ఎట్టకేలకు భువనేశ్వరికి క్షమాపణ చెప్పిన వల్లభనేని వంశీ

Thu Dec 02 2021 00:19:54 GMT+0530 (IST)

vallabhaneni vamsi says sorry to nara bhuvaneswari

వల్లభనేని వంశీ  ఎట్టకేలకు దిగివచ్చారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై గతంలో వంశీ చేసిన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం ప్రకటించారు. భువనేశ్వరికు ఆయన క్షమాపణ చెప్పారు. తాను భువనేశ్వరిపై పొరపాటున వ్యాఖ్యలు చేశానని తప్పుగా దొర్లిన మాట వాస్తవమని అంగీకరించారు. అందువల్ల క్షమాపణ కోరుతున్నానని తెలిపారు. తనకు టీడీపీలో భువనేశ్వరి అందరికంటే ఆత్మీయరాలని తాను అక్కా అని పిలుస్తానని చెప్పారు. ఆమెతో పాటు తన మాటల వల్ల బాధపడిన వారందరికీ క్షమాపణ చెబుతున్నానని వంశీ ప్రకటించారు.ఓ టీవీ ఛానల్ నిర్వహించిన డిబేట్ వంశీ మాట్లాడారు. తనను కులం నుంచి వెలివేస్తారనే భయంతో క్షమాపణ చెప్పలేదన్నారు. తాను మనస్ఫూర్తిగా క్షమాపణ చెబుతున్నానని చంద్రబాబుకు కూడా క్షమపణ కోరుతున్నానని తెలిపారు. తప్పు జరిగినందుకు పశ్చాత్తాప పడుతున్నానని తెలిపారు. ఈ వివాదంలో అందరూ సంయమనం పాటించాలని కోరారు. తాను అలా మాట్లాడి ఉండకూడదని ఇంకోసారి ఇలాంటి తప్పు దొర్లదని అన్నారు. తాను చదువుకున్నానని జరిగినదానికి వంశీ విచారం వ్యక్తం చేశారు.

ఇటీవల భువనేశ్వరిని ఉద్దేశించి వంశీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద దుమారం రేపాయి.  ఆ తర్వాత  అసెంబ్లీలో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.  అసెంబ్లీలో అనూహ్య పరిణామాల తర్వాత చంద్రబాబు కంటతడి పెట్టుకున్నారు. చివరకు తన సతీమణి ప్రస్తావన సభలో తెచ్చి ఆమె గురించి అసహ్యంగా మాట్లాడారని వాపోయారు. ఆమె వ్యక్తిత్వాన్ని కించపర్చాలని తెలిపారు. రాజకీయ కక్షలు తీర్చుకోవడం కోసం ఇళ్లలో ఉన్న ఆడవాళ్ల పేర్లను తీసుకొస్తారా? అని ప్రశ్నించారు. తమ పార్టీ నాయకులు కూడా చాలామంది ఆవిడకు తెలియదని చంద్రబాబు చెప్పారు.

భువనేశ్వరిపై అసెంబ్లీ వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను ముక్తకంఠంతో తప్పుబట్టారు. ఆమెను నందమూరి కుటుంబం మొత్తం అండగా నిలిచింది. వైసీపీ నేతల వ్యవహారాశైలిపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చే జరిగింది.  మహిళలపై ఇంత దారుణంగా వ్యాఖ్యానించడం ఏమిటని ప్రశ్నించారు. టీడీపీ ఆధ్వర్యంలో అనేక ఆందోళనలు చేశారు. అసెంబ్లీలో వైసీపీ నేతల తీరుపై చంద్రబాబు కంటతడి పెట్టడంపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. అసెంబ్లీ జరిగిన పరిణామాలపై చంద్రబాబు ఉద్వేగంగా మాట్లాడిన తీరు ముఖ్యంగా కన్నీరు పెట్టడం రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులను కదిలించింది.