Begin typing your search above and press return to search.

నరసింహన్ ను వీహెచ్ వదిలేటట్టు లేరే

By:  Tupaki Desk   |   30 Sept 2016 12:23 PM IST
నరసింహన్ ను వీహెచ్ వదిలేటట్టు లేరే
X
కొంతమంది రాజకీయ నాయకులు సైద్ధాంతిక పోరు చేస్తుంటారు. తాము పోరాటం చేస్తున్న నేతతో వ్యక్తిగతంగా ఎలాంటి తగాదా లేనప్పటికీ రాజకీయంగా ఉన్న విభేదాలతో వారిని ఉతికి ఆరేయటం కనిపిస్తుంది.రాజకీయాల్లో ఇలాంటి నేతలతో పాటు.. మరికొందరు నేతలు తమ ప్రత్యర్థులపై వ్యక్తిగత దాడులకు దిగుతుంటారు. సైద్ధాంతికంగా సదరు నేతతో ఎలాంటి తేడాలు లేనప్పటికీ.. వ్యక్తిగత స్థాయిలో ఉండే పంచాయితీలతో వారు తరచూ విరుచుకుపడుతుంటారు.

తెలంగాణలో అలాంటి యవ్వారమే టీ కాంగ్రెస్ సీనియర్ నేత - మాజీ ఎంపీ వీహెచ్ హనుమంతరావులో కనిపిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ పేరు చెబితే చాలు హనుమంతన్న ఉగ్రరూపం దాలుస్తారు. గవర్నర్ నరసింహన్ ప్రతి చర్యను తరచూ తప్పు పట్టే ఆయన.. తాజాగా మరోసారి తన గళం విప్పారు. ఈ మధ్యన సమాచార హక్కు చట్టాన్ని మాఫియాతో పోలుస్తూ గవర్నర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేయటంతో పాటు.. గవర్నర్ మాటలు ఏ మాత్రం సమంజసంగా లేవన్నట్లుగా అభిప్రాయ‌ప‌డ్డారు.

ఇదిలా ఉంటే.. వీహెచ్ ఈ అంశాన్ని మరింత సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తుంది. తనకేమాత్రం పొసగని గవర్నర్ సంగతి చూసేందుకు తరచూ కాలు దువ్వే వీహెచ్.. తాజాగా సమాచార హక్కు చట్టంపై గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాసిన విషయాన్ని వెల్లడించారు. చట్టాన్ని హేళన చేసేలా మాట్లాడిన గవర్నర్ ను వెంటనే రీకాల్ చేయాలంటూ వీహెచ్ డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి గవర్నర్ ‘లెక్క’ తేల్చే వరకూ వీహెచ్ నిద్ర పోయేటట్లు లేరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.