Begin typing your search above and press return to search.

వదల బొమ్మాళీ అంటున్న చంద్రబాబు ఓల్డ్ ఫ్రెండ్

By:  Tupaki Desk   |   26 Oct 2015 11:24 AM IST
వదల బొమ్మాళీ అంటున్న చంద్రబాబు ఓల్డ్ ఫ్రెండ్
X
ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఏమిటో సామాన్య ప్రజానీకానికే కాక పేరొందిన రాజకీయ నాయకులకు కూడా అర్ధం కాకుండా వుండడం చూస్తే కాస్త విడ్డూరంగానే వుంటోంది. ఒక పక్క ఆంధ్రకు చంద్రబాబు కలల రాజధాని అమరావతి శంకుస్థాపన కూడా జరిగిపోయి ఇంక రాజధాని నిర్మాణం ఒక్కటే జరగాల్సిన ఈ సమయంలో ఇంతవరకు ఆందోళనలు, నిరసనలు చేసి అలసిపోయిన విపక్షాలన్నీ సద్దుమణుగుతున్న వేళలో కొత్తగా ఇప్పుడు చంద్రబాబు పాత మిత్రుడు ఒకప్పటి ఆ పార్టీ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు తెర మీదకు వచ్చారు.

ఒకప్పుడు తెలుగుదేశం నాయకుడే అయిన వడ్డే శోభనాద్రీశ్వరరావు.. ఆ పార్టీలో తనకు ఇక ఠికానా లేదని అర్థమైపోయిన తర్వాత.. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో ఇంకా భూములు ఇవ్వకుండా ఉన్న రైతులను రెచ్చగొట్టే పనిలో బిజీగా ఉన్నట్లుగా కనిపిస్తోంది.

విషయానికొస్తే రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వకండి, ఏం జరిగినా మేమున్నామంటూ నిన్న మొన్నటి వరకూ విపక్షాలన్నీ చేసిన యాత్రలు, నిరసనలను సమర్ధంగా ఎదుర్కొని రాజధాని శంకుస్థాపన పూర్తి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక విధంగా అమరావతికి వ్యతిరేకమైన వార్తలేవీ మీడియాలో రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో సఫలమయ్యారనే చెప్పొచ్చు కానీ ఇక్కడే ఒక చిన్న విషయాన్ని ఆయన మరిచినట్లు కనపడుతోంది, వార్తలు మీడియాలో రానీయకుండా అయితే అడ్డుకొన్నారు కానీ ఆ ప్రాంత ప్రజల్లో వుండే అణిగివున్న అసంతృప్తిని తీర్చితే తప్ప శాశ్వత పరిష్కారం కాదని ఆయన గుర్తించడం లేదు. ఆ అసంతృప్తి అలా ప్రజల మనసుల్లో నివురుగప్పిన నిప్పులా వున్నంతవరకూ దాన్ని రగిలింపజేయడానికి శోభనాద్రీశ్వరరావు కాకపోతే మరొకరు అవుతారనేది జగమెరిగిన సత్యం

చివరిగా అర్ధం కాని విషయం ఏమిటంటే ఇంత మంది నాయకులు చివరికి తెర మరుగైపోయిన శోభనాద్రీశ్వరరావు లాంటి వారు కూడా రాజధాని భూముల గురించి చర్చించేస్తూంటే, ఆ భూముల గురించి ముఖ్యమంత్రితో మాట్లాడుతాను, అవసరమైతే పోరాటానికైనా సిద్ధమని చెప్పిన పవన్ కళ్యాణ్ ఎందువల్ల ఇంకా నోరు మెదపడం లేదో ఆయనకే తెలియాలి మరి.