Begin typing your search above and press return to search.

వామన్ రావు చివరి మాటలు ..సూత్రధారులు వారేనంటూ షాకింగ్ వీడియో బయటపెట్టిన ఎంపీ రేవంత్ రెడ్డి!

By:  Tupaki Desk   |   19 Feb 2021 6:30 PM IST
వామన్ రావు చివరి మాటలు ..సూత్రధారులు వారేనంటూ షాకింగ్ వీడియో బయటపెట్టిన ఎంపీ రేవంత్ రెడ్డి!
X
తెలంగాణ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న న్యాయవాద దంపతుల హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హైకోర్టులో పనిచేసే న్యాయవాదులు వామన్ రావు, ఆయన భార్య నాగమణిపై పగతోనే ఈ దారుణానికి తెగబడినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆడియో టేపు వ్యవహారం, సుఫారీ గ్యాంగ్ తో మాట్లాడిన మాటలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

వామన్ ‌రావు దంపతులు మంథని నుంచి హైదరాబాద్‌ కు కారులో వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రామగిరి మండలం సమీపంలో వీరి కారును మరో కారులో వచ్చిన గుర్తు తెలియని దుండగులు అడ్డగించారు. అనంతరం వారిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో దంపతులిద్దరు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. అనంతరం వారిని స్థానికులు పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. ఈ ఘటనపై కాస్తా రాజకీయంగా కూడా తీవ్ర రచ్చ జరుగుతోంది. టీఆర్ ఎస్ ప్రముఖ నేతకు ఈ హత్యలో హస్తం ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఇప్పటికే ఈ హత్య కేసులో పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధు మేనల్లుడు అరెస్టు కావడం కూడా సంచలనంగా మారింది. అధికార పార్టీ అగ్రనాయకుల కనుసన్నల్లోనే లాయర్ దంపతుల హత్య జరిగిందని.. నేతలపై హైకోర్టులో కేసులు వేసి పోరాడుతున్న వామన్ రావుని అడ్డు తొలగించుకునేందుకే చంపేశారని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి.

అయితే ఈ హత్యలు ముమ్మాటికీ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రోద్బలంతోనే జరిగాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. హత్యకు పాల్పడింది పాత్రధారులేనని.. అసలు సూత్రధారులు ప్రభుత్వ పెద్దలేనని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అందుకు సాక్ష్యంగా రోడ్డుపై పడిపోయిన వామన్ రావు చివరి మాటల వీడియోను పోస్ట్ చేశారు. కత్తిపోట్లకు గురైన లాయర్ వామన్ రావు.. రక్తగాయాలతో నడిరోడ్డుపై పడిపోయి టీఆర్‌ ఎస్ నాయకుడు, జడ్పీ చైర్మన్ పుట్ట మధు పేరు చెబుతున్న వీడియో సంచలనంగా మారింది. తనను చంపించింది పుట్ట మధు అంటూ వామన్ రావు చేసిన చివరి వ్యాఖ్యలను మరణ వాంగ్మూలంగా రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

న్యాయవాది వామ‌న్ రావు మ‌ర‌ణ వాంగ్మూలంల టీఆర్ఎస్ పార్టీకి చెందిన‌ ముఖ్య‌నేత‌ల పేర్లు చెప్పారని రేవంత్ రెడ్డి అన్నారు. అయితే ప్ర‌భుత్వం వారిని కాపాడే ప్ర‌య‌త్నం చేస్తోందని ఆరోపణలు చేశారు. నిందితుల‌పై న్యాయ‌స్థాన‌మే చ‌ర్య‌లు తీసుకోవాలని కోరుతూ రేవంత్ ట్వీట్ చేశారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై, తెలంగాణ సీఎంవో, సీఎస్, డీజీపీ, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను ట్యాగ్ చేస్తూ న్యాయం చేయాలని కోరారు.