Begin typing your search above and press return to search.

మోడీ గ‌తాన్ని తవ్వి తీసి కుప్ప వేసిన య‌శ్వంత్

By:  Tupaki Desk   |   11 May 2019 9:53 AM GMT
మోడీ గ‌తాన్ని తవ్వి తీసి కుప్ప వేసిన య‌శ్వంత్
X
గ‌తంతో గేమ్ ప్లాన్ అంత మంచి వ్యూహ‌మేమీ కాదు. ఎందుకంటే.. ప్ర‌తి ఒక్క‌రి విష‌యంలో గ‌తం గురివింద లాంటిది. పైకి క‌నిపించే ఎరుపుతో కాదు.. క‌నిపించి క‌నిపించ‌ని న‌లుపు కూడా ఉంటుంది. అయితే.. ఎవ‌రెంత టాలెంట్ అంటే అంత‌లా న‌లుపు బ‌య‌ట‌కొచ్చే అవ‌కాశముంది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భాగంగా అదే ప‌నిగా గ‌తాన్ని త‌వ్వి తీస్తూ.. కాంగ్రెస్ అండ్ కోకు చుక్క‌లు చూపిస్తున్న మోడీకి.. ఒక‌నాటి మిత్రుడు తాజాగా గ‌తం తాలుకూ షాక్ ఎలా ఉంటుందో మాట‌ల‌తో చేసి చూపించారు.

నెహ్రూ.. ఇందిరా.. రాజీవ్ గాంధీల పేరుతో గ‌డిచిన కొద్ది రోజులుగా మోడీ అండ్ కో చేస్తున్న విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌ల‌తో కాంగ్రెస్ కిందామీదా ప‌డుతోంది. తాను ప్ర‌యోగించిన గ‌తం అస్త్రం త‌న‌కు దెబ్బేస్తుంద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోయిన మోడీకి.. అదెంత ఇబ్బందిక‌రంగా ఉంటుంద‌న్న విష‌యాన్ని త‌న మాట‌ల‌తో అర్థ‌మ‌య్యేలా చేశారు కేంద్ర మాజీ మంత్రి.. ఒక‌ప్ప‌టికి బీజేపీ నేత య‌శ్వంత్ సిన్హా.

2002లో గోద్రా అల్ల‌ర్ల స‌మ‌యంలో గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ఉన్న మోడీ విష‌య‌మై ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నాటి మార‌ణ‌కాండకు సంబంధించిన కొన్ని కీల‌క అంశాల్ని ఆయ‌న తాజాగా తెర మీద‌కు తెచ్చారు. మోడీని నాటి ప్ర‌ధాని అట‌ల్ బిహారీ వాజ్ పేయ్ ప‌ద‌వి నుంచి తొల‌గించాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని.. ఆయ‌న‌తో రాజీనామా చేయించాల‌ని కూడా అనుకున్నార‌ని చెప్పారు. అందుకు మోడీ నిరాక‌రిస్తే ఏకంగా బీజేపీ స‌ర్కార్ ను ర‌ద్దు చేయాల‌న్న క‌ఠిన నిర్ణ‌యాన్ని వాజ్ పేయ్ అప్ప‌ట్లో ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నార‌ని చెప్పారు.

అయితే.. అందుకు అద్వానీ అడ్డుప‌డ‌టంతో ఆ నిర్ణ‌యాన్ని అమ‌లు చేయ‌లేద‌న్నారు. మోడీని ముఖ్య‌మంత్రి ప‌ద‌వి నుంచి తొల‌గిస్తే.. తాను త‌న కేంద్ర‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని గ‌ట్టిగా చెప్ప‌టంతో వాజ్ పేయ్ త‌న నిర్ణ‌యాన్ని అమ‌లు చేయ‌లేద‌న్నారు. అద్వానీ కార‌ణంగా వాజ్ పేయ్ వెన‌క్కి త‌గ్గాల్సి వ‌చ్చింద‌న్నారు.

మాజీ ప్ర‌ధాని రాజీవ్ గాంధీ ఐఎన్ ఎస్ విరాట్ ను త‌న అవ‌సరాల‌కు వాడుకున్నార‌న్న మోడీ మాట‌ల్ని య‌శ్వంత్ కొట్టిపారేశారు. ప్ర‌ధాని స్థాయిలో ఉన్న వ్య‌క్తి అలాంటి వ్యాఖ్య‌లు చేయ‌టం స‌రికాద‌న్నారు. తాజాగా జ‌రుగుతున్న ఎన్నిక‌లు మోడీ ఐదేళ్ల పాల‌న ఆధారంగా జ‌ర‌గాలే త‌ప్పించి.. చ‌రిత్ర ఆధారంగా జ‌ర‌గ‌కూడ‌ద‌న్నారు. స‌రైన స‌మయంలో య‌శ్వంత్ ఇచ్చిన గ‌తం షాక్ మోడీ ప‌రివారానికి ఇబ్బందిక‌రంగా మారుతుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మవుతోంది.