Begin typing your search above and press return to search.

డాలర్ తో రూపాయి విలువ రూ.80 దాటేసింది.. మన జీవితంలో ఏమవుతుంది?

By:  Tupaki Desk   |   21 July 2022 5:39 AM GMT
డాలర్ తో రూపాయి విలువ రూ.80 దాటేసింది.. మన జీవితంలో ఏమవుతుంది?
X
గడిచిన కొద్ది రోజులుగా డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.80కు దగ్గరకు వచ్చేస్తుందంటూ భారీ ఎత్తున ఆందోళన.. వార్తలు వస్తున్నాయి. చూస్తుండగానే రూపాయి విలువ డాలర్ తో రూ.80ను దాటేసి.. మరింత ముందుకు పోతోంది. రానున్న రోజుల్లో పడుడే కానీ పెరుగుడు ఉండదన్న మాట వినిపిస్తోంది. అయితే.. రూపాయి విలువ అంతకంతకూ పడిపోవటాన్ని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోడీ సర్కారుకు ఇప్పుడీ అంశం పెద్ద తలనొప్పిగా మారింది. ఓవైపు జీఎస్టీ బాదుడు.. మరోవైపు పెద్ద ఎత్తున డాలర్ తో రూపాయి మారకం విలువ అంతకంతకూ పడిపోవటంపై పలు ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి.

ఇంతకీ.. డాలర్ తో రూపాయి మారకం విలువ తగ్గితే ఏమవుతుంది? మన బతుకుల మీద పడే కొత్త భారం ఏమిటి? లాంటి సందేహాలు పలువురికి వస్తుంటాయి. డాలర్ తో రూపాయి విలువ తగ్గుతున్నకొద్దీ.. మన కొనుగోలు శక్తి తగ్గిపోవటమే కాదు.. ఇప్పుడు చెల్లించే వస్తువుల ధరలు మరింత పెరగనున్నాయి. ఇదంతా సామాన్య.. మధ్యతరగతి జీవుల మీద మరింత భారాన్ని పెంచుతుంది. అదెలానో చూస్తే.. నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు చేతిలో ఉంటున్న సెల్ ఫోన్ సంగతే చూద్దాం. దేశీయంగా ఉత్పత్తి చేస్తున్నా.. దానికి సంబంధించిన వస్తువుల్లో 80 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది.

ఇలాంటప్పుడు దిగుమతి చేసుకునే వస్తువులకు చెల్లించాల్సిన మొత్తాన్ని అమెరికన్ డాలర్లతో పే చేయాల్సి ఉంటుంది. దీనికి రూపాయి విలువ పడిపోయిన నేపథ్యంలో.. ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అంటే.. సెల్ ఫోన్ తో పాటు.. వాటికి సంబంధించిన ఉపకరణాలు కూడా ఖరీదు కానున్నాయన్న మాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో విదేశాలకు వెళ్లటంచాలా ఎక్కువైంది. రూపాయి విలువ ఎక్కువగా ఉన్నప్పుడు.. విమానటికెట్లను కొనుగోలు చేసేది డాలర్లతో కావటంతో.. అందుకు చెల్లించాల్సిన మొత్తం పెరగనుంది.

ఉదాహరణకు కొద్ది రోజుల క్రితం వరకు వెయ్యి డాలర్లు అంటే.. 77 వేల రూపాయిలు లేదంటే రూ.78వేల రూపాయిలు. ఇప్పుడు అది కాస్తా రూ.80వేలకు పైనే చెల్లించాల్సి ఉంటుంది. దీంతో.. విదేశీ ప్రయాణాలు మరింత ఖరీదెక్కనున్నాయి. డాలర్ విలువ పెరిగే కొద్దీ ప్రయాణ టికెట్ విలువ మరింత పెరిగి.. భారంగా మారే పరిస్థితి. టీవీ లేని ఇల్లు ఉండదు. ఆ మాటకు వస్తే.. ఉండేందుకు గూడు లేకున్నా.. వారుండే గుడారాల్లోనూ ఎల్ ఈడీ టీవీలు కనిపిస్తాయి. వీటికి సంబంధించిన టీవీ తెర.. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు.. ఏసీల్లోకంప్రెషనర్ ప్లాస్టిక్ భాగాలు.. ఫ్రిజ్ లోని విడి భాగాలు ఇలా చాలావరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో.. వీటికి సంబంధించిన ధరలకు సైతం రెక్కలు వచ్చేస్తాయి.

మనం ధరించే దేస్తులకు సంబంధించిన డైస్.. రంగులు.. కెమికల్స్ సైతం విదేశాలనుంచి దిగుమతి అయ్యేవే. ఇక.. రెడీమేడ్ దుస్తుల్లో వాడే మెటల్ బటన్లు.. లోగోలు.. కొన్ని రకాల జిప్ లు సైతం విదేశాల నుంచే వస్తుంటాయి. తాజాగా డాలర్ విలువ మరింత పెరగటంతో.. వాటి భారం సైతం మీద పడనుంది. ఇటీవల కాలంలో విదేశాల్లో చదివే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ సందర్భంగా అక్కడ కట్టే ఫీజులు నుంచి ఇతరత్రాలకు డాలర్ల అవసరం ఉంటుంది. ఇప్పుడు డాలర్ల విలువ పెరగటంతో.. చెల్లించాల్సిన రూపాయిలు మరింత ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది.

జనవరిలో డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ రూ.75. ఇప్పుడు అది కాస్తా రూ.80.5 అయ్యింది. రానున్న కొద్ది నెలల్లోనే అది కాస్తా రూ.85కు పెరుగుతుందని చెబుతున్నారు. అదే జరిగితే ప్రతి డాలర్ కొనుగోలుకు మనం వెచ్చించాల్సింది రూ.10 వరకు ఉండనుంది. ఈ లెక్కన చూస్తే.. మన జీవితాల్లో పడే భారం ఏ స్థాయిలో ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. డాలర్ తో రూపాయి మారకం విలువ పెరిగే కొద్దీ.. మన జేబుల మీద భారం అంతకంతకూ పెరుగుతుందన్నది నిజం.