Begin typing your search above and press return to search.

ఎంపీ అభ్యర్ధిగా వంగవీటి రాధా... ?

By:  Tupaki Desk   |   7 Jan 2022 3:30 PM GMT
ఎంపీ అభ్యర్ధిగా వంగవీటి రాధా... ?
X
క్రిష్ణా జిల్లా రాజకీయాల్లో ఇపుడు వంగవీటి రాధా పేరు పెద్ద ఎత్తున మారుమోగుతోంది. ఆయన కోసం అధికార వైసీపీ ఇటు టీడీపీ గట్టిగానే దృష్టి పెట్టాయి. టీడీపీలో ఉన్న రాధాను వైసీపీలోకి తీసుకురావడానికి ఫ్యాన్ పార్టీ నేతలు వేసిన ఎత్తులు విఫలం అయ్యాయి. మరో వైపు చంద్రబాబు చాలా వ్యూహాత్మకంగా కదిపిన పావులతో రాధ టీడీపీలోనే హ్యాపీగా ఉండాలని డిసైడ్ అయ్యారు. చంద్రబాబు లాంటి దిగ్గజ నేత నేరుగా రాధా ఇంటికి వెళ్లి మరీ ఆయనతో ముచ్చటించి వచ్చారు. టీడీపీలో అన్ని విధాలుగా రాధాకు అండగా ఉంటామని కూడా బాబు హామీ ఇచ్చారు.

ఇదిలా ఉండగానే బెజవాడ టీడీపీలో ఒక్కసారిగా రాధాకు పొలిటికల్ సీన్ మారిపోయింది. ఆయన వీవీఐపీ అయిపోయారు. ఆయన ఏది కోరుకుంటే అది అన్నట్లుగా టీడీపీలో అన్ని ఆప్షన్లూ ఆయన కోసం క్యూ కడుతున్నాయి. ఆయన కోరుకున్న సీటు చిటికలో ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు.

ఈ క్రమంలో రాధా ఏ సీటు కోరతాడు, ఎవరికి చెక్ పడిపోతుంది అన్న బెంగా బెదురు అయితే క్రిష్ణా జిల్లా తమ్ముళ్లలో ఉన్నాయి. మరో వైపు రాధాకు ఆప్షన్లు ఇస్తూనే టీడీపీ అధినాయకత్వం కూడా ఆయన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుందామని మాస్టర్ ప్లాన్స్ వేస్తోంది. రాధాను కేవలం ఒక ఎమ్మెల్యేగా నిలబెట్టి అక్కడికే పరిమితం చేయడం కాకుండా ఆయన్ని ఎంపీగా పోటీకి పెడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

రాధాను అయితే విజయవాడ, లేకపోతే మచిలీపట్నం నుంచి ఎంపీ క్యాండిడేట్ గా బరిలో దింపితే టీడీపీకి బహుళ ప్రయోజనాలు కలుగుతాయని అంటున్నారు. విజయవాడలో ఇప్పటికే రెండు సార్లు ఎంపీగా పోటీ చేసి గెలిచిన కేశినేని నాని మీద సహజంగానే వ్యతిరేకత ఉంటుంది. దాంతో ఫ్రెష్ క్యాండిడేట్ గా రాధాను పోటీలో పెడితే ఆయన గెలవడమే కాకుండా తన పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ సీట్లలో కూడా బలమైన సామాజికవర్గాన్ని ఈ వైపుగా మళ్ళించి టీడీపీ ఘన విజయానికి దోహదపడతారు అన్న ప్లాన్స్ ఏవో టీడీపీ పెద్దలకు ఉన్నాయట.

మరో వైపు చూసుకుంటే మచిలీపట్నం ఎంపీ సీటు కూడా ఉంది. అక్కడ బలమైన కాపు సామాజికవర్గం ఎక్కువ. అక్కడ నుంచి ప్రస్తుతం వైసీపీకి చెందిన బాలశౌరి ఎంపీగా ఉన్నారు. ఆయన మీద రాధాను నిలిపితే కచ్చితంగా గెలవడమే కాదు, ఆ పరిధిలో ఉన్న ఎమ్మెల్యే సీట్లను కూడా టీడీపీ సులువుగా గెలుచుకునే వీలు ఉంటుందని కూడా ఆలోచిస్తున్నారుట.

మరి రాధా ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలియదు అంటున్నారు. ఎందుచేతనంటే రాధాకు గత ఎన్నికల్లో జగన్ మచిలీపట్నం ఎంపీ సీటునే చూపించి పోటీ చేయమని కోరారు. రాధా మాత్రం విజయవాడ సెంట్రల్ సీటుని కోరుకున్నారు. దాంతో పాటుగా వైసీపీలో తనకు ఆదరణ సరిగ్గా లేదని చెప్పి ఆయన పార్టీని వీడిపోయారు.

అయితే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని రాధాకు ఉందని అప్పట్లో వినిపించింది. మరి ఇపుడు టీడీపీ ఆయన్ని ఎంపీ క్యాండిడేట్ గా బరిలోకి దింపితే ఓకే అంటారా అన్న చర్చ కూడా ఉంది. అయితే చంద్రబాబు రాధాకు టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. దాంతో బాబు కనుక పోటీ చేయాలని చెబితే రాధా సరేనని అనే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. మొత్తానికి రాధాని ఎంపీగా బరిలోకి దింపి క్రిష్ణా జిల్లాలో మొత్తం ఎమ్మెల్యే సీట్లను గెలుచుకోవడానికి టీడీపీ పక్కాగా మాస్టర్ స్ట్రాటజీ రూపకల్పన చేసిందని చెబుతున్నరు. మరి చూడాలి ఏం జరుగుతుందో.