Begin typing your search above and press return to search.

అమెరికా 45వ ప్రెసిడెంట్ గా ట్రంప్!

By:  Tupaki Desk   |   9 Nov 2016 7:57 AM GMT
అమెరికా 45వ ప్రెసిడెంట్ గా ట్రంప్!
X
అమెరికా 45వ ప్రెసిడెంట్ గా ట్రంప్!

సర్వేలన్నీ తారుమారు చేస్తూ.. అంచనాలను తలకిందులు చేస్తూ... ఎగ్జిట్‌ పోల్స్‌, మీడియా విజయం ఖాయమన్న డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమికి చేరువకాగా.. మెజారిటీ ప్రజలు ఊహించని విధంగా రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌ విజయకేతనం ఎగురవేశారు!

భారతకాలమానం ప్రకారం బుదవారం ఉదయం ఫలితాల ప్రకటన మొదలైనప్పటి నుంచీ ఆధిక్యంలో దూసుకుపోతున్న ట్రంప్... భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 01:00 గంట సమయంలో అమెరికా అధ్యక్షుడు కావడానికి అవసరమైన 270 ఓట్లు సాధించారు. ఈ క్రమంలో కనీసం 300కు పైగా ఓట్లు సాధించుకునే పరిస్థితి ఉండటం గమనార్హం. కాగా హిల్లరీ 218 స్థానాల వద్దే కొనసాగుతున్నారు.

@ 12:30 పీఎం -

ట్రంప్ కు మరో రెండు సీట్లు వస్తే...

భారత కాలమానం ప్రకారం బుదవారం ఉదయం నుంచి ప్రారంభమైన అమెరికా ఎన్నికల ఫలితాలు ఎవ్వరూ ఊహించని విదంగా వస్తోన్న సంగతి తెలిసిందే! ఉదయం ఫలితాల ప్రకటన మొదలైనప్పటినుంచీ ఆధిక్యంలో దూసుకుపోతున్న ట్రంప్... భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:30 నిమిషాలకు అమెరికా అధ్యక్షుడు కావడానికి అవసరమైన 270 ఎలెక్టోరల్ కాలేజీ ఓట్లకు గానూ 268 ఓట్లు సాధించారు. ఈ క్రమంలో కనీసం 300 ఓట్లు సాధించుకునేలా పరిస్థితి ఉండటం గమనార్హం. కాగా హిల్లరీ 218 స్థానాల వద్దే కొనసాగుతున్నారు.

@ 12:00 పీఎం - 270కి అతిచేరువలో ట్రంప్

ఎవ్వరూ ఊహించని విదంగా, సర్వే ఫలితాలకు షాకిస్తూ అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో రిపబ్లికన్ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ దూసుకుపోతున్నారు. తాజా సమాచారం ప్రకారం ట్రంప్ మ్యాజిక్ ఫిగర్ కి అతిచేరువలో 260 స్థానల్తో దూసుకుపోతున్నారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు ట్రంప్ కంటే హిల్లరీ దాదాపు 30 స్థానాలు వెనుకబడి 215 స్థానాలతో ఉండగా... గెలవడానికి అవసరమైన 270 ఓట్లకు ఇంకా 55 ఓట్ల దూరంలో నిలిచారు. కాగా... ఇంకా 79 స్థానాల్లో ఫలితాలు వెలువడాల్సి ఉంది. అయితే వీరిద్దరికీ మధ్య ఓట్ల శాతంలో వ్యత్యాసం మాత్రం 1%గానే ఉంది!

@11:30 ఏఎం:

ట్రంప్ రిలాక్స్...

మేజిక్‌ ఫిగర్‌ కు చేరువవుతుండడంతో ట్రంప్‌ మద్దతుదారులు అప్పుడే సంబరాలు మొదలుపెట్టేసినట్లు కథనాలొస్తున్నాయి. సర్వేలన్నీ హిల్లరీ గెలుస్తారని వెల్లడించడంతో కౌంటింగ్‌ ముందు దీమాగా ఉన్న డెమోక్రాటిక్‌ పార్టీ మద్దతుదారులు ఫలితాల సరళితో డీలా పడిపోతుండగా... ట్రంప్ జనాలు మాత్రం సంబరాలకు రెడీ అవుతున్నారు. వారి సంగతి అలా ఉంటే... ట్రంప్ ఈ సమయంలో ఏమి చేస్తున్నారా అని పలువురు సందేహం వ్యక్తపరిచగా, ట్రంప్ స్నేహితుడు, న్యూయార్క్ మాజీ మేయర్ రూడీ గులియాని ఆ విషయం కూడా చెప్పారు. ప్రస్తుతం ట్రంప్ తన అపార్ట్ మెంట్ లో డైట్ కోక్ తాగుతూ రిలాక్స్ గా కూర్చుని టీవీలో ఎన్నికల ఫలితాలను చూస్తున్నారట.

@11:00 ఏఎం:

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఊహించని విధంగా డొనాల్డ్‌ ట్రంప్‌ ముందంజలో ఉండడంతో హిల్లరీ క్లింటన్‌ మద్దతుదారులు షాక్‌ తిన్నారు. ఈ మేరకు అమెరికాలో లైవ్ ఛానల్స్ రిపోర్ట్ ప్రకారం గెలుపు దిశగా ట్రంప్‌ పయనిస్తుండడంతో హిల్లరీ అండ్ కో అంతా ఆందోళన చెందుతున్నారట. హిల్లరీకి సులువైన రాష్ట్రాల్లోనూ, కీలక రాష్ట్రాల్లోనూ ట్రంప్‌ విజయం సాధించడంతో హిల్లరీ వర్గీయులకు మింగుడు పడడం లేదు. ఇప్పటికే మేజిక్ ఫిగర్ కు ట్రంప్ చేరువవుతున్నారనే చెప్పాలి. దీంతో అగ్రరాజ్య అధినేతగా ట్రంప్ ఎన్నిక దాదాపు ఖరారైనట్లే అనే కథనాలు ఇంగ్లిష్ ఛానల్స్ లో ప్రసారమైపోతున్నాయి! తాజా లెక్కల ప్రకారం ట్రంప్ 247 స్థానాల్లో దూసుకుపోతుండగా, హిల్లరీ 211 స్థానాలతో కదులుతున్నారు.

@10:00 ఏఎం:

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపులో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌, డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిని హిల్లరీ క్లింటన్‌ల మధ్య ఆధిక్యాలు దోబూచులాడుతున్నాయి. రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు పూర్తి అవుతున్న కొద్దీ ఫలితాల తీరు మారుతోంది. ర్పస్తుతానికైతే డొనాల్డ్‌ ట్రంప్‌ ఆధిక్యంలోకి దూసుకువెళతున్నారు. ఈ క్రమంలో తాజా ఓట్ల లెక్కింపుపై అమెరికాకు చెందిన మూడు ప్రముఖ వార్తాసంస్థలు వెల్లడించిన సమాచారం ప్రకారం ట్రంప్ బ్యాచ్ లో సంబరాలు చేసుకునే సంకేతాలు వస్తున్నాయి. ఈ లెక్కల్లో సీ.ఎన్‌.ఎన్‌. వార్తా సంస్థ లెక్కల ప్రకారం... ట్రంప్‌ - 216 స్థానాలో దూసుకుపోతుండగా హిల్లరీ 197 స్థానాలో ఉన్నారు. ఇక న్యూయార్క్‌ టైమ్స్‌ చెప్పిన ప్రకారం ట్రంప్‌ - 216 స్థానాల్లో ఉండగా హిల్లరీ - 188 స్థానాలతో పోరాడుతున్నారు. యూ.ఎస్‌.ఏ. టుడే వార్తల ప్రకారం ట్రంప్‌ - 232 స్థానాల్లో ఉండగా హిల్లరీ 209 స్థానాలు సంపాదించే దిశగా ఉన్నారు!

@10:30 ఏఎం:

ప్రపంచమంతా తీవ్ర ఆసక్తిని రేకెత్తించిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠను కలిగిస్తున్నాయి. దీంతో ఎంతో రసవత్తరంగా సాగుతున్న పోరులో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌ మెజార్టీ మార్క్ కు చేరువయ్యారు. 538 ఓట్లున్న ఎలెక్టోరల్‌ కాలేజీలో ట్రంప్‌ 244 ఓట్లు ఇప్పటికే సాధించినట్లు తెలుస్తోంది. కాగా సర్వేల ఫలితాల ప్రకారం విజయం ఖాయమని భావించిన డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ 209 ఓట్లతో వెనుకబడ్డారు. మెజార్టీ సాధించాలంటే 270 ఓట్లు అవసరం అన్న సంగతి తెలిసిందే!

@9:30 ఏఎం:

అమెరికా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ - డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిని హిల్లరీ క్లింటన్‌ ల మధ్య రసవత్తర పోరు జరిగినట్టు ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో మొదట్లో ట్రంప్‌ - హిల్లరీ క్లింటన్‌ ల మధ్య హోరాహోరీ పోరు జరిగినట్టు ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించినా ఓట్ల లెక్కింపు జరుగుతున్న కొద్ది ట్రంప్‌ ఆధిక్యంలోకి వస్తున్నారు.

భారత కాలమానం ప్రకారం బుదవారం ఉదయం ప్రారంభమైన లెక్కింపులో గం.8:30 లకు హిల్లరీ 104 ఓట్లు సాధించగా - ట్రంప్ 136 స్థానాలతో ముందంజలో ఉన్నారు. కనెక్టికట్‌ - డెలావెర్‌ - ఇల్లినాయిస్‌ - మేరీలాండ్‌ - మసాచుసెట్స్ - న్యూజెర్సీ - రోడ్‌ ఐలాండ్‌ వెర్మెంట్‌ రాష్ట్రాల్లో హిల్లరీ ఆధిక్యంలో వున్నట్టు ఎగ్జిట్‌పోల్స్‌ లో వెల్లడైంది. కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న ఓట్ల లెక్కింపులో మొదట్లో హిల్లరీ ఆధిక్యం సాధించినా అనంతరం ట్రంప్‌ దూసుకువస్తున్నారు.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/