Begin typing your search above and press return to search.

ఈవీఎంలు వాడకపోతే ఉత్తమ్ కలలు నెరవేరుతాయా?

By:  Tupaki Desk   |   4 Dec 2017 3:39 PM GMT
ఈవీఎంలు వాడకపోతే ఉత్తమ్ కలలు నెరవేరుతాయా?
X
ఎన్నికల ప్రక్రియను ఎంతో సులభతరం చేసిన ఎలక్ర్టానిక్ ఓటింగు యంత్రాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ తాజాగా మరోసారి దాన్ని తెరపైకి తెచ్చింది. ఇప్పటికే ఎక్కడ ఎన్నికలు జరుగుతున్నా అక్కడ ఈవీఎంలపై అభ్యంతరం వ్యక్తంచేస్తోన్న ఆ పార్టీ తెలంగాణలో జరగబోయే పంచాయతీ ఎన్నికల విషయంలో ముందే ముందరి కాళ్లకు బంధం వేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈవీఎంలను అంగీకరించేది లేదంటోంది. బ్యాలట్ పేపర్లతోనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనిపై మాట్లాడుతూ ప్రభుత్వంపై ఈ విషయంలో ఒత్తిడి తెస్తామన్నారు.

కాగా సాధారణ ఎన్నికలకు ముందు రానున్న పంచాయతీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని సత్తా చాటాలని పార్టీ నాయకులను - కార్యకర్తలను కోరారు. ఇప్పటి నుంచే పంచాయతీ ఎన్నికలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. బూత్ లెవల్ నుంచి పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తలు - నాయకులు కృషి చేయాలన్నారు.

ఎన్నికల సందర్భంగా ఓటర్ల జాబితాలపైనా అంతా దృష్టి సారించాలని ఉత్తమ్ అన్నారు. అనర్హుల పేర్లు లేకుండా చూడాలని, అలాగే తప్పులు లేకుండా చూడాలని సూచించారు. ఇటీవల పలు రాష్ర్టాల్లో ఈవీఎంల విషయంలో వివాదాలు తలెత్తిన నేపథ్యంలో బ్యాలట్ పత్రాలకే మొగ్గు చూపుతున్నట్లు చెప్పారు.

మొత్తానికి 2019 ఎన్నికలపై దృష్టిపెట్టిన కాంగ్రెస్ పార్టీ పంచాయతీ ఎన్నికల విషయంలో గట్టి పట్టుదలతోనే ఉన్నట్లుగా కనిపిస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో ఎంతోకొంత మంచి ఫలితాలు సాధిస్తే ఆ ప్రభావం 2019 ఎన్నికలపై ఉండి నాలుగు సీట్లు ఎక్కువ సాధించుకోవచ్చని టీపీసీసీ నేతలు భావిస్తున్నారు. అయితే... ఈవీఎంలు వాడనంత మాత్రాన ఉత్తమ్ కలలు ఎంతవరకు నెరవేరుతాయో చూడాలి.