Begin typing your search above and press return to search.

తెలుగోళ్ల వందే భారత్ రైలు రెఢీ.. ఈ నెలలోనే.. ప్రారంభించేదెవరంటే?

By:  Tupaki Desk   |   4 Dec 2022 4:22 AM GMT
తెలుగోళ్ల వందే భారత్ రైలు రెఢీ.. ఈ నెలలోనే.. ప్రారంభించేదెవరంటే?
X
రైలు కదిలిన రెండు నిమిషాల వ్యవధిలోనే గంటకు 160 కిలోమీటర్ల వేగంతో.. గరిష్ఠంగా గంటకు 180కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే వందే భారత్ రైలు తెలుగు లోగిళ్లకు వచ్చే ముహుర్తం ఖరారైంది. త్వరలోనే వందే భారత్ రైలును తెలుగు రాష్ట్రాల మధ్య నడిపేందుకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. కొత్త సంవత్సరానికి ముందే.. డిసెబరులోనే ఈ రైలును పట్టాల మీద పరుగులు తీయించేందుకు కేంద్ర రైల్వే శాఖ సిద్దమవుతోంది.

కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్న కిషన్ రెడ్డి ప్రత్యేకంగా ఫాలో అప్ చేయటంతో వందే భారత్ రైలును తెలుగు రాష్ట్రాల్లో తిప్పేందుకు వీలుగా ప్రణాళిక సిద్ధమైందని చెబుతున్నారు. ఆయన చొరవే కారణంగా చెబుతున్నారు. ఈ రైలును తెలంగాణలోని సికింద్రాబాద్ నుంచి ఏపీలోని విజయవాడ మధ్య తొలుత పరుగులు తీస్తుందని తేల్చారు. ప్రస్తుతం సీట్లు మాత్రమే ఉన్న ఈ రైలును బెర్తుల బోగీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత విశాఖపట్నం వరకు పొడిగించేలా ప్లాన్ చేశారు.

ప్రస్తుతం వందే భారత్ రైళ్లలో కూర్చునే సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నందున విజయవాడ వరకే నడపాలని నిర్ణయించారు. ఇదిలా ఉంటే.. సికింద్రాబాద్ - విజయవాడలకు రెండు వేర్వేరు ట్రాక్ లు ఉండటం తెలిసిందే. సికింద్రాబాద్ - విజయవాడ వయా కాజీపేట మార్గంలో గరిష్ఠ వేగం గంటకు 130కిలోమీటర్లు కాగా.. సికింద్రాబాద్ - గుంటూరు వయా నల్గొండ మార్గంలో గరిష్ఠ వేగం గంటకు 110 కిలోమీటర్లు మాత్రమే. దీంతో వందే భారత్ రైలుకు అనువుగా ట్రాక్ సామర్థ్యాన్ని 180కిలోమీటర్ల వేగానికి సరిపడేలా తీర్చిదిద్దుతున్నారు.

ఈ రైలు అందుబాటులోకి వస్తే ఇప్పటివరకు ఐదు గంటల పాటు సాగుతున్న ప్రయాణం.. మూడు గంటల్లోనే ముగిసిపోనుంది. రానున్న రోజుల్లో విశాఖపట్నం.. తిరుపతి పట్టణాల మధ్య వేర్వేరుగా వందే భారత్ రైళ్లను నడిపేందుకు వీలుగా కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా మొదలుకానున్న వందే భారత్ రైలు బండి ప్రారంభోత్సవాన్ని తమ ఇమేజ్ పెంచుకునేందుకు వీలుగా బీజేపీ ప్లాన్ చేస్తోంది.

ఈ రైలును ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ చేత చేపట్టాలని భావిస్తున్నారు. దీనికి ప్రయత్నాలు మొదలయ్యాయి. ట్రాక్ అప్ గ్రేడింగ్.. సిగ్నలింగ్ పనులు.. రైలు టైంటేబుల్ సర్దుబాటుకు సంబంధించిన కసరత్తు జోరుగా సాగుతోంది. ఇది పూర్తికాగానే ఈ రైలుకు పచ్చజెండా ఎప్పుడూ ఊపాలా అన్నది నిర్ణయిస్తారని చెబుతున్నారు.

ఈ రైలుతో పాటు బీబీ నగర్ లో ఏర్పాటు చేయదలిచిన ఎయిమ్స్ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా ప్రధాని మోడీ చేతుల మీదుగా చేపట్టాలని భావిస్తున్నారు. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ విపక్ష్ బీజేపీల మధ్య రాజకీయ అధిపత్య పోరు అంతకంతకూ పెరుగుతున్న వేళ.. తెలంగాణకు కేంద్రం ఏమీ చేయట్లేదన్న వాదనను కేసీఆర్ సర్కారు వినిపిస్తుంటే.. అందుకు భిన్నంగా కేంద్రం దన్ను తెలంగాణ రాష్ట్రానికే ఉందన్న విషయాన్ని తెలియజేయాలన్న ఆలోచనతో బీజేపీ నేతలు ఉన్నారు. ఇందులో భాగంగా వందేభారత్ రైలు.. బీబీ నగర్ ఎయిమ్స్ రెండూ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు వీలుగా కార్యక్రమాల్ని చేపట్టనున్నారు. మరి.. దీనికి తెలంగాణ అధికారపక్షం ఏ రీతిలో రియాక్టు అవుతుందో చూడాలి.