Begin typing your search above and press return to search.

ఉత్తరాంధ్రా చూపు : పవన్ పోటీకి రెడీనా...?

By:  Tupaki Desk   |   30 May 2022 2:30 AM GMT
ఉత్తరాంధ్రా చూపు : పవన్ పోటీకి రెడీనా...?
X
ఉత్తరాంధ్రా జిల్లాల్లో విపరీతంగా మెగా ఫ్యాన్స్ ఉన్నారు. వారంతా ప్రాణం ఇచ్చేవారు. నాడు ప్రజారాజ్యం పార్టీని పెట్టిన మెగాస్టార్ కి ఈ జిల్లాల నుంచి సీట్లు ఓట్లు బాగా వచ్చాయి. దాంతోనే పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేశారు. ఓట్లు బాగా వచ్చినా గట్టి పోటీ ఇచ్చినా అపుడున్న వైసీపీ గాలిలో ఓడిపోయారు. అయితే ఈసారి అలా కాదు అని జనసేన అంటోంది. ఈసారి పవన్ కనుక పోటీ చేస్తే నెత్తిన పెట్టుకుని గెలిపిస్తామని గాజువాక జనసేన నాయకులు చెబుతున్న మాట.

అదే టైమ్ లో ఉత్తరాంధ్రాలో జనసేనకు బలం ఉంది. దాన్ని మరింతగా పెంచుకునేందుకు ఆ పార్టీ ఆలోచనలు చేస్తోంది. జనసేనకు 2019 ఎన్నికల్లో చాలా చోట్ల చెప్పుకోదగిన స్థాయిలో సీట్లు వచ్చాయి. అంతే కాదు కొన్ని చోట్ల అధికార వైసీపీ, విపక్ష టీడీపీకి ధీటుగా కూడా నిలబడింది. అలాంటి ఉత్తరాంధ్రా జిల్లాలలో ఈ మధ్యనే రాజకీయ చిత్రం కూడా మారుతోంది. వైసీపీలో ఇమడలేకపోతున్న వారు, టీడీపీలో సీటు రాదనుకుంటున్న వారు ద్వితీయ శ్రేణి నాయకులు పలువురు జనసేన వైపు చూస్తున్నారు.

వారంతా తమకు బెస్ట్ ఆప్షన్ జనసేన అని భావిస్తున్నారు. దాంతో జనసేన ఇక్కడ పార్టీకి పనికివచ్చే నాయకులను తీసుకోవడం ద్వారా బలోపేతం చేసుకోవాలని చూస్తోంది. ఈ నేపధ్యంలో జనసేన అగ్ర నాయకుడు నాగబాబు జూన్ 1 నుంచి మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రా జిల్లాలలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ పరిస్థితిని అంచనా వేయడంతో పాటు నాయకుల పనితీరుని కూడా పరిశీలించనున్నారు.

వారికి తగిన సలహా సూచనలు చేయనున్నారు. ఇక శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలుపెడితే విశాఖ జిల్లా దాకా చాలా మంది జనసేనలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరిలో చాలా మంది అధికార పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు అని అంటున్నారు. వారు తమకు టికెట్లు రావు, ఎదుగుబొదుగు లేకుండా రాజకీయాల్లో ఉండాలా అని మధన పడుతున్న వారు.

ఇక కొందరు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా జనసేన వైపు చూస్తున్నారు అని తెలుస్తోంది. వీరంతా కూడా టికెట్ హామీ తీసుకుని జనసేనలో చేరిపోవాలని అనుకుంటున్నారు. ఇక ఈసారి రాజకీయం మారుతుందని, అధికార పార్టీపైన వ్యతిరేకత బాగా ఉన్న నేపధ్యంలో అది తమకు కలసివస్తుందని కూడా నమ్ముతున్న వారు జనసేనకు ఉన్న బలం, పవన్ కళ్యాణ్ ఇమేజ్ తో గట్టెక్కగలమని భావిస్తున్నారు. మొత్తానికి నాగబాబు చాలా కాలానికి ఉత్తరాంధ్రా జిల్లాల పర్యటనకు వస్తున్నారు.

దాంతో జనసేన వర్గాలలో హుషార్ కనిపిస్తోంది. పార్టీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలకడానికి రెడీ అవుతున్నారు. అదే విధంగా పవన్ని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయమని కూడా కోరనున్నారుట. ఏది ఏమైనా నాగబాబు టూర్ మాత్రం ఆసక్తిని రేపుతోంది. ఎవరెవరు పార్టీలో చేరుతారు అన్న ఉత్కంఠ ప్రధాన పార్టీలలో ఉంది అని అంటున్నారు.