Begin typing your search above and press return to search.

ఆ నేతకు మంట పుట్టే మాట చెప్పిన వల్లభనేని వంశీ

By:  Tupaki Desk   |   21 Aug 2020 2:30 PM GMT
ఆ నేతకు మంట పుట్టే మాట చెప్పిన వల్లభనేని వంశీ
X
గన్నవరం టీడీపీ టికెట్టు మీద పోటీ చేసి.. ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ చేసిన తాజా వ్యాఖ్యలు కొత్త కలకలానికి తెర తీసినట్లైంది. టీడీపీ ఎమ్మెల్యేగా ఉంటూనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరటం.. తన ఎమ్మెల్య పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించటం తెలిసిందే. ఎమ్మెల్యే పదవికి త్యాగం చేసి మరీ.. ఎన్నికల అగ్నిపరీక్షకు సిద్ధమైన వంశీకి జగన్ టికెట్ ఇస్తారా? లేక.. గతంలో ఆయనపై పోటీ చేసి ఓడిన యార్లగడ్డ వెంకట్రావుకు ఇస్తారా? అన్నది పెద్ద సందేహంగా ఉంది.

ఇదిలా ఉంటే.. తాజాగా వంశీ కీలక వ్యాఖ్య చేశారు. గన్నవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యే.. ఇంఛార్జి రెండూ తననేనని చెప్పారు. తన రాజకీయ ప్రత్యర్థులైన దుట్టా రామచంద్రరావు.. యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి పని చేస్తానని చెబుతూనే.. వారి అవకాశాన్ని తాను సొంతం చేసుకున్న వైనాన్ని చెప్పకనే చెప్పేశారు. తనకు ఎవరితోనూ ఎలాంటి గొడవలు.. అభ్యంతరాలు లేవంటున్నారు.

తన దగ్గరకు కాళ్లకు చెప్పుల్లేకుండా వచ్చిన వారికి సైతం మర్యాదగా ఆహ్వానించి.. మంచి కాఫీ ఇచ్చి.. వారి పని పూర్తి చేసి పంపుతానని చెబుతున్నారు. తాజా వ్యాఖ్యలతో గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో తానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.

పార్టీలోకి చటుక్కున వచ్చేసి.. తన అవకాశాల్ని లాగేసుకుంటున్న వంశీ విషయంలో ఇప్పటికే గుర్రుగా ఉన్న యార్లగడ్డ.. తాజా వ్యాఖ్యలకు ఎలా స్పందిస్తారన్నది సందేహంగా మారింది. ఎన్నికల సమయంలో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో సాగిన సంగతి తెలిసిందే. అలాంటి వంశీకి యార్లగడ్డ.. దుట్టాలు కలిసి వస్తారా? అన్నది సందేహమే. ఒకవేళ కలిసి రాకపోతే.. ఉప ఎన్నికల్లో ఏదైనా అనుకోనిది చోటు చేసుకుంటే?
ఈ ప్రమాదాన్ని వంశీ గుర్తించారా? అన్నది క్వశ్చన్. అలాంటి ఆలోచనే ఉండి ఉంటే.. ఇప్పుడు యార్లగడ్డ.. దుట్టాలకు మండేలా వ్యాఖ్యలు చేయకుండా కామ్ గా ఉంటే సరిపోతుంది కదా. కాగల కార్యాన్ని గంధర్వులే చేసినట్లు.. ఆ టికెట్టు ఏదో జగన్ నోటి నుంచి చెప్పించుకుంటే అయ్యే దానికి.. పెళ్లికి ముందే బాజాలు అవసరమా వంశీ?