Begin typing your search above and press return to search.

భారత్ కోసం ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్.. తయారు చేస్తున్నది ఎవరంటే?

By:  Tupaki Desk   |   17 Nov 2020 10:45 AM IST
భారత్ కోసం ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్.. తయారు చేస్తున్నది ఎవరంటే?
X
కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి మొదట్నించి ఆశలు రేపుతున్న కంపెనీల్లో భారత బయోటెక్ ఒకటి. ఐసీఎంఆర్ తో కలిసి ఇప్పటికే తయారు చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ మూడు దశలో ఉంది. ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ లో ఉన్న సదరు వ్యాక్సిన్.. చివరి దశలో ఉంది. త్వరలోనే ఈ వ్యాక్సిన్ విడుదల అవుతుందని చెబుతున్నారు. ఇలాంటివేళ..వ్యాక్సిన్ ను సూది మందు మాదిరి కాకుండా ముక్కు ద్వారా వేసేలా రూపొందిస్తున్నట్లుగా భారత బయోటకక్ ఇంటర్నేషనల్ ఛైర్మన్ కం సీఎండీ డాక్టర్ క్రిష్ణ ఎల్లా పేర్కొన్నారు.

భారత్ లోని పరిస్థితుల నేపథ్యంలో ఈ టీకాను తయారు చేస్తున్నట్లు చెప్పారు. తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ‘‘మన దేశంలో ఉన్న 130 కోట్ల మంది జనాభాకు వ్యాక్సిన్ ఇవ్వాలంటే 260 కోట్ల డోసుల టీకా.. సూదులు కావాలి. దీనికి తోడు గ్రామీణ ప్రాంతాల్లో టీకా కలపటం.. ఇంజెక్షన్ ద్వారా ఇవ్వటంతో చాలా సమస్యలు చోటు చేసుకునే వీలుంది. సూది మందు కన్నా.. ముక్కుతో వ్యాక్సిన్ ఇవ్వటం తేలిక. అందుకే ముక్కు ద్వారా ఇచ్చేలా వ్యాక్సిన్ రూపొందిస్తున్నాం. వచ్చే ఏడాదికి అందుబాటులో వస్తుంది’’ అని పేర్కొన్నారు.

ముక్కు ద్వారా వ్యాక్సిన్ ఇచ్చిన అనుభవం తమకు ఉందని.. ఇప్పటికే 5 చుక్కలు రోటా వైరస్ టీకాను డెవలప్ చేసిన వైనాన్ని గుర్తుచేశారు. పోలియో టీకా అయితే 2 చుక్కల మందేనని గుర్తు చేశారు. దేశంలోని 130 కోట్ల జనాభాకు ఏడాది వ్యవధిలోనే కోవిడ్ 19 టీకా ఇవ్వాలనేది తమ కలగా ఆయన చెప్పుకొచ్చారు. తాము తయారు చేసిన కొవిడ్ 19 వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ టెస్టులు మొదలైనట్లుగా చెప్పిన ఆయన.. దేశ వ్యాప్తంగా 22 కేంద్రాల్లో 26వేల మంది వాలంటీర్లపై పరీక్షల్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.