Begin typing your search above and press return to search.

తెలంగాణలో వ్యాక్సిన్ వాడే లెక్కలివే: ఎక్కువగా హైదరాబాద్.. తక్కువగా నాగర్ కర్నూలు

By:  Tupaki Desk   |   14 Jan 2021 3:32 AM GMT
తెలంగాణలో వ్యాక్సిన్ వాడే లెక్కలివే: ఎక్కువగా హైదరాబాద్.. తక్కువగా నాగర్ కర్నూలు
X
ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న వ్యాక్సిన్ వచ్చేసింది. మరో రెండు రోజుల్లో దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ ఇవ్వటం షురూ చేయనున్నారు. ఇప్పటికే వ్యాక్సిన్లు గట్టి బందోబస్తు మధ్య.. జిల్లా కేంద్రాలకు వెళ్లటమే కాదు.. వ్యాక్సినేషన్ కు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 16 (శనివారం) నుంచి వ్యాక్సిన్ ను వైద్యులకు.. వైద్య సిబ్బందికి.. ఆరోగ్య కార్యకర్తలకు మొదట ఇవ్వనున్నారు.

ఫూణె నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన వ్యాక్సిన్.. అక్కడ నుంచి కోఠికి చేరుకున్నాయి. రాష్ట్రం మొత్తానికి ఎవరికి ఎన్ని వ్యాక్సిన్లు పంపాలన్న దానిపై పక్కా లెక్క వేసుకున్న ప్రభుత్వం అందుకు తగ్గట్లే పంపిణీ కార్యక్రమాన్ని షురూ చేస్తున్నారు. అత్యధికం గురువారం నాటికి తరలించనున్నారు. కోవిడ్ వ్యాక్సిన్లను వాయిల్స్ రూపంలో లెక్కిస్తారు. ఒక్కో వాయిల్ లో పది డోసులు ఉంటాయి.

ఒక వ్యక్తికి ఒక డోసు వేసిన తర్వాత 28 రోజుల తర్వాత మళ్లీ మరో డోసు తప్పనిసరిగా వేయించుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు.. ఎవరికి ఏ కంపెనీ డోస్ వేశారో.. అదే కంపెనీ డోస్ వేయించుకోవాల్సి ఉంటుంది. దీనికి తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక.. తెలంగాణ వ్యాప్తంగా ఒక్కో జిల్లాకు ఒక్కోరీతిలో వ్యాక్సిన్లను పంపుతున్నారు. దీనికి సంబంధించిన లెక్కలు బయటకు వచ్చాయి. సికింద్రాబాద్ లో ఈ నెల 16న మంత్రి ఈటెల చేతుల మీదుగా టీకా వేసే కార్యక్రమం షురూ కానుంది. ఈ వ్యాక్సిన్ వినియోగంలో పదిశాతం వరకు వెస్ట్ కింద లెక్కిస్తున్నారు.

జిల్లాల వారీగా చూసినప్పుడు అత్యధికంగా హైదరాబాద్ లో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. హైదరాబాద్ ను 1.. 2 గా విభజించారు. జిల్లా పెద్దదిగా ఉండటంతో టీకా వేసే కార్యక్రమం మరింత సులువుగా ఉండేందుకు ఈ ఏర్పాటు చేశారు. రెండు హైదరాబాద్ లను కలిపితే 30,070 డోసుల్ని వేయనున్నారు. అతి తక్కువగా నాగర్ కర్నూలులో 230 డోసుల్ని వేయనున్నారు. హైదరాబాద్ తర్వాత ఎక్కువగా వ్యాక్సిన్ వేయనున్న జిల్లాగా వరంగల్ అర్బన్ జిల్లాను చెప్పాలి. ఇక్కడ 2640 డోసుల్ని వేయనున్నారు. అదే సమయంలో వరంగల్ రూరల్ జిల్లాలో 580 డోసుల్ని మాత్రమే వేయనున్నారు.