Begin typing your search above and press return to search.

అమెరికా మెరుపు దాడి.. ఐసీస్ కీలక నేత హతం!

By:  Tupaki Desk   |   5 Feb 2022 9:00 AM IST
అమెరికా మెరుపు దాడి.. ఐసీస్ కీలక నేత హతం!
X
అమెరికా జరిపిన మెరుపు దాడిలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థ (ఐఎస్ఐఎస్) కీలక నేత అబూ ఇబ్రహీం అల్‌ హషిమీ-అల్‌- ఖురేషీ ఆత్మాహుతికి పాల్పడ్డాడు. ఆయన నివసించే భవనం పైన హెలికాఫ్టర్లు చక్కర్లు కొట్టడంతో దాడి ఘటనను ముందుగానే ఊపించుకున్నాడని అమెరికా రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో అమెరికా చేతిలో మరణించకూడదని భావించి... ఆత్మాహుతి జాకెట్ వేసుకొని తనకు తానే పేల్చుకున్నాడని వెల్లడించాయి. ఈ ఘటన సిరియా-టర్కీ సరిహద్దుల్లోని ఆత్మేహ్ ప్రాంతంలో జరిగినట్లుగా పేర్కొన్నాయి. ఇందులో ఖురేషీ కుటుంబానికి చెందిన మహిళలు, పిల్లలు కూడా చనిపోయినట్లు అగ్రరాజ్య అధికారులు తెలిపారు.

సిరియా- టర్కీ సరిహద్దుల్లోని ఆత్మేహ్... ఇస్లామిక్ స్టేట్ కీలక నేత అబూబకర్ ఆల్ బగ్దాదీ ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతానికి కొన్ని మైళ్ల దూరంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో కుటుంబంతో కలిసి ఖురేషీ నివాసం ఉండేవాడు. బాగ్దాదీ ఎన్ కౌంటర్ తర్వాత నాలుగు రోజులకు ఆయన బాధ్యతలు చేపట్టాడు. ఆయన బాహ్య ప్రపంచానికి చాలా దూరంగా ఉండేవాడు. అతి తక్కువ సమయాల్లో మాత్రమే బయటకు వస్తాడు. ఎప్పటికప్పుడు కొరియర్ల ద్వారానే ఉగ్ర సంస్థ కార్యకలాపాలను నిర్వహించేవాడు. ఆల్ బగ్దాదీ విధానాలను వ్యతిరేకించేవారి పట్లు చాలా క్రూరంగా వ్యవహరించేవాడు. ఇతడిని మట్టుబెట్టడానికి అగ్రరాజ్యం ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. ఎలాగైనా సరే హతం చేయాలని పక్కా ప్రణాళికతో వేచి చూస్తోంది. ఇందుకు కొన్ని నెలలుగా అతడి ఉనికిని పరిశీలిస్తూ వస్తోంది. ఆత్మేహ్ లోని వ్యవసాయ క్షేత్రంలో నివసిస్తున్నాడని పక్కా సమాచారంతో... గత కొంతకాలంగా అతడి కదలికలు గమనిస్తూ వస్తోంది. ఇతడు కేవలం స్నానం చేయడానికి మాత్రమే అప్పుడప్పుడు బయటకు వచ్చేవాడని గుర్తించింది.

ఖురేషీని హతమార్చడానికి స్పషల్ ఆపరేషన్ కోసం అమెరికా రక్షణ శాఖ చాలా అప్రమత్తంగా వ్యవహరించింది. అయితే ఖురేషీతో పాటు మరికొందరు అమాయకులు ఆ భవనంలో ఉంటున్న నేపథ్యంలో వారికి హానీ కలగకుండా ఉండేలా ప్లాన్ రూపొందించాయి. ఆ ప్రణాళికను డిసెంబర్ లో అగ్రరాజ్య రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్, జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్, శ్వేతసౌధ అధ్యక్షుడు బైడెన్ ముందు ఉంచారు. ఈ ముగ్గురూ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే మెరుపు దాడికి సత్వరం ఏర్పాట్లు చేసుకున్నట్లు అగ్రరాజ్య రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. కాగా ఈ ఆపరేషన్ కోసం డిసెంబర్ నుంచి ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయని అమెరికా బలగాలు పేర్కొన్నాయి.

పక్కా ప్లాన్ ప్రకారం ఖురేషీ నివాసం ఉంటున్న భవనంపై అగ్రరాజ్య కమాండోలు, హెలికాప్టర్, డ్రోన్ల సాయంతో కాల్పులు జరిపారు. ఇరువైపులా భీకర కాల్పులు జరిగాయి. భవనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే పది మందిని రక్షించగలిగారు. ఈ ఘటనలో అమాయకులైన మహిళలు, చిన్నారులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇక తనపై దాడి ఘటనను ఖురేషీ ముందుగానే పసిగట్టాడు. అమెరికా చేతికి చిక్కకూడదనే ఉద్దేశంతో ఆత్మాహుతి జాకెట్ తో ఊపిరి తీసుకున్నాడని సిరియా వర్గాలు వెల్లడించాయి. ఆయన ఆత్మాహుతి వల్లే అమాయకులు బలి అయ్యారని అగ్రరాజ్య రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. డీఎన్ఏ ఆధారంగా ఖురేషీ మృతి చెందినట్లు గుర్తించామని స్పష్టం చేశాయి. కాగా ఖురేషీ మరణం ఐసీస్ సంస్థకు కోలుకోలేని దెబ్బ గా వర్ణించారు. అయితే ఈ ఆపరేషన్ ను అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, ఇతర అధికారులు స్వయంగా వీక్షించడం గమనార్హం.