Begin typing your search above and press return to search.

తెలంగాణ ఎన్నిక‌ల్లో అవ‌క‌త‌వ‌క‌లు.. ఆధారాల‌తో న్యాయ‌పోరాటం

By:  Tupaki Desk   |   28 Dec 2018 6:59 AM GMT
తెలంగాణ ఎన్నిక‌ల్లో అవ‌క‌త‌వ‌క‌లు.. ఆధారాల‌తో న్యాయ‌పోరాటం
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ప‌రాజ‌యం పై కాంగ్రెస్ పార్టీ పోస్ట్‌ మార్టం ప్ర‌క్రియ కొనసాగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఈవీఎంల‌ పై అనుమానాల‌ను వ్య‌క్తం చేస్తూ వ‌చ్చిన కాంగ్రెస్ నేత‌లు తాజాగా మ‌రో అడుగు ముందుకు వేసి ఆధారాలు దొరికాయ‌ని ప్ర‌క‌టిస్తున్నారు. తాజాగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదే విష‌యాన్ని వెల్ల‌డించారు. కాంగ్రెస్ 134వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంధీభవన్ లో పార్టీ జెండా ఎగరేసిన పీసీసీ చీఫ్... ఈ సందర్భంగా మాట్లాడుతూ... అసెంబ్లీ జరిగిన ఎన్నికల్లో అవకతవకలకు సంబంధించిన ఆధారాలు సేకరించాం... న్యాయపరంగా పోరాటం చేస్తామని వెల్లడించారు

తెలంగాణ‌లో ఓట‌మి పాల‌వ‌డం పై కార్య‌క‌ర్త‌ల్లో ధైర్యం నింపే ప్ర‌య‌త్నం ఉత్త‌మ్ చేశారు. ``తెలంగాణలో మనం ఓటమి పాలయ్యాం.. ఎన్నికల్లో గెలుపు, ఓటమి సహజం.. మనకు ఎన్నికలు కొత్త కాదు. అవ‌క‌త‌వ‌క‌ల‌ పై పోరాటం చేద్దాం. వచ్చే ఎన్నికలకు ఇప్పటి అనుభవాలతో ఎదుర్కొందాం. ఈ ఓటమిని పక్కన పెట్టండి.. వచ్చే ఎన్నికల్లో మంచి ఫలితాల కోసం పనిచేయాలి`` అని ఉత్తమ్‌ కుమార్ రెడ్డి కోరారు. స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు తగ్గించడం అన్యాయమని, బీసీలకు జరిగిన అన్యాయం పై న్యాయపోరాటం చేస్తామని పీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. ``ప్ర‌భుత్వం ఏర్పడి 15 రోజులు అయింది. ఇంత వరకు మంత్రి వర్గ విస్తరణ లేదు. అసెంబ్లీలో ఎమ్యెల్యే ల ప్రమాణం లేదు. తెలంగాణతో పాటు ఎన్నికైన మిగితా 4 రాష్ట్రాలలో అన్ని చోట్లా ప్ర‌భుత్వాలు ఏర్పాటు అయ్యాయి.. ఇక్కడ మాత్రం ఇంకా ఆ ఊసే లేదు``అని విమర్శించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఎలక్షన్ కమిషన్ కుమ్మక్కైందని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజానరసింహా ఆరోపించారు. నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సమావేశంలో పాల్గొన్న ఆయ‌న ఎన్నికల్లో టీఆర్ఎస్ పరోక్షంగా సహకరించిన మొదటి ముద్దాయి ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ అని విమర్శించారు. ఆయన తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ఖూని చేశారని ఆరోపించారు. తెలంగాణలో 22 లక్షల మంది కొత్త ఓటర్లను మోసం చేసి పాత ఓటర్ లిస్టు ప్రకారం ఎన్నికలు నిర్వహించారని తెలిపారు. దీని వెనుక మర్మమేంటీ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు, సంక్షేమ పథకాలకు వ్యతిరేకం కాదని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో సి.సి. కెమెరాలు ఎందుకు పని చేయలేదని దామోదర ప్రశ్నించారు.