Begin typing your search above and press return to search.

భార‌త టెకీలే ల‌క్ష్యం...సిలికాన్ వ్యాలీలో వేట‌

By:  Tupaki Desk   |   15 April 2017 5:14 AM GMT
భార‌త టెకీలే ల‌క్ష్యం...సిలికాన్ వ్యాలీలో వేట‌
X
అమెరికాలో ఉన్న భార‌తీయ ఐటీ నిపుణుల ల‌క్ష్యంగా మ‌రో కీల‌క అడుగును ఆ ప్ర‌భుత్వం వేసింది. ఇప్ప‌టికే అక్రమంగా సరిహద్దులు దాటి దేశంలోకి ప్రవేశించేవారి సంఖ్యను త‌న చ‌ర్య‌ల‌తో గణనీయంగా తగ్గించి విజ‌యం సాధించిన ఉత్సాహంతో ఉన్న అమెరికా పాలనా యంత్రాంగం... ఇప్పుడు సరయిన పత్రాలు లేకుండా వలస వచ్చిన వారిపై చర్యలు తీసుకునే పనిలో పడింది. ముఖ్యంగా సెంట్రల్ అమెరికాలోని ఉద్యోగులు - సిలికాన్ వ్యాలీలోని భారతీయ టెకీ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని ఈ అణచివేత చర్యలు సాగుతున్నాయి. అంతేకాకుండా ఆషామాషీగా తీసుకోని విధంగా స్ప‌ష్ట‌మైన ఆదేశాల‌ను అమెరికా ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది.

అక్రమంగా వలస వచ్చిన వారందరి పట్ల కఠిన వైఖరిని అనుసరించాలని పోలీసులు - ప్రాసిక్యూటర్లు - న్యాయమూర్తులకు ఆదేశాలు అందాయి. వలసకు సంబంధించి సరయిన పత్రాలు లేకుండా ఎవరు కనపడినా తీవ్రంగా ప్రాసిక్యూట్ చేయాలనే ఉత్త‌ర్వులు చేరాయి.అక్రమ వలసదారులు ఉండే ప్రదేశాలను చుట్టుముట్టి తనిఖీలు చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి. దేశంలో దశాబ్దాల తరబడి ఉంటున్న అక్రమ వలసదారులను సైతం వదలిపెట్టొద్దనే సూచనలు అందాయి. అక్రమ వలసదారులకు సురక్షిత ప్రదేశాలుగా భావిస్తున్న కోర్టుహాల్‌ లు - టౌన్ హాల్‌ లు - వారికి ఆశ్రయం ఇచ్చే నగరాలపై కేంద్రీకరించి తనిఖీలు చేయాలని ఆదేశాలు అందాయి. అంతే కాకుండా అదుపులోకి తీసుకున్న అక్రమ వలసదారులను నిర్బంధంలో ఉంచడానికి మరిన్ని మౌళిక సదుపాయాలను నిర్మిస్తున్నారు. ఇలాంటి కేసులను విచారించడానికి మరింత మంది న్యాయమూర్తులను ఏర్పాటు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, అమెరికా - మెక్సికోల మధ్య నిర్మించనున్న సరిహద్దు గోడ కోసం డిజైన్లు రూపుదిద్దుకుంటున్నాయి. అధికారంలోకి వస్తే ఈ సరిహద్దు గోడ నిర్మిస్తానని డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ గోడ ద్వారా భ‌విష్య‌త్తులో వ‌ల‌స‌ల‌ను పెద్ద ఎత్తున అరిక‌ట్ట‌డానికి ట్రంప్ దూకుడుగా ముందుకు సాగుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/