Begin typing your search above and press return to search.

ఉత్తరాంధ్రా భావోద్వేగం ఏ రేంజిలో... పాదయాత్ర సాఫీగా సాగేనా?

By:  Tupaki Desk   |   16 Sep 2022 1:30 PM GMT
ఉత్తరాంధ్రా భావోద్వేగం ఏ రేంజిలో... పాదయాత్ర సాఫీగా సాగేనా?
X
నోట్లో బూరె పెడతామంటే ఎవరికి ఆశ ఉండదు, ఉత్తరాంధ్రా వారిదీ అదే పరిస్థితి. రాజధానిగా విశాఖ ఉంటే మా భూములకు రెక్కలు వస్తాయి. మా పిల్లలకు ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి. మా ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి అన్నది విశాఖ సహా ఉత్తరాంధ్రా వాసులకు ఆలోచనలు ఉంటాయి. దానికి తోడు వైసీపీ ప్రభుత్వం పదే పదే విశాఖ రాధాని గురించి గట్టిగా హామీ ఇస్తూ అక్కడ రాజధాని అయితే ఏపీకే సూపర్ సెంటర్ అవుతుంది అని కితాబు కూడా ఇస్తోంది. స్వయంగా ముఖ్యమంత్రి జగన్ ఈ విషయంలో గట్టిగా మద్దతు ఇస్తున్నారు. దాంతో ఉత్తరాంధ్రావాసులలో రాజధాని కోరికలు పెరుగుతున్నాయి.

అదే ఇపుడు అమరావతి టూ అరసవెల్లి పాదయాత్ర చేపడుతున్న రైతులకు ఇబ్బందిగా మారబోతోందా అన్నదే చర్చగా ఉంది. ఇప్పటికే ఉత్తరాంధ్రాకు చెందిన వైసీపీ మంత్రులు అమరావతి రైతులది పాదయాత కాదు మా ప్రాంతం మీద దండయాత్ర అని స్పష్టంగా చెబుతూ వస్తున్నారు. శ్రీకాకుళం పొలిమేర్లలోనే యాత్రను ఆపేస్తామని ఆ జిల్లాకు చెందిన మంత్రి సీదరి అప్పలరాజు ప్రకటించేశారు. విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అయితే పార్టీలకు అతీతంగా అంతా విశాఖ రాజధానికి మద్దతుగా నిలవాలని పిలుపు ఇచ్చారు.

ఇక మరో మంత్రి గుడివాడ అమరనాధ్ అయితే ఉత్తరాంధ్రా వాసులను రెచ్చగొడుతున్నారు. పాదయాత్రలో ఏమైనా జరిగితే దానికి బాధ్యత చంద్రబాబుదే అని హెచ్చరించేశారు. ఇవన్నీ చూస్తూంటే అమరావతి రైతుల పాదయాత్ర ఉత్తరాంధ్రా పొలిమేరలలో పాదం మోపితే ఏం జరుగుతుంది అన్నదే చర్చగా ఉంది. వీటికి పరాకాష్ట అన్నట్లుగా నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ ఉత్తరాంధ్రా వారికి భావోద్వేగాలు ఉండవా. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళి వారిని రెచ్చగొట్టడం తగునా అని సూటిగానే ప్రశ్నించారు.

అరసవెల్లి దేవుడిని ఆయన ఉత్తరాంధ్రా దేవుడిగా కూడా చెప్పడం ఇక్కడ విశేషం. ఆయన్ని అమరావతి రైతులు ఏమని మొక్కుతారు అని జగన్ సూటింగా ప్రశ్నించారు. ఉత్తరాంధ్రాకు రాజధాని వద్దు అని మొక్కుకుంటే ఆ ప్రాంతీయులు ఊరుకుంటారా అని వైసీపీ నేతలు కూడా అంటున్నారు. అంటే ఉత్తరాంధ్రాలో ఇపుడు భావోద్వేగం అన్నది ఒక్క లెక్కన పెరిగింది. దాన్ని మరింతగా పీక్స్ చేరేలా చేసేందుకు వైసీపీ చూస్తోంది అని అంటున్నారు

ఉత్తరాంధ్రాకు పాదయాత్ర చేరే సమయానికి ఏ రకమైన పరిణామాలు సంభవిస్తాయన్నది ఎవరికీ అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే అమరావతి రైతుల పాదయాత్రకు తాము అండగా ఉంటామని ఉత్తరాంధ్రా టీడీపీ నేతలు కొందరు అంటున్నారు. అంటే అటు తిరిగి ఇటు తిరిగి ఇది వైసీపీ వర్సెస్ టీడీపీ రాజకీయ సమరంగా మారే అవకాశం ఉండవచ్చు అని అంటున్నారు. అదే టైం లో చూస్తే ఉత్తరాంధ్రా వాసుల పేరిట భావోద్వేగాలు రెచ్చగొడితే పాదయాత్ర సజావుగా సాగుతుందా అన్న చర్చ కూడా సాగుతోంది.

ఒకవేళ అనుకున్నట్లుగా పాదయాత్ర అరసవెల్లి దాకా చేరకపోతే అపుడు ఏం జరుగుతుంది. శాంతిభద్రతల సమస్యలు తలెత్తితే ప్రభుత్వం పాదయాత్రను ప్రశాంతంగా జరిపిస్తున్నా పూర్తి బందోబస్తు ఇచ్చి పూర్తి అయ్యేలా చూస్తుందా లేక మధ్యలోనే ఆపేయాలని హైకోర్టుని కోరుతుందా అన్నదే చర్చ. ఇక్కడ ప్రభుత్వం పాదయాత్రను సాఫీగా సాగనిచ్చి విజయవంతం చేయాలంటే వైసీపీ మంత్రులు నేతలు అంతా కూడా గమ్మున ఉండాలి. కానీ అలాంటి సీన్ లేదు కాబట్టి పాదయాత్ర ఉత్తరాంధ్రాలో ఎలా జరుగుతుంది అన్నదే ఇపుడు అతి పెద్ద డౌట్ గా ఉంది.

పాదయాత్ర సాగకపోతే విపక్షాలు అన్నీ కలసి ఊరుకోవు కదా. అలా ఉత్తరాంధ్రాలో పాదయాత్ర ప్రవేశించే వేళకు అటూ ఇటూ గట్టిగా మోహరిస్తే అది శాంతిభద్రతలకే సవాల్ గా మరుతుంది అని అంటున్నారు. ఇప్పటికే ఏపీలో రాజధానుల వివాదం జాతీయ స్థాయిలో చర్చకు తెర లేపిన నేపధ్యంలో ఉత్తరాంధ్రాలో అనుకోని పరిణమాలు కనుక జరిగితే అపుడు కేంద్రం కూడా జోక్యం చేసుకుంటుందా అన్న ప్రశ్న కూడా ఉత్నన్నం అవుతోంది.

ఎందుకంటే బీజేపీ కూడా అమరావతికే మద్దతుగా ఉంది కాబట్టి వైసీపీ సర్కార్ మీద ఏమైనా సీరియస్ అయ్యే చాన్స్ ఉందా అన్నది కూడా ఒక చర్చగా ముందుకు వస్తోంది. మొత్తానికి ఉత్తరాంధ్రా భావోద్వేగం ఏ రేంజిలో ఉందో ఈ పాదయాత్ర కళ్లారా చూపించబోతోంది అన్నది నిజం అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.