Begin typing your search above and press return to search.

ఉత్తమ్‌ను తొలగించాలని విజయశాంతి కోరుకుంటున్నారా?

By:  Tupaki Desk   |   31 Oct 2020 11:45 AM IST
ఉత్తమ్‌ను తొలగించాలని విజయశాంతి కోరుకుంటున్నారా?
X
తెలంగాణ ఫైర్ బ్రాండ్, కాంగ్రెస్ నేత విజయశాంతి ప్రస్తుతానికైతే బీజేపీలో చేరకుండా కాంగ్రెస్ పార్టీ నిరోధించగలిగింది. ప్రస్తుతం ప్రచార కమిటీ చైర్మన్ గా విజయశాంతి ఉన్నారు. కానీ ఆమెనే దుబ్బాక ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండడం కాంగ్రెస్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. అయితే విజయశాంతి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని పదవి నుంచి తొలగించాలని.. ఆయన స్థానంలో మరో నాయకుడిని నియమించాలని డిమాండ్ చేసినట్టు ప్రచారం సాగుతోంది. విజయశాంతిని బీజేపీలో చేరకుండా బుజ్జగించడానికి వచ్చిన నేతల ముందు విజయశాంతి ఈ ప్రతిపాదన పెట్టగా వారంతా దిగ్భ్రాంతికి గురయ్యారన్న టాక్ ఆ పార్టీలో నడుస్తోంది.

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తనను అవమానించారని, కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తనను ఎప్పుడూ పరిగణలోకి తీసుకోలేదని రాములమ్మ పార్టీ నాయకులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. పార్టీ ప్రచార కమిటీకి నాయకత్వం వహిస్తున్నప్పటికీ టీపిసిసి ఏ సమావేశానికి తనను ఎప్పుడూ పిలవలేదని ఆమె వారితో చెప్పినట్టు తెలిసింది.

దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొంటే ఉత్తమ్ తనతో ఎందుకు పాల్గొనలేదని ఆమె ప్రశ్నించినట్టు తెలిసింది. ఇంతకుముందు మెదక్ లో పోటీచేసినప్పుడు కూడా ఉత్తమ్ తన వెంట నడవలేదని ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అయితే ప్రస్తుతానికి పిసిసి నాయకత్వంలో ఎలాంటి మార్పులు చేయటానికి హైకమాండ్ ఆసక్తి చూపడం లేదని పార్టీ వర్గాలు ఆమెకు వివరించినట్టు టాక్ నడుస్తోంది.

తెలంగాణ వ్యవహారాల కొత్త ఎఐసిసి ఇన్‌చార్జి మణికం ఠాగూర్‌కు విజయశాంతి దీనిపై ఫిర్యాదు చేశారని.. ఆయన ప్రస్తుతం నాయకత్వ మార్పు లేకుండా పార్టీ నాయకులలో సమన్వయాన్ని చేసుకోవాలని సూచించినట్టు ఆ పార్టీలో ప్రచారం సాగుతోంది. “పార్టీ సరైన సమయంలో పిసిసిలో తగిన మార్పులు చేస్తుంది. అటువంటి సమయం వచ్చే వరకు పిసిసిలో నాయకత్వ మార్పు ఉండదు. అప్పటి దాకా పార్టీ నాయకులు లాబీయింగ్ లేదా డిమాండ్ చేయకూడదని ”అని హైకమాండ్ తరుఫున మణికం ఠాగూర్ స్పష్టం చేసినట్టు సమాచారం.

దీంతో విజయశాంతి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నారని టాక్. మరి ఈ అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీలో విజయశాంతి ఎంతకాలం ఉంటారో చూడాలి మరీ.