Begin typing your search above and press return to search.

వంగవీటి సంచలనం ....ఏపీ రాజకీయాల్లో బిగ్ సౌండ్.... ?

By:  Tupaki Desk   |   7 March 2022 10:30 AM GMT
వంగవీటి సంచలనం ....ఏపీ రాజకీయాల్లో బిగ్ సౌండ్.... ?
X
వంగవీటి మోహన రంగా అంటే ఒక బలమైన సామాజిక వర్గానికి పూనకాలు వస్తాయి. ఆయన కుమారుడు, రాజకీయ వారసుడు రాధాక్రిష్ణది అచ్చంగా రెండు దశాబ్దాల రాజకీయం. ఆయన ఫస్ట్ టైమ్ 2004లో కాంగ్రెస్ తరఫున రాజకీయాల్లోకి అరగేట్రం చేశారు. తొలి ప్రయత్నంలోనే గెలిచారు. ఇక 2009లో విశాఖ సెంట్రల్ నుంచి ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి ఓడారు. అలాగే 2014లో విశాఖ తూర్పు నుంచి మళ్లీ వైసీపీ నుంచి పోటీ చేసినా ఓటమే వరించింది. 2019 ఎన్నికల ముందు టీడీపీలో చేరినా టికెట్ దక్కలేదు.

మొత్తానికి చూస్తే రాధా 2019 ఎన్నికల ముందు వేసిన రాంగ్ స్టెప్ వల్లనే ఆయన రాజకీయంగా ఇపుడు ఇబ్బందులు పడుతున్నారు అన్న చర్చ అయితే ఉంది. వైసీపీలో బలమైన నేతగా ఉన్న ఆయన విశాఖ సెంట్రల్ సీటు కోసం పట్టుబట్టి మరీ వైసీపీకి దూరం అయ్యారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. దాంతో ఆయన గత పన్నెండేళ్ళుగా విపక్షంలోనే ఉన్నట్లు అయింది.

ఇక ఈ మధ్య రంగా విగ్రహావిష్కరణ సభలో ఆయన మాట్లాడుతూ తనను ఏ రాజకీయ పార్టీ సరిగ్గా ఉపయోగించుకోవడంలేదు అని హాట్ కామెంట్స్ చేశారు. ఇక ఆయన కాపులకు ప్రతినిధిగా రంగా వారసుడిగా ఎదగాలని చూస్తున్నారని చెబుతున్నారు. కేవలం తాను ఎమ్మెల్యేగా గెలిస్తే చాలదని, ఏపీలో కాపులకు ఐకాన్ గా మారాలని రాధా గట్టిగా భావిస్తున్నట్లుగా ఉంది.

ఏపీ రాజకీయాల్లో చూసుకుంటే రంగా తరువాత చాలా వరకూ ముద్రగడ పద్మనాభం కాపులకు ప్రతినిధిగా ఉంటూ వచ్చారు. ఈ మధ్యనే ఆయన తాను కాపులతో పాటు ఇతర బహుజనులకు కూడా ఒక చోట చేర్చాలని చూస్తున్నారు. ఆయన ఫ్యూచర్ రాజకీయాలు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియడంలేదు. కానీ రాధాక్రిష్ణ యువకుడు. బోలెడు భవిష్యత్తు ఉన్న వారు. పైగా కాపులకు రంగా తనయుడిగా ఆయన అంటే చాలా అభిమానం ఉంది.

దాన్ని రాధా కూడా ఇప్పటిదాకా కరెక్ట్ గా ఉపయోగించుకోలేదు అన్న మాట అయితే ఉంది. చాలా మంది నాయకులు కాపు కార్డుని ఉపయోగించుకుంటూ పెద్ద నాయకులు అవుతున్నారు. ఇక ఈ మధ్య తరచూ కాపుల పేరిట భేటీలు కూడా జరుగుతున్నాయి. అయితే మొదట్లో వాటికి అటెండ్ అయిన రాధా ఇపుడు దూరంగా ఉంటున్నారు. అక్కడ నాయకులు కాపుల పేరిట తాము నాయకత్వం వహించాలని చూస్తున్నారు. ఒక మాజీ మంత్రి ఈ దిశగా చాలా కష్టపడుతున్నారు.

దాంతో రాధా తాను సొంతంగానే కాపులకు ప్రతినిధిగా, ఏపీ రాజకీయాల్లో కీలక నేతగా ఎదగాలని చూస్తున్నాట్లుగా చెబుతున్నారు. ఈ మధ్య ఆయన దూకుడు పెంచడం కూడా అందులో భాగమే. ఎక్కడ రంగా విగ్రహావిష్కరణ ఉన్నా రాధాను పిలుస్తున్నారు. ఆయన కాదనకుండా వచ్చి అక్కడ తమ సామాజికవర్గానికి ఉత్తేజం కలిగించేలా స్పీచులు ఇస్తున్నారు

ఇక 2024 ఎన్నికలలో కాపుల ప్రాధాన్యత చాలానే ఉంది. దాంతో రాధా దాన్ని దృష్టిలో పెట్టుకుని రంగా వారసుడిగా తన సత్తా చాటాలని చూస్తున్నారు. ఇక ఆయన క్రిష్ణా జిల్లాలో కాపు నేతలతో విస్తృతంగా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. కాపులను ఒక త్రాటి మీదకు తీసుకువచ్చేందుకు కూడా చూస్తున్నారు. మొత్తానికి ఏపీలో కాపులకు రంగా ఆరాధ్యనీయుడు. ఆయన తనయుడు ఇపుడు తాను పెద్ద దిక్కుగా ఉంటాను అంటే నో చెప్పరంటే చెప్పరు.

అయితే వర్తమాన రాజకీయాలను కూడా గమనంలోకి తీసుకుని దానికి అనుగుణంగా రాధా పావులు కదిపితే ఆయన పెద్ద నాయకుడు అవడమే కాదు, రంగాకు సిసలైన వారసుడిగా నిలుస్తారు అంటున్నారు. మొత్తానికి ఏపీ రాజకీయాల్లో సంచలనం నమోదు చేయడానికి రాధా కసరత్తు అయితే గట్టిగానే చేస్తున్నారు. మరి చూడాలి ఆ సెన్సేషన్ ఏ రూపంలో ఉంటుందో.