Begin typing your search above and press return to search.

నాకు పీసీసీ ప‌ద‌వొద్దు బాబోయ్‌

By:  Tupaki Desk   |   7 April 2017 7:00 AM GMT
నాకు పీసీసీ ప‌ద‌వొద్దు బాబోయ్‌
X
కాంగ్రెస్ పార్టీలో నెల‌కొన్న అంత‌ర్గ‌త రాజ‌కీయాల గురించి పీసీసీ అధ్యక్షులు ఎన్. ఉత్తమ్ కుమార్‌ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. హైద‌రాబాద్‌లో నిర్వహించిన సీనియర్ నాయకుల ఆంతరంగిక ఇష్టాగోష్టిలో ఆయన కీల‌ వ్యాఖ్యలు చేసినట్ల్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ‘పీసీసీ అధ్యక్షుడిగా నాకంటే సమర్థులు ఉన్నారనుకుంటే, వారినే నియమించాలని రాతపూర్వకంగా నేను లేఖ ఇస్తాను’ అంటూ ఉత్త‌మ్ చెప్పిన‌ట్లు స‌మాచారం. పీసీసీ అధ్యక్ష పదవికోసం ఎవరు పోటీ పడినా తనకు అభ్యంతరం లేదని, అలా ఆశించే వారు ఢిల్లీలో తమ ప్రయత్నాలు చేసుకోవచ్చని, అంతే తప్ప ఈ విషయాలపై బహిరంగంగా మాట్లాడుతూ పార్టీని బలహీన పరచవద్దంటూ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అన్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీలో ఆయన ఒకరిద్దరు నాయకుల తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీలో భావ వ్యక్తీకరణ స్వేఛ్చ ఉన్నప్పటికీ, పార్టీ ప్రయోజనాలకు భంగం కలిగించే స్థాయిలో ఉంటే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఆవేదనను గమనించిన కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావులు ఇటువంటి వారితో తాము మాట్లాడతామంటూ ఆయనను సముదాయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పార్టీ క్రమశిక్షణను ఎవరూ ఉల్లంఘించినా ఉపేక్షించవద్దంటూ సమావేశంలో తీర్మానించారు. అయితే అంతకు ముందు సమావేశంలో మాట్లాడిన సీనియర్ నాయకుల్లో అధిక శాతం మంది పీసీసీ తరపున క్రియాశీలకంగా కార్యక్రమాలు జరగడం లేదన్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పా రు. పార్టీ అధిష్టానం సూచించిన, నిర్దేశించినవి తప్ప ప్రత్యేకంగా ఎటువంటి కార్యక్రమాలను చేపట్టలేదని వారన్నారు. తమ అందరినీ భాగస్వామ్యులను చేయకుండా, కార్యాచరణను రూపొందించడంలో ఆంతర్యమేమిటిని అడిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పీసీసీ అధ్యక్షుడిగా జిల్లాల పర్యటనకు ఎందుకు వెళ్లడం లేదని, ఇంతవరకు ఎన్ని డీసీపీ కార్యాలయాలకు వెళ్లారో చెప్పాలని ఒకరిద్దరు సీనియర్ నాయకులు గట్టిగానే ప్రశ్నించారు.

ఇదిలా ఉంటే జిల్లా స్థాయిలో పార్టీ శ్రేణులంతా ఏకతాటిపై పనిచేసేలా చూసేందుకు, ప్రతి జిల్లాకు నలుగురైదుగురు సీనియర్లను ఇన్‌ఛార్జిలుగా నియమించాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. అలాగే టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం తదితర అంశాలపై ఒక నివేదిక‌ను విడుదల చేస్తే బాగుంటుదన్న అభిప్రాయం కూడా సమావేశంలో వ్యక్తమైంది. ప్రభుత్వంలోని అవినీతి, అక్రమాలపై ప్రజల్లో చర్చ జరిగేలా కార్యాచరణను రూపొందించుకోవాలని కూడా అనుకున్నారు. రెండేళ్ల ముందే అభ్యర్ధుల ఎంపిక విషయంలో కూడా భిన్నాభి ప్రాయాలు వ్యక్తమైనట్లుగా తెలిసింది. ఎన్నికల నాటికి పీసీసీ నాయకత్వం లో మార్పు వస్తే పరిస్థితి ఏమిటన్న ప్రశ్న తలెత్తగా, ప్రస్తుత సమావేశంలో దాదాపు 30 మంది సీనియర్లు కలిసి నిర్ణయం తీసుకున్నందున నాయకత్వం మారినా నిర్ణయంలో మార్పు ఉండే అవకాశాలు తక్కువగా ఉంటాయన్న అభిప్రాయంతో ఈ ప్రతిపాదనకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే,రెండేళ్ల ముందు నుంచే పోటీ చేయడానికి ఏర్పా ట్లు చేసుకోవడమంటే, ఆ అభ్యర్ధిపై పడే ఆర్ధిక భారాన్ని ఎవరూ ఆలోచించలేదని సీనియర్ నాయకుడుకొరు తెలిపారు. కాగా సీనియర్ నాయకుల సలహాలు, సూచనలు, అభిప్రాయాలు తెలుసుకున్న తరువాత ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ, తాను కూడా వ్యవహారశైలిని మార్చుకుంటానన్నా రు. ఇకపై పార్టీ అంతరంగిక సమావేశాల్లోని అంశాలను లీక్ చేయవద్దంటూ ఆయన నాయకులకు విజ్ఞప్తి చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/