Begin typing your search above and press return to search.

నడుచుకుంటూ వెళుతున్న ఫైర్ బ్రాండ్ ను పోలీస్ వ్యాన్ లో పడేశారట

By:  Tupaki Desk   |   29 Oct 2022 4:39 AM GMT
నడుచుకుంటూ వెళుతున్న ఫైర్ బ్రాండ్ ను పోలీస్ వ్యాన్ లో పడేశారట
X
నిరసన అంటేనే రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికార పక్షాలు ఉలిక్కిపడుతున్నాయి. గతంలో నిరసన చేపట్టే వారి కారణంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడితే తప్పించి.. పోలీసులు పెద్దగా కలుగజేసుకునే వారు. తేడా వస్తే మాత్రమే ఎంట్రీ ఇచ్చేవారు. కానీ.. కొన్నేళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త కల్చర్ తెర మీదకు తీసుకొచ్చాయి అధికారపక్షాలు. రాజకీయ ప్రత్యర్థులు చేపట్టే నిరసనలు.. ఆందోళనలపై ఉక్కుపాదం మోపటమే కాదు.. పోలీసుల్ని సైతం ప్రయోగిస్తున్న వైనం తరచూ వివాదాస్పదమవుతోంది.

ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లుగా పిలుపు ఇచ్చినంతనే.. వారిని హౌస్ అరెస్టు చేయటం.. బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవటం.. అవసరమైతే వారిని అదుపులోకి తీసుకోవటం లాంటివి ఈ మధ్యన రోటీన్ గా మారాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి ఏపీలోని విశాఖపట్నంలో చోటు చేసుకుంది. రిషికొండ భూముల్ని అధకారపక్ష నేతలు స్వాహా చేశారన్న ఆరోపణల వేళ.. ఈ ఉదంతంపై తమ నిరసనను వ్యక్తం చేసేందుకు విపక్ష టీడీపీ నేతలు పిలుపునిచ్చారు.

దీంతో.. ఈ నిరసనకు హాజరవుతారన్న ఉద్దేశంతో విశాఖ పోలీసులు పెద్ద ఎత్తున మొహరించటమే కాదు.. టీడీపీ నేతలు ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఆంక్షలు విధించారు. అయితే.. టీడీపీ మహిళా ఫైర్ బ్రాండ్ గా సుపరిచితురాలైన తెలుగు మహిళా రాష్టర అధ్యక్షురాలు వంగలపూడి అనిత పోలీసులకు తన తీరుతో సవాలు విసిరారు. విశాఖలోని పెద వాల్తేరు డాక్టర్స్ కాలనీలో ఉంటున్నారు. తాజా నిరసన నేపథ్యంలో ఆమె పార్టీ కార్యాలయానికి బయలుదేరారు.

ఇంట్లో నుంచి బయటకు వచ్చి కారు ఎక్కే ప్రయత్నం చేయగా.. స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. ఇంట్లో నుంచి బయటకు రాకుండా నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆమె.. నోటీసులు తీసుకోవటానికి ససేమిరా అన్నారు. అంతేకాదు.. ఇంట్లో నుంచి బయటకు రానివ్వకుండా.. కారు ఎక్కకుండా అడ్డుకుంటున్న పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నడక మార్గాన్ని ఆశ్రయించారు.

అయితే.. ఆమెను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఆమెను వెంబడించిన పోలీసులు ఆమెను పోలీసు వ్యాన్ ఎక్కాలని పలుమార్లు కోరారు. అందుకు ఆమె ససేమిరా అన్నారు. రోడ్డు మీద నడుస్తూనే పార్టీ కార్యాలయానికి వెళ్లే ప్రయత్నం చేశారు. తామెంతగా ప్రయత్నించినా అనిత తమ మాట వినకపోవటంతో.. పోలీసులు తమదైన శైలిలో ఆమెను రోడ్డు మీదనే లిఫ్టు చేసి వాహనంలో పడేశారు. మొత్తంగా చూస్తే.. రోడ్డు మీద నడుస్తూ వెళుతున్న ఆమెను బలవంతంగా చుట్టుముట్టి.. ఆమెను పోలీసు వాహనంలో పడేశారు.

దీనిపై అనిత తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆమెను కైలాసగిరి పోలీస్ బ్యారెక్స్ కల్యాణ మండపానికి తరలించారు. ఉదయం అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను సాయంత్రం నాలుగు గంటల పాటు తమతోనే ఉంచి.. రాత్రి ఏడు గంటల ప్రాంతంలో విడుదల చేశారు. దీనిపై అనిత మాట్లాడుతూ.. తాను రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతుంటే వెంబడించి బలవంతంగా వ్యాన్ ఎలా ఎక్కిస్తారని ప్రశ్నించారు.

తాను జాతీయ మహిళా కమిషన్ కు.. జాతీయ మానవ హక్కుల కమిషన్ కు కూడా కంప్లైంట్ చేస్తానని పేర్కొన్నారు. పోలీసుల తీరుపైన కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేస్తున్నారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వారిని బలవంతంగా పోలీసు జీపులోకి ఎలా ఎక్కిస్తారని ప్రశ్నిస్తున్నారు. అధికారం ఎవరి చేతుల్లో ఉంటే.. వారికి అనుగుణంగా పోలీసులు వ్యవహరిస్తున్నారన్న దానికి నిదర్శనంగా అనిత ఎపిసోడ్ చెప్పొచ్చన్న మాట వినిపిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.