Begin typing your search above and press return to search.

మన మీడియాకు ఈ అమెరికా పిచ్చ ఏంది బాసూ?

By:  Tupaki Desk   |   6 Nov 2020 5:00 PM IST
మన మీడియాకు ఈ అమెరికా పిచ్చ ఏంది బాసూ?
X
గడిచిన మూడు రోజులుగా ఇంటికి వచ్చే పేపర్.. టీవీలో వచ్చే న్యూస్ చానళ్లు.. ఆ మాటకు వచ్చే వివిధ న్యూస్ వెబ్ సైట్ల నుంచి వస్తున్న పుష్ నోటిఫికేషన్లను పరిశీలిస్తే.. మొత్తం అమెరికా నిండి ఉంటుంది. నాలుగేళ్లకు ఒకసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఇంత ప్రాధాన్యత ఇవ్వటమా? అన్న విస్మయం వ్యక్తమవుతోంది. కరోనా దెబ్బకు పేజీలు తగ్గిపోయిన న్యూస్ పేపర్లో.. పేజీల కొద్దీ అమెరికా ఎన్నికల అంశాలు..విశ్లేషణలు మాత్రమే కాదు..అక్కడ ఎన్నికలు జరిగే తీరు.. నియమనిబంధనలు ఇలా అమెరికా చుట్టూనే మన కలం వీరులు తిరుగుతున్నారు.

ప్రపంచానికి పెద్దన్న దేశంలో జరిగే అధికార మార్పిడి అంశాన్ని రిపోర్టు చేయొద్దని చెప్పట్లేదు. మితంగా ఉంటే సరిపోయే దానికి బదులుగా..ఆ అంశాల మీద అంత ఫోకస్ అవసరమా? అన్నది ప్రశ్న. తమ చుట్టు ఉన్న సమస్యలు.. విషయాల్ని.. రాజకీయాల్ని వదిలేసి.. ఎక్కడో అల్లంత దూరాన ఉన్న అమెరికాలో జరిగే ఎన్నికల అప్డేట్ కోసం పడుతున్న తపన.. తాపత్రయం చూస్తే.. పెద్దన్న మీద అంత మోజు ఏమిటి? అన్నది ప్రశ్న.

కరోనా కారణంగా స్పేస్ తగ్గిపోయిందన్న పేరుతో.. ఎన్నో ఆసక్తికర అంశాల్ని.. ప్రజలకు అవగామన కలిగించే అంశాల మీద ఫోకస్ తగ్గించటం సరికాదంటున్నారు. ప్రపంచాన్ని చుట్టేస్తున్న కరోనా సెకండ్ వేవ్ కు మన మీడియా ఇస్తున్న ప్రాధాన్యత తక్కువనే చెప్పాలి. లాక్ డౌన్ సడలింపుల తర్వాత ప్రజలు సాధారణ స్థాయికి వచ్చే వేళ.. ప్రమాదం అంతకంతకూ పెరిగే అవకాశం ఉంది. ఈ విషయాల మీద అవగాహనతో పాటు.. అప్రమత్తత ఎంత ఉందన్న విషయాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ.. అలాంటి ప్రయత్నాలేమీ జరిగిన దాఖలాలు కనిపించట్లేదని చెప్పాలి. అమెరికా అధ్యక్ష్ ఎన్నికల వివరాలు ముఖ్యమే.. కానీ అదే మొత్తం కాదన్న విషయాన్ని మన మీడియా ఎప్పటికి తెలుసుకుంటుందో?