Begin typing your search above and press return to search.

తెలంగాణ‌లో మ‌రో ఎమ్మెల్యే రాజీనామా!!

By:  Tupaki Desk   |   2 Oct 2016 8:06 AM GMT
తెలంగాణ‌లో మ‌రో ఎమ్మెల్యే రాజీనామా!!
X
తెలంగాణ సీఎం కేసీఆర్ ఏ టైంలో జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారో తెలీదు కానీ.. అప్ప‌టి నుంచి ఆయ‌న‌కు నిద్ర ప‌ట్ట‌డం లేదు! కొత్త జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రంలో పాల‌న మ‌రింత మెరుగ‌వుతుంద‌ని, బంగారు తెలంగాణ సాకార‌మ‌వుతుంద‌ని భావించిన కేసీఆర్ ఇప్పుడున్న 10 జిల్లాల‌ను 27 జిల్లాలుగా చేయాల‌ని ప‌క్కాప్లాన్‌ తో సిద్ధ‌మైపోయారు. అయితే, త‌మ ప్రాంతాన్ని జిల్లాగా ప్ర‌క‌టించాలంటే.. త‌మ ప్రాంతాన్ని జిల్లా చేయాలంటూ సొంత పార్టీ టీఆర్ ఎస్ స‌హా కాంగ్రెస్ నేత‌లు భారీ ఎత్తున ఆందోళ‌న‌కు దిగారు. వ‌రంగ‌ల్‌ - క‌రీంన‌గ‌ర్‌ - మ‌హ‌బూబ్‌ న‌గ‌ర్ జిల్లాల్లో ఆందోళ‌న‌లు పెద్ద ఎత్తున సాగాయి. ముఖ్యంగా సీఎం కుమారుడు కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న సిరిసిల్ల‌ను జిల్లా కేంద్రంగా ప్ర‌క‌టించాల‌ని కోరుతూ అక్క‌డి విప‌క్షాల‌తో జ‌త‌క‌ట్టిన టీఆర్ ఎస్ నేత‌లు పెద్ద ఎత్తున కేటీఆర్‌ పై ఒత్తిడి తెచ్చారు.

అయితే, సిరిసిల్ల‌ను జిల్లా చేయ‌డం సాధ్యం కాద‌ని తేల్చి చెప్పిన కేటీఆర్ టీఆర్ ఎస్ నేత‌ల‌కు గ‌ట్టి వార్నింగే ఇచ్చారు. ఇక‌, వ‌రంగ‌ల్‌ లోని జ‌న‌గాను జిల్లా కేంద్రంగా ప్ర‌క‌టించాల‌ని భారీ ఆందోళ‌న‌లే జ‌రిగాయి. బంద్ కూడా జ‌రిగింది. ఆ త‌ర్వాత కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని కొన్ని మండ‌లాల‌ను విడ‌దీస్తున్నార‌ని, ఇది రాజ‌కీయ కుట్ర‌తోనే జ‌రుగుతోంద‌ని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు సంధించారు. ఇదే లైన్‌ లోకి వ‌చ్చేసిన కాంగ్రెస్ మాజీ మంత్రి - గ‌ద్వాల్ ఎమ్మెల్యే డీకే అరుణ కూడా గ‌ద్వాల్‌ ను జిల్లా కేంద్రంగా ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేశారు. అంతేకాదు, నిరాహార దీక్ష‌కు - రోడ్ల దిగ్బంధానికి కూడా ఆమె కూర్చున్నారు.

అయిన‌నూ కేసీఆర్ ఏమీ స్పందించ‌క‌పోవ‌డంతో ఆఖ‌రి అస్త్రంగా ఆమె తన ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేశారు. శ‌నివారం త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తూ. గ‌ద్వాల్‌ ని జిల్లా కేంద్రంగా ప్ర‌క‌టించాల‌ని కోరుతూ.. రెండింటినీ జ‌త చేసి సీఎం కేసీఆర్‌ కు పంపారు. మ‌రి దీనిపై ఎలాంటి నిర్ణ‌యం వెలువ‌డుతుందో చూడాలి. కానీ.. పొలిటిక‌ల్‌ గా మాత్రం డీకే చ‌ర్య తీవ్రంగా కుదిపేసింది. ఇక‌, ఇప్పుడు డీకే బాట‌లో అదే జిల్లాకు చెందిన క‌ల్వ‌కుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌ రెడ్డి ప‌య‌నిస్తున్నారు. జిల్లాల విభ‌జ‌న అంశం తెర‌మీద‌కి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి త‌న నియోజ‌క‌వ‌ర్గం క‌ల్వ‌కుర్తిని రెవెన్యూ డివిజ‌న్ చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేస్తున్నారు.

తమ ప్రాంత ప్రజల ఆకాంక్ష అయిన క‌ల్వ‌కుర్తి రెవెన్యూ డివిజ‌న్‌ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని తాజాగా ప్ర‌క‌టించి మ‌రో బాంబు పేల్చారు. వాస్త‌వానికి త‌న‌ను పార్టీ మారాల‌ని ఒత్త‌డి వ‌చ్చింద‌ని, కాంగ్రెస్‌ను విడిచిపెట్టి కారెక్కితే.. కోరుకున్న‌ది జ‌రుగుతుంద‌ని కొంద‌రు స‌ల‌హా ఇచ్చార‌ని ఆయ‌న అన్నారు. అయినా.. తాను ఎట్టి ప‌రిస్థితిలోనూ కారెక్కేది లేద‌ని అన్నారు. ప‌ద‌వికి రాజీనామా చేసైనా ప్ర‌జ‌ల మ‌నోభీష్టం నెర‌వేర్చుతాన‌ని చెప్పారు. మొత్తానికి ఈ ప‌రిణామాలు సీఎం కేసీఆర్‌కు త‌ల‌నొప్పిగానే ప‌రిణ‌మించాయ‌ని అంటున్నారు పొలిటిక‌ల్ పండితులు!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/