Begin typing your search above and press return to search.

అమెరికాలోని చైనా కాన్సులేట్ లో మంటలు.. కొత్త రచ్చ షురూ

By:  Tupaki Desk   |   23 July 2020 10:30 AM IST
అమెరికాలోని చైనా కాన్సులేట్ లో మంటలు.. కొత్త రచ్చ షురూ
X
ఇద్దరు మొండివాళ్లు తలపడితే ఎలా ఉంటుంది? ఒకరికొకరు తమ అధిక్యతను ప్రదర్శించుకోవటానికి ఎంతకైనా వెళ్లే పరిస్థితి ఉన్నప్పుడు పరిణామాలు షాకింగ్ గానూ.. సంచలనంగానూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితే అమెరికా.. చైనా మధ్య నెలకొందని చెప్పాలి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా చైనా మధ్య సంబంధాలు అంతకంతకూ తగ్గిపోయిన సంగతి తెలిసిందే. కోవిడ్ ఎపిసోడ్ పరిస్థితిని మరింతగా దిగజార్చింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతోంది. త్వరలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతుండటం.. ఈ ఎన్నికలు ట్రంప్ కు కీలకం కావటంతో.. ఎంతకైనా సరే.. అన్నట్లుగా ఆయన పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

తాజాగా అమెరికాలోని చైనా దౌత్య కార్యాలయాన్ని మూసివేయాలని ట్రంప్ సర్కారు ఆదేశించింది. దీంతో.. ఇరు దేశాల మధ్య కొత్త రచ్చ షురూ అయ్యింది. హ్యూస్టన్ లో చైనా కాన్సులేట్ జనరల్ గూఢచర్య కార్యాకలాపాలకు పాల్పడుతోందన్న ఆరోపణలతో చైనా కాన్సులేట్ ఆఫీసును మూసివేయాలని ఆదేశించింది. అమెరికా మేధో సంపత్తిని.. ప్రైవేటు సమాచారాన్ని కాపాడుకునేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా పేర్కొంది.

అయితే.. చైనా ఏ విధమైన గూఢచర్యానికి పాల్పడిందన్న విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. అమెరికా తీసుకున్న నిర్ణయంపై చైనా విరుచుకుపడింది. ట్రంప్ సర్కారు తీసుకున్న నిర్ణయం దారుణమైనదని.. అన్యాయమైనదని ఆరోపించింది. అమెరికా తన తప్పుడు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

అమెరికా చర్యకు ప్రతీకారచర్యలు తప్పవని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వార్నింగ్ ఇవ్వటం గమనార్హం. ఇలా రెండు దేశాల మధ్య సంబంధాలు సున్నితంగా మారిన వేళలో.. అనూహ్య పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ట్రంప్ సర్కారు ఆరోపణలు చేస్తున్న హ్యుస్టన్ లోని చైనా కాన్సులేట్ కార్యాలయంలో మంటలు చెలరేగాయి. అయితే.. ఇదంతా చైనా అధికారుల తప్పేనని చెబుతున్నారు. పలు డాక్యుమెంట్లను తగులబెట్టే క్రమంలో మంటలు చెలరేగినట్లుగా చెబుతున్నారు.

ఆసక్తికరమైన అంశం ఏమంటే.. చైనా కాన్సులేట్ కార్యాలయాన్ని మూసివేయాలని ఆదేశించిన కాసేపటికే ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నట్లు చెబుతున్నారు. కొన్ని కంటైనర్లు.. డస్ట్ బిన్స్ లోని డాక్యుమెంట్లను తగులపెట్టటంతో మంటలు చెలరేగినట్లుగా వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మంటలు ఆర్పటానికి వెళ్లిన అగ్నిమాక సిబ్బందికి కాన్సులేట్ అధికారులు అనుమతి ఇవ్వలేదు.

చైనా విషయంలో అమెరికా అంత పెద్ద నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నట్లు? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. కరోనా వ్యాక్సిన్ కు సంబంధించిన అధ్యయన వివరాల్ని దొంగలించారంటూ ఇద్దరు చైనా జాతీయుల్ని అమెరికా న్యాయశాఖ వేలెత్తి చూపిన రోజే హ్యుస్టన్ లోని కాన్సులేట్ మూసివేతకు నిర్ణయం తీసుకున్నారు. ఆ ఇద్దరు అమెరికాలో కరోనా వైరస్ కు చెక్ పెట్టే వ్యాక్సిన్ అధ్యయనాల్ని తస్కరించటానికి ప్రయత్నించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రానున్నరోజుల్లో ఈ వ్యవహారం మరెన్ని మలుపులు తిరుగుతుందన్నది అసలు ప్రశ్న.