Begin typing your search above and press return to search.

వాజ్ పేయ్ 30.. మన్మోహన్ 95.. మోడీ 51

By:  Tupaki Desk   |   22 Aug 2016 4:52 AM GMT
వాజ్ పేయ్ 30.. మన్మోహన్ 95.. మోడీ 51
X
సమాచార హక్కు చట్టం పుణ్యమా అని ఆసక్తికర సమాచారం బయటకు వస్తోంది. అధికారిక పత్రాల్లో ఉండిపోయే సమాచారం బయటకు వచ్చి.. ఎవరికేం తెలియాలో అది తెలిసేలా చేస్తుందని చెప్పాలి. తాజాగా సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రధానమంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించిన.. నిర్వర్తిస్తున్న వారి విదేశీ పర్యటనలకు సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది.

ఐదేళ్లు ప్రధానిగా వ్యవహరించిన బీజేపీ తొలి ప్రధాని వాజ్ పేయ్.. పదేళ్లు ప్రధానిగా వ్యవహరించిన మన్మోహన్.. తాజాగా రెండున్నరేళ్లుగా ప్రధాని పదవిలో ఉన్న మోడీకి సంబంధించిన విదేశీ పర్యటనల వివరాలు బయటకు వచ్చాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. వాజ్ పేయ్ ఐదేళ్ల వ్యవధిలో పర్యటించిన దేశాల సంఖ్యను మోడీ రెండున్నరేళ్లలో రెట్టింపునకు దగ్గరిగా ఫారిన్ టూర్లు వేయటం గమనార్హం. అదే సమయంలో పదేళ్లు ప్రధానిగా ఉన్న మన్మోహన్ పర్యటించిన దేశాల్ని.. మోడీ ఐదేళ్ల వ్యవధిలో అధిగమించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్వదేశంలో తక్కువగా.. విదేశాల్లో ఎక్కువగా గడుపుతారంటూ వ్యంగ్య వ్యాఖ్యలు వినిపిస్తున్న వేళ.. ఫారిన్ టూర్ల లెక్కలు బయటకు వచ్చాయి.

ప్రధానుల వారీగా ఫారిన్ టూర్లనుచూస్తే.. ఐదేళ్లు ప్రధానిగా వ్యవహరించిన వాజ్ పేయ్ మొత్తం 19 పర్యటనల్లో 30 దేశాల్లో పర్యటించారు. ఆయన విదేశీ పర్యటనల కారణంగా అయిన ఖర్చు రూ.114.43 కోట్లు. వాజ్ పేయ్ ఫారిన్ టూర్లలో ఎక్కువ ఖర్చు తన టర్కీ.. అమెరికా ఉమ్మడి పర్యటన కోసం రూ.15.84 కోట్లు ఖర్చు చేయగా.. డర్బన్ పర్యటన కోసం అతి తక్కువగా రూ.3.41 కోట్లు ఖర్చు చేయటం గమనార్హం. వాజ్ పేయ్ సగటున ఏడాదికి ఆరు దేశాల చొప్పున పర్యటించారు. మొత్తం 30 దేశాల పర్యటన కోసం పెట్టిన ఖర్చు రూ.144.43 కోట్లుగా తేల్చారు.

పదేళ్లు ప్రధానిగా వ్యవహరించిన మన్మోహన్ విషయానికి వస్తే ఆయన 73 పర్యటనల్లో 95 విదేశీ పర్యటనలు చేశారు. ఈ టూర్లలో ఆయన అమెరికాకే ఎక్కువసార్లు వెళ్లి రావటం గమనార్హం. తన 95 ఫారిన్ టూర్లలో అమెరికాకే పదిసార్లు వెళ్లి రావటం గమనార్హం. ఆ తర్వాతి స్థానాల్లో చైనా.. రష్యాలలో ఆయన పర్యటించారు. తన పదేళ్ల పదవీ కాలంలో పాకిస్థాన్ కు ఒక్కసారీ పర్యటించింది లేదు. బ్యాంకాక్ తో తొలి పర్యటనను షురూ చేసిన మన్మోహన్ మయన్మార్ టూర్ ఆయన ఆఖరి విదేశీ పర్యటనగా చెప్పొచ్చు. బ్రెజిల్ టూర్ కోసం అత్యధికంగా రూ.26.94 కోట్లు ఖర్చు చేయగా.. అతి తక్కువ ఖర్చు ఢాకా పర్యటన కోసం అయ్యింది.ఈ పర్యటన కోసం అయిన ఖర్చు రూ.3.07 కోట్లు మాత్రమే. మౌన ప్రధానిగా అందరూ వ్యవహరించే మన్మోహన్ ఫారిన్ టూర్లను యావరేజ్ చేసి చూస్తే ఏడాదికి 9.5 దేశాలు తిరిగినట్లుగా అర్థమవుతుంది. ఆయన ఫారిన్ టూర్లకు అయిన మొత్తం ఖర్చు రూ.795.17 కోట్లుగా తేల్చారు.

ఇక.. మోడీ విషయానికి వస్తే ఆయన ఇప్పటి వరకూ 51 దేశాల్లో పర్యటించారు. 2014 మే 26న ప్రధానిగా బాధ్యతలుస్వీకరించిన నాటి నుంచి ఇప్పటివరకూ 24 ఫారిన్ టూర్లలో 51 దేశాల్లో పర్యటించారు. ఈ మొత్తం టూర్లలో ఐదు బిల్లులు మాత్రమే ఇప్పటికి తేలాయి. మిగిలిన ఫారిన్ టూర్ల ఖర్చుల లెక్కలు వివిధ దశల్లో జరుగుతున్నాయి.గడిచిన రెండున్నరేళ్ల వ్యవధిలో మోడీ అమెరికాకు నాలుగుసార్లు వెళ్లి వచ్చారు. ఇప్పటివరకూ ఖర్చులెక్క తేల్చిన ఫారిన్ టూర్లలో అతి తక్కువ ఖర్చు తన భూటాన్ పర్యటనలో రూ.2.45కోట్లు ఖర్చుచేయగా.. అత్యధికంగా తన మయన్మార్.. ఆస్ట్రేలియా.. ఫిజీ టూర్ కు రూ.22.58 కోట్లు ఖర్చు అయినట్లుగా చెబుతున్నారు.