విషయాలను అడిగి తెలుసుకున్నారు. పట్టాభిపై, టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడులను ఆయన వ్యతిరేకించారు. ప్రభుత్వం అరాచకాలు ఎక్కువయ్యాయని, ఇకనైనా మానుకోకపోతే పతనం తప్పదన్నారు. ముఖ్యంగా మహిళలలు, చిన్నపిల్లలు అని చూడకుండా పట్టాభి ఇంట్లోకి చొరబడడం హేయమైన చర్యగా అభివర్ణించారు.

ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో క్రైస్తవ సమాజికవర్గం నీచ రాజకీయాలకు పాల్పడుతోందని, ఇదంతా గుణదల నీచ రాజకీయాలు అని అన్నారు. గుణదల రాజకీయాలు మళ్లీ పురుడు పోసుకుంటున్నాయని విమర్శంచారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ నాయకులే లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారని, ఈ అరాచకం ఎంతో కాలం కొనసాగదని అన్నారు. ఇక అధికార నాయకులు దౌర్జన్యంగా దాడులు చేస్తుంటే పోలీసులు ఏం చేయలేని స్థితిలో ఉన్నారని విమర్శించారు. పోలీసులను అడ్డుగా పెట్టుకొని వైసీపీ ప్రభుత్వం అరాచకం సృష్టిస్తోందన్నారు.

పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందనడానికి ఇంతకుమించిన సాక్ష్యం లేదన్నారు. ఈ దాడులకు త్వరలోనే ముగింపు పలకాలని ఆ సమయం దగ్గర్లోనే ఉందని అన్నారు. అయితే గత కొద్దిరోజుల కిందట ఆయన మంత్రి కొడాలి నానితో అనుకోకుండా కలిశారు. దీంతో ఆయన వైపీపీలో చేరుతారంటూ ప్రచారం సాగిన సమయంలో తాజాగా ఆయన పట్టాభిని పరామర్శించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇదిలా ఉండగా టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడికి నిరసనగా ఆ పార్టీ బుధవారం బంద్ కు పిలుపునిచ్చింది. అంతేకాకుండా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 36 గంటల దీక్ష చేపడుతున్నట్లు ప్రకటించారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. అయితే టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. టీడీపీ నాయకులు బుద్దా వెంకన్న కర్రలతో రోడ్లపైకి వచ్చారు. ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు అక్కడికి వెళ్లడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట సాగింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఇక టీడీపీ కార్యాలయానికి కూత వేటు దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉన్నా ఎవరూ పట్టించుకోలేదని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. సీఎం జగన్, డీజీపీ కుమ్మక్కై ఈ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. డీజీపీ ఆదేశానుసారమే ఈ దాడులు జరిగాయని, లేకపోతే వారు ఉండే ప్రాంతంలో కత్తులు, సుత్తెలతో వస్తారా...? అని ప్రశ్నించారు. డీజీపీకి ఫోన్ చేసిన ఫోన్ తీయలేదని, ఆయన అపరాధి కాదా..? అని ప్రశ్నించారు.

ఏపీలో ప్రజలకు బతికే హక్కు లేదని, ప్రాథమిక హక్కులను హరిస్తారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్ర డీజీపీ రాజీనామా చేయాలని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు డిమాండ్ చేశారు. డీజీపీ వైఫల్యం వల్లే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు.