Begin typing your search above and press return to search.

మ‌రోసారి అమెరికా నుంచి అక్ర‌మ వ‌ల‌స‌దారులు ఇండియాకు

By:  Tupaki Desk   |   19 May 2020 5:00 AM IST
మ‌రోసారి అమెరికా నుంచి అక్ర‌మ వ‌ల‌స‌దారులు ఇండియాకు
X
తమ దేశంలోకి దొంగ చాటుగా, చట్ట విరుధ్ధంగా ప్రవేశించిన 161 మంది భారతీయులను అమెరికా భార‌త‌దేశానికి తిప్పి పంపిస్తోంది. వారంతా ఒక వారంలో స్వదేశానికి చేరనున్నారు. వీరిలో చాలామంది మెక్సికోతో గల అమెరికా దక్షిణ సరిహద్దుల నుంచి ర‌హాస్యంగా ఆ దేశంలోకి ప్ర‌వేశించారు. వీరిని గుర్తించిన అక్క‌డి అధికారులు వారిని అరెస్ట్ చేశారు. అక్కడ నివసించడానికి వారికి అన్ని దారులు మూసుకుపోవడంతో ఇక భార‌త‌దేశానికి పంపేందుకు చ‌ర్య‌లు తీసుకున్నారు. వీరి కోసం ప్రత్యేక చార్ట‌ర్డ్ విమానంలో భార‌త్‌కు త‌ర‌లించ‌నున్నారు.

అమెరికాలోకి అక్ర‌మంగా వ‌ల‌స వెళ్లిన వారిలో తెలంగాణ నుంచి ఇద్ద‌రు, ఏపీ నుంచి ఒక‌రితో పాటు హర్యానాకు చెందిన 76 మంది, పంజాబ్ నుంచి 56, గుజరాత్ నుంచి 12, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నుంచి ఐదుగురు, మహారాష్ట్ర నుంచి నలుగురు, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి ఇద్దరు చొప్పున, గోవా నుంచి ఒక‌రు ఉన్నారు. వీరిలో ముగ్గురు మ‌హిళ‌లు ఉన్నారు. చట్ట విరుధ్ధంగా ప్రవేశించిన వారిని అమెరికాలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అమెరికాలోని 95 జైళ్లలో మగ్గుతున్న 1,739 మంది భారతీయుల్లో వీరు కూడా ఉన్నారు. వారంతా పంజాబ్‌లోని అమృత్‌సర్‌కి రానున్నారు.

ఇలాంటి వారిని అమెరికా 2018లో 611 మందిని భార‌త్‌కు పంపివేసింది. 2019లో 1,616 మందిని భార‌త్‌కు త‌ర‌లించిన విష‌యం తెలిసిందే. తాజాగా ఇప్పుడు భార‌త్‌కు 161మందిని త‌ర‌లిస్తోంది. ఏజెంట్లకు 35 లక్షల నుంచి 50 లక్షల రూపాయల వరకు ముట్టజెప్పి అమెరికాకు వెళ్లి డాల‌ర్లు సంపాదించాల‌నే ఉద్దేశంతో వారంతా అక్ర‌మంగా వెళ్లారు. అయితే పోలీసుల‌కు చిక్క‌డంతో వారంతా నేర‌స్తులుగా మారిపోయారు.