Begin typing your search above and press return to search.

ఒక్కరోజే భారత్ లో రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్‌

By:  Tupaki Desk   |   1 Sep 2021 10:30 AM GMT
ఒక్కరోజే భారత్ లో రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్‌
X
కరోనా మహమ్మారి వ్యాక్సినేషన్‌ లో భారత ప్రపంచ రికార్డ్ నమోదు చేసింది. 1,30,82,756 కరోనా వ్యాక్సిన్లు పంపిణీ చేసి ప్రపంచంలో ఒక్కరోజులోనే అత్యధిక వ్యాక్సిన్లు వేసిన దేశంగా భారత్ నిలిచింది. అలాగే, కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం 65 కోట్ల కీలక మైలురాయిని దాటింది. అంతకు ముందు రోజు 59,62,286 మందికి టీకాలు వేశారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

కరోనా వైరస్‌ కట్టడికి ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం మనదేశంలో జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం నాడు రికార్డ్ స్థాయిలో వ్యాక్సినేషన్ వేశారు. అర్ధరాత్రి వరకు 1,30,82,756 వ్యాక్సిన్లు పంపిణీ చేశారు. అదే సమయంలో ఇప్పటి వరకు 50 కోట్ల మందికి వ్యాక్సిన్ మొదటి డోస్ వేశారు. ఇదే అంశంపై కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్వీట్ చేశారు. దేశం సరికొత్త రికార్డ్ సృష్టించింది. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా 1.30 లక్షల టీకాలు వేసి మునుపటి రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త రికార్డును సృష్టించింది. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉధృతంగా సాగుతోంది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో, ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం మరో మైలురాయి దాటింది. కరోనా వైరస్ వ్యాక్సిన్ మొదటి డోస్ 50 కోట్ల మంది అందుకున్నారు. కరోనా వారియర్స్ కృషిని, ఈ గొప్ప విజయాన్ని సాధించడంలో వారికి సహాయపడిన వారందరికీ నా అభినందనలు అని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ట్వీట్ చేశారు. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 41,965 పాజిటివ్ కేసులు, 460 మరణాలు నమోదయ్యాయి. అలాగే ఈ మహమ్మారి నుంచి మరో 33,964 మంది కోలుకున్నారు.

దేశవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 3,28,10,845 కాగా, ఇందులో యాక్టివ్ కేసులు 3,78,181, కోలుకున్నవారి సంఖ్య 3,19,93,644గా ఉంది. అలాగే దేశంలో ఇప్పటివరకు కరోనా కారణంగా 4,39,020 మంది మరణించారు. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో కేరళలో 30,203 పాజిటివ్ కేసులు, 115 మరణాలు సంభవించాయి. అటు మహారాష్ట్రలో 4196 పాజిటివ్ కేసులు, 104 మరణాలు వెలుగు చూశాయి. కాగా, సెప్టెంబర్ లేదా అక్టోబర్‌ లో థర్డ్ వేవ్ రావచ్చని వైద్య నిపుణులు చెబుతుండటం. అలాగే అక్టోబర్‌ లో థర్డ్ వేవ్ పీక్ స్టేజ్‌ కి చేరుతుందని అనడంతో కేంద్ర ప్రభుత్వం దానికి తగ్గట్టుగా చర్యలు చేపట్టింది. ఇప్పటికే రాష్ట్రాలన్నీంటికి మార్గదర్శకాలు జారీ చేసింది.