Begin typing your search above and press return to search.

అమ్మ పెట్టదు.. అడుక్కోనివ్వదు అంటే ఇదే మోడీజీ?

By:  Tupaki Desk   |   30 May 2021 10:00 PM IST
అమ్మ పెట్టదు.. అడుక్కోనివ్వదు అంటే ఇదే మోడీజీ?
X
అమ్మ పెట్టా పెట్టదు.. అడక్క తినానియ్యదన్న ఘాటు సామెత గుర్తుందా? తాజాగా కేంద్రం తీసుకునే కొన్ని నిర్ణయాల్ని చూసినప్పుడు ఇలాంటి సామెతలే గుర్తుకు వస్తాయి. దేశంలోని 130 కోట్ల మంది ప్రజల్ని పెట్టుకొని.. తయారైన కొన్ని వ్యాక్సిన్లను.. ప్రజలకు ఇచ్చే బదులు.. ప్రపంచంలోని పలు దేశాలకు ఇవ్వటం ద్వారా.. అవతార పురుషుడిగా మోడీ మారి ఉండొచ్చు. నా కుటుంబం ప్రపంచం అంటూ సొల్లు మాటలు చెప్పే కమ్యునిస్టుల మాదిరి మోడీ ఆలోచనలకు దేశంలోని పలు కుటుంబాలు భారీ మూల్యమే చెల్లించారు.

వ్యాక్సినేషన్ విషయంలో జరిగిన పొరపాట్లకు కొన్ని కుటుంబాలు తమ తండ్రిని.. తల్లిని.. సోదరుల్ని.. ఇలా ఎన్నో బంధాల్ని.. అనుబంధాల్ని శాశ్వితంగా దూరం చేసింది. చివరకు శశ్మానంలోనూ క్యూలు కట్టే పరిస్థితికి కారణమైంది. మన లాంటి దేశంలో కొవిడ్ వేళ.. టీకాల అవసరాన్ని గుర్తించాల్సిన నాయకత్వం అందుకు భిన్నంగా వ్యవహరించి.. లక్షలాది మందిలో అంతులేని విషాదాన్ని నింపారు. సెకండ్ వేవ్ లో కేసుల నమోదు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్న వేళ.. వ్యాక్సిన్లను తయారు చేసే కంపెనీలు.. తమ ఉత్పత్తిలో 15 శాతానికి ప్రైవేటుకు అమ్మేసే అవకాశం ఉండటం తెలిసిందే.

పెద్ద పెద్ద కొర్పారేట్ ఆసుపత్రులకు.. ప్రైవేటు సంస్థలకు టీకాల్ని అమ్ముతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల్లో 60 -70 శాతం ప్రజలకు వీలైనంత త్వరగా టీకాలు వేయించాల్సిన అవసరం ఉంది.

ఇలాంటివేళలో కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేటులోనూ టీకాలు వేసే అవకాశాల్ని కల్పించాల్సి ఉంది. ఈ మధ్యనే స్టార్ హోటళ్లు.. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టాయి. ఉదాహరణకు హైదరాబాద్ లోని రాడిసన్ హోటల్.. వైద్య నిపుణుల సాయంతో తమ హోటళ్లలో వ్యాక్సినేషన్ కార్యక్రమానికి తెర తీశారు. ఇందుకు టిఫిన్.. భోజనంతో పాటు బస.. ఉచిత వైఫైతో కలిసి ఒక్కో వ్యాక్సిన్ రూ.2999 (పన్నులు అదనం) అంటూ ప్రచారానికి తెర తీశారు.

ఆ మాటకు వస్తే దేశంలోని చాలానే హోటళ్లు వ్యాక్సినేషన్ కార్యక్రమానికి తెర తీశాయి. దీనిపై కేంద్రం తాజాగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. టీకా ప్యాకేజీ ప్రకటనలపై మండిపడింది. హోటళ్లలో టీకా వేయటం జాతీయ కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమ నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. ప్రభుత్వ వ్యాక్సినేషన్ సెంటర్.. ప్రైవేటు ఆసుపత్రులు.. ప్రభుత్వ..ప్రైవేటు కార్యాలయ పరిధిలో నిర్వహించే వర్కు ప్లేస్ కొవిడ్ టీకా సెంటర్లు.. పెద్ద వయస్కులు.. దివ్యాంగులు.. గ్రూప్ హౌసింగ్ సొసైటీలు.. కమ్యునిటీ సెంటర్లు.. ఓల్డ్ ఏజ్ హోంలలో తాత్కాలిక ప్రాతిపదిక టీకా సెంటర్లు ఏర్పాటు చేయాలే తప్పించి.. ఇలా స్టార్ హోటళ్లలో ఏర్పాటు చేయకూడని తేల్చింది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్గం ఏదైనా.. టీకాలు పెద్ద ఎత్తున వేయటం చాలా అవసరం. స్టార్ హోటళ్లలో టీకా ప్రోగ్రాంనే తీసుకుంటే.. ఎగువ మధ్యతరగతి.. సంపన్న వర్గాలు మాత్రమే వెళతాయి. ఇలా వెళ్లటం మామూలు టీకా కేంద్రాల మీద ఒత్తిడిని తగ్గిస్తుంది కదా? సంపన్నులు ఎవరైనా సరే.. ఎంతో కొంత ఇన్ ఫ్లుయిన్సు ప్రదర్శించి మిగిలిన వారి అవకాశాల్ని తమ సొంతం చేసుకుంటారన్నది పచ్చి నిజం. అలాంటప్పుడు వారంతా స్టార్ హోటళ్లలో భారీ ఛార్జీల్ని చెల్లించి వేయించుకుంటే నష్టమేమిటి? వైద్యుల పర్యవేక్షణలో వేయించకపోతే వారేమీ ఊరుకోరు. అన్నేసి డబ్బులు కట్టి.. సౌకర్యాలు లేకపోతే తాట తీస్తారన్నది మర్చిపోకూడదు.

కావాలంటే.. స్టార్ హోటళ్లలో వ్యాక్సినేషన్ వేసేందుకు మార్గదర్శకాల్ని విడుదల చేస్తే సరిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీకాను వీలైనంత మంది వేయించుకోవటమే లక్ష్యమన్నట్లుగా ప్రభుత్వ ఆలోచన ఉండాలే కానీ.. అలా వద్దు.. ఇలా వద్దు అనటంలో అర్థం లేదు. ఇప్పటికే రాష్ట్రాలు కోరినంతగా టీకాలు ఇవ్వలేక కిందా మీదా పడుతున్న కేంద్రం.. స్టార్ హోటళ్లు.. ఇతర మార్గాల్లో టీకాలు వేసే ప్రోగ్రాంను అడ్డుకోవటం అంటే.. అమ్మ పెట్టదు.. అడుక్కోనివ్వదన్న సామెత గుర్తుకు వచ్చేలా చేయటమేనని చెప్పాలి.