Begin typing your search above and press return to search.

వారిద్దరిలో ఎవరు గెలిస్తే ఏమవుతుంది..?

By:  Tupaki Desk   |   8 Nov 2016 3:07 AM GMT
వారిద్దరిలో ఎవరు గెలిస్తే ఏమవుతుంది..?
X
ప్రపంచానికి పెద్దన్న లాంటి అమెరికా అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ఘట్టం ఈ రోజు చోటు చేసుకోనుంది. అమెరికా చట్టాల ప్రకారం.. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ సుదీర్ఘంగా సాగుతుందన్న సంగతి తెలిసిందే. నెలల తరబడి సాగే అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన ఘట్టం ఈ రోజు చోటు చేసుకోనుంది. నాటకీయ పరిణామాల నేపథ్యంలో డెమొక్రాట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్ అధ్యక్ష పదవిని సొంతం చేసుకుంటారని పలు అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు.. అలాంటిదేమీ లేదని.. రిపబ్లికన్ల అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ విజయం పక్కా అని కొందరు విశ్వాసం చేస్తున్నారు.

విజేత ఎవరన్నది మరికొన్ని గంటల్లో తెలిసిపోయే క్రమంలో.. గెలుపు గుర్రం కంటే కూడా గెలిచిన వారికి అనుగుణంగా వెనువెంటనే ఏం జరగనున్నాయన్నది ఇప్పుడు ఆసక్తికర చర్చ సాగుతోంది. ఎందుకంటే.. అమెరికా అధ్యక్ష పదవి అంటే మామూలు విషయం కాదు. అత్యంత కీలకమైన.. బాధ్యతాయుతమైన స్థానం. మరి.. ఆ స్థానాన్ని చేజిక్కించుకునే వ్యక్తి అనుసరించే విధానాలు ప్రత్యక్షంగా కానీ.. పరోక్షంగా కానీ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంటాయి. మరి.. ఈ కోణంలో ఎవరు గెలిస్తే ఏం జరుగుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

అంశాల వారీగా ఈ విషయాల్ని చూస్తే..

ఫలితాలు వెలువడిన వెంటనే జరిగేదేంటి?

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఏం జరుగుతున్నదన్న విషయానికి వస్తే.. అమెరికా అధ్యక్ష పదవిని ఎవరు చేపట్టనున్నారన్న విషయం తెర మీదకు వచ్చినంతనే ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు అంతోఇంతో ప్రభావితం కావటం ఖాయం. ఒకవేళ ట్రంప్ కానీ విజయం సాధిస్తే.. ప్రపంచ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురి అయ్యే ప్రమాదం ఉంది. కాకుంటే.. రష్యా.. చైనాలు ఇందుకు మినహాయింపుగా ఉండే అవకాశం ఉంది. అయితే.. ఈ ప్రభావం తాత్కాలికం మాత్రమేనన్న విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు. హిల్లరీ విజేతగా ఆవిర్భవించిన వెంటనే.. ఇప్పటివరకూ నష్టాలు చవిచూస్తున్న మార్కెట్లు రికవరీ మోడ్ లోకి వెళ్లే వీలుంది. అదే సమయంలో ట్రంప్ గెలిస్తే మాత్రం మార్కెట్ తీవ్ర ఒడుదుడుకులకు లోను అయ్యే ప్రమాదం ఉంది. మన దేశం విషయానికి వస్తే.. అమెరికా అధ్యక్ష ఫలితాల ప్రభావం వెనువెంటనే పడినా.. అది తాత్కాలికమే తప్ప.. దీర్ఘకాలం మాత్రం కాదన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఫలితాలు వెల్లడైన వెంటనే. ట్రంప్ గెలిస్తే మార్కెట్ నష్టాలు నమోదు చేసే ప్రమాదం ఉంది.

మార్కెట్ స్టాక్స్

ట్రంప్ గెలిస్తే మార్కెట్ పతనం అవుతుంది. హెచ్చుతగ్గుల ప్రభావం ఎక్కువగా ఉంటాయి. ఫైనాన్షియల్ స్టాక్స్ దెబ్బ తినే ప్రమాదం ఉంది. దీర్ఘకాలంలో మాత్రం ఇన్ ఫ్రా షేర్లు వెలుగుతాయి. అదే సమయంలో హిల్లరీ గెలిస్తే మాత్రం ఇప్పటివరకూ వచ్చిన నష్టాలకు బ్రేక్ రావొచ్చు. బ్యాంకులు.. ఫార్మా సంస్థలు నియంత్రణ భయాలతో దెబ్బ తినే వీలుంది.

అమెరికా డాలర్ కు ఏం జరుగుతుంది?

బలోపేతమైన డాలర్ ట్రంప్ విజయంతో కుంగుబాటుకు లోనయ్యే ప్రమాదం ఉంది. స్విస్ ఫ్రాంక్.. జపాన్ యెన్ లాంటి వాటితో పోలిస్తే పడిపోయే ప్రమాదం ఉంది. అదే హిల్లరీ గెలిస్తే మాత్రం డాలర్ మరింత బలపడే అవకాశం ఉంది. దీని కారణంగా వర్థమాన దేశాల కరెన్సీ ప్రభావితమయ్యే అవకాశం ఉంది. హిల్లరీ గెలుపు రూపాయి మీద పెద్ద ప్రభావం చూపించే అవకాశం ఉండదు.

ఫెడ్ రేట్ల మాటేంటి?

ప్రపంచీకరణ పుణ్యమా అని అగ్రరాజ్యాలకు అనుగుణంగా మార్కెట్లు ఏర్పడిన పరిస్థితి. ఈ కారణం చేతనే అమెరికాలో ఏదైనా మార్పు చోటు చేసుకున్నా.. విధానపరమైన కీలక నిర్ణయాలు తీసుకున్నా ఆ ప్రభావం ప్రపంచం మీద పడే పరిస్థితి. ఇదిలా ఉంటే.. ప్రపంచాన్ని ప్రభావితం చేసే ఫెడ్ వడ్డీ రేట్ల విషయానికే వస్తే.. ట్రంప్ కానీ గెలుపొందితే ఫెడ్ వడ్డీ రేట్ల విషయంలో పెంచే అవకాశం ఉండదు. అదే సమయంలో హిల్లరీ కానీ విజయం సాధిస్తే.. ఫెడ్ రేట్లను ఆమె పెంచే అవకాశం ఉంది.అదే జరిగితే.. భారత్ మీద ప్రభావం పడుతుంది. ఫెడ్ వడ్డీ రేట్లు పెరిగితే.. భారత్ లో పెట్టుబడులు పెట్టిన వారు తమ మదుపును ఉపసంహరించుకొని అమెరికాకు తరలించే ప్రమాదం ఉంది.

బంగారం.. ముడి చమురు సంగతి?

ట్రంప్ గెలిస్తే బంగారం.. ఇతర విలువైన లోహాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇరాన్ వ్యతిరేకవైఖరితో చమురు ధరలు స్థిరంగా ఉండే వీలుంది. బొగ్గుకు అనుకూల వైఖరి గ్యాస్ కు మాత్రం ఏ మాత్రం మంచిది కాదు. అదే హిల్లరీ గెలిస్తే బంగారం తగ్గే అవకాశం ఉంది. చమురు.. బొగ్గు ధరలు తగ్గే వీలుంది. సంప్రదాయేత ఇంధన వనరులకు మంచి రోజులు వచ్చినట్లే.

ప్రపంచ మార్కెట్ల మాటేంటి?

ట్రంప్ గెలిస్తే రష్యాకు తప్పించి మిగిలిన దేశాలన్నింటికీ ప్రతికూలంగా మారే వీలుంది. అయితే.. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా భారత్ మార్కెట్లకు మునిగిపోయే ప్రమాదం ఉండదు. కాకుంటే ఎంతోకొంత ఒత్తిడికి గురి అవుతుంది. అదే హిల్లరీ గెలిస్తే.. రెట్టించిన ఉత్సాహంతో దుమికే అవకాశం ఉంది. హిల్లరీ విజయంతో విదేశీ మార్కెట్లలో సానుకూల వాతావరణం నెలకొనే వీలుంది.