Begin typing your search above and press return to search.

జగన్‌ ప్రభుత్వ నిర్ణయానికి జేడీ అనూహ్య మద్దతు!

By:  Tupaki Desk   |   4 Jan 2023 7:21 AM GMT
జగన్‌ ప్రభుత్వ నిర్ణయానికి జేడీ అనూహ్య మద్దతు!
X
ఆంధ్రప్రదేశ్‌ లో రోడ్లపై బహిరంగ సభలు, రోడ్‌ షోలు, ర్యాలీలు నిషేధం విధిస్తూ జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయం తీవ్ర వివాదాస్పదమవుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ఈ ఉత్తర్వులు తమకేనా వైసీపీకి వర్తించవా అని నిలదీస్తున్నారు. తమ సభలకు వస్తున్న ప్రజాదరణను తట్టుకోలేకే ఈ ఉత్తర్వులు తెచ్చిందని తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో జగన్‌ ప్రభుత్వానికి ఊహించని వర్గాల నుంచి అనూహ్య మద్దతు లభించింది. రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి, సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ వీవీ లక్ష్మీనారాయణ జగన్‌ నిర్ణయానికి మద్దతు తెలిపారు.

''నాకు ఆ జీవోలో ఏ తప్పు చూడలేదు. ఈ పోలీసు చట్టం 1861లో వచ్చింది. వివిధ రాష్ట్రాలు తమ అవసరాలకు అనుగుణంగా ఈ చట్టంలో మార్పులు చేశాయి'' అని లక్ష్మీనారాయణ గుర్తు చేశారు.

జగన్‌ ప్రభుత్వ నిర్ణయం అసాధారణంగా ఏమీ లేదని లక్ష్మీనారాయణ తెలిపారు. బహిరంగ ర్యాలీలు, రోడ్‌షోలు నిర్వహించాలంటే ప్రతి రాజకీయ పార్టీ పోలీసుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. వారు తమ సమావేశాల వివరాలను తెలియజేస్తే పోలీసులు సరైన ఏర్పాట్లు చేస్తారని వెల్లడించారు. ప్రతి నిర్ణయాన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు అని స్పష్టం చేశారు.

జిఓలో విధించిన ఆంక్షలు తమకు మాత్రమే వర్తిస్తాయని, అధికార పార్టీకి కాదని ప్రతిపక్ష పార్టీలు అభిప్రాయపడితే న్యాయస్థానాన్ని ఆశ్రయించి తమకు అనుకూలంగా ఉత్తర్వులు పొందవచ్చని లక్ష్మీనారాయణ తెలిపారు.

తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మాదిరిగా పోలీసులు అనవసర ఆంక్షలు సృష్టిస్తే ప్రతిపక్షాలు కోర్టును ఆశ్రయించవచ్చని అన్నారు.

జగన్‌ బ్రిటీష్‌ నిబంధనలను పాటిస్తున్నారనే విమర్శలను ప్రస్తావిస్తూ.. ఇది కేవలం పోలీస్‌ యాక్ట్‌ మాత్రమే కాదని, ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ కూడా 1861లో తీసుకొచ్చారని.. బ్రిటీష్‌ హయాంలోనే అనేక చట్టాలు తీసుకొచ్చారని లక్ష్మీనారాయణ స్పష్టం చేయడం విశేషం.

''జగన్‌ ప్రభుత్వం బహిరంగ సభలు లేదా ర్యాలీలను నిషేధించలేదు. పార్టీలు వాటిని పబ్లిక్‌ గ్రౌండ్స్‌ లేదా ప్రైవేట్‌ ప్లేస్‌లలో నిర్వహించాలని మాత్రమే చెబుతుంది, కానీ రోడ్లపై కాదు. అందులో తప్పేమీ లేదు'' అని లక్ష్మీనారాయణ అన్నారు. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.