Begin typing your search above and press return to search.

ఉత్త‌మ్‌దీ అదే మాట‌.. లాజిక్ ఇదేన‌ట!

By:  Tupaki Desk   |   7 March 2022 11:00 PM IST
ఉత్త‌మ్‌దీ అదే మాట‌.. లాజిక్ ఇదేన‌ట!
X
ముంద‌స్తు ఎన్నిక‌లు.. తెలంగాణ రాజ‌కీయాల్లో ఇప్పుడు ఎక్కువ‌గా వినిపిస్తున్న మాట‌. కేసీఆర్ ఈ ఏడాది డిసెంబ‌ర్‌లో అసెంబ్లీని ర‌ద్దు చేసి ఎన్నిక‌లు వెళ్తార‌ని ప్ర‌త్య‌ర్థి పార్టీ నేత‌లు చెబుతున్నారు. ఓ వైపు ఈ సారి ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డం లేద‌ని స్వ‌యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేసినా.. ఇంకా దానిపై ఊహాగానాలు మాత్రం ఆగ‌డం లేదు.

ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను డైవ‌ర్టు చేయ‌డానికే కేసీఆర్ ఇలా చెప్పార‌ని.. రాష్ట్రంలో క‌చ్చితంగా ముంద‌స్తు ఎన్నిక‌లు మ‌రోసారి జ‌రుగుతాయ‌ని ప్ర‌తిప‌క్ష నాయ‌కులు అంటున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, ఎంపీ ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి కూడా ఇదే చెప్పారు.

తెలంగాణ‌లో వ‌చ్చే ఏడాది ముందస్తుగానే ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని ఉత్త‌మ్ తెలిపారు. అందుకు ఓ లాజిక్ కూడా ఉంద‌న్నారు. క‌ర్ణాట‌క అసెంబ్లీతో పాటే తెలంగాణ‌లోనూ ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. క‌ర్ణాట‌క శాస‌న‌స‌భ‌కు వ‌చ్చే మే లోపు ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. తెలంగాణ‌లో 2018లో ముంద‌స్తు ఎన్నిక‌లు వెళ్లిన కేసీఆ ర్రెండో సారి బంప‌ర్ మెజార్టీతో పార్టీని గెలిపించుకున్నారు. ఈ లెక్క ప్ర‌కారం చూస్తే వ‌చ్చే ఏడాది చివ‌ర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంటుంది.

కానీ మ‌రోసారి ముంద‌స్తుకే కేసీఆర్ మొగ్గు చూపుతున్నార‌ని మే లోపే ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉంటుంద‌ని ఉత్త‌మ్ అంటున్నారు. అందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాల‌ని కూడా పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం రాష్ట్రాన్ని వంచిస్తోందని ఆ పార్టీకి బుద్ధి చెప్పాల‌ని కేసీఆర్ మ‌రోసారి ముంద‌స్తుకు వెళ్లొచ్చు.

అలాగే జాతీయ రాజ‌కీయాల‌పై దృష్టి సారించిన కేసీఆర్‌.. మ‌రోసారి ముంద‌స్తుకు వెళ్లి పార్టీని గెలిపించుకునే ప్ర‌య‌త్నాలు చేసే అవ‌కాశం ఉంది. ఇక్క‌డ హ్యాట్రిక్ విజ‌యం సాధించి త‌న త‌న‌యుడు కేటీఆర్‌ను సీఎం చేసి.. అదే జోరుతో జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌న్న‌ది కేసీఆర్ ఆలోచ‌న అనే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. తాజాగా ఉత్త‌మ్ వ్యాఖ్య‌లు దానికి మ‌రింత బ‌లాన్ని చేకూర్చేవిగా ఉన్నాయి. తెలంగాణ‌లో మ‌రోసారి ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

దీంతో ఆయ‌న వ్యాఖ్య‌ల వెన‌క ఏదో లాజిక్ ఉంద‌నే అంటున్నారు. జాతీయ రాజ‌కీయాల్లోకి వెళ్లేందుకు ప్లాన్ వేసిన కేసీఆర్‌.. కాంగ్రెస్‌కు ద‌గ్గ‌ర‌వుతున్నార‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దీంతో కేసీఆర్ గుట్టు కొంచ‌మైనా కాంగ్రెస్ నేత‌ల‌కు తెలిచే ఛాన్స్ ఉండొచ్చ‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.