Begin typing your search above and press return to search.

మోడీ పరివారానికి షాకిచ్చేలా సర్వే ఫలితాలు

By:  Tupaki Desk   |   24 Aug 2016 9:14 AM GMT
మోడీ పరివారానికి షాకిచ్చేలా సర్వే ఫలితాలు
X
కొద్ది నెలల్లో జరిగే ఉత్తరప్రదేశ్ ఎన్నికల మీద మోడీ పరివారం భారీ ఆశలే పెట్టుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో యూపీలో దాదాపు క్లీన్ స్వీప్ చేసిన బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో అలాంటి మేజిక్ మళ్లీ చేసి.. యూపీ కోట మీద కాషాయ జెండా ఎగురవేయాలని తపిస్తోంది. ఇందుకోసం భారీగానే వ్యూహాలు రచిస్తోంది. ఇదిలా ఉంటే.. విపక్ష కాంగ్రెస్ కూడా తక్కువేం తినలేదు. యూపీలో ఆ పార్టీకి పట్టు తక్కువే అయినా.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు తమ పార్టీని గట్టెక్కిస్తాయని నమ్మకంగా ఉంది. ఆయన వ్యూహాలకు తగ్గట్లే అందరి కంటే ముందే తన ఎన్నికల ప్రచారాన్ని స్టార్ట్ చేసింది.

ఇలా ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరికి వారు యూపీ ఎన్నికల మీద భారీగానే ఆశలు పెట్టుకున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మీద ప్రముఖ మీడియా సంస్థ ఏబీపీ న్యూస్ – లోక్ నీతి - సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ ఒక సర్వేను చేపట్టింది. తాజాగా ఆ సర్వే ఫలితాల్ని విడుదల చేశారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తాజాగా విడుదల చేసిన సర్వే ప్రకారం యూపీ కోటను సొంతం చేసుకోవాలని తపిస్తున్న మోడీ పరివారానికి ఉత్తరప్రదేశ్ ప్రజలు షాకిచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో యూపీలో కీలకభూమిక పోషించాలనే కాంగ్రెస్ ఆశలుకూడా నెరవేరే అవకాశం లేదన్న భావన వ్యక్తమవుతోంది.

తాజాగా చేపట్టిన సర్వే ప్రకారం యూపీ అధికారపక్షమైన సమాజ్ వాదీకి 141 – 151 స్థానాలు దక్కుతాయని.. బీజేపీ 124 – 134 స్థానాలు బీఎస్పీ 103 – 113 స్థానాలు చేజిక్కించుకునే వీలుందని తేల్చింది. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే దారుణంగా 8 నుంచి 14 స్థానాలు మాత్రమే సొంతం చేసుకునే అవకాశం ఉందని. ఆ పార్టీకి చాలా తక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందని తేల్చింది. యూపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 202 అసెంబ్లీ స్థానాల్లో నెగ్గాల్సి ఉంటుంది. ఇప్డున్న పరిస్థితుల్లో సమాజ్ వాదీ పార్టీకి మాత్రమే ఆ అవకాశం ఎంతోకొంత ఉందని చెప్పొచ్చు. తాజా సర్వేను చూస్తే.. యూపీలో హంగ్ పక్కా అని లేదంటే బీఎస్పీ కీలక భూమిక పోషించే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.