Begin typing your search above and press return to search.

మరో ఉగ్రవాదిని ఏసేసిన అగ్రరాజ్యం

By:  Tupaki Desk   |   7 Feb 2020 2:38 PM IST
మరో ఉగ్రవాదిని ఏసేసిన అగ్రరాజ్యం
X
ప్రపంచానికి పెద్దన్న అమెరికా మరో సంచలన ప్రకటన చేసింది. అల్ ఖైదాలో కీలక నేతను తాము తాజాగా హతమార్చినట్లుగా ప్రకటించి అందరిని ఉలిక్కిపడేలా చేసింది. మరో ఏడాదిలో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్న వేళ.. ఇటీవల కాలంలో అమెరికా ప్రయోజనాల్ని కాపాడే అధినేత అన్న ఇమేజ్ కోసం ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే కీలక ఉగ్ర నేతను ఏసేసి ఉంటారని అంచనా వేస్తున్నారు.

అరేబియా ద్వీప కల్ప ప్రాంతాన్ని అడ్డాగా చేసుకున్న అల్ ఖైదా నేత ఖాసీం అల్ -రిమిని హతమార్చినట్లు గా ట్రంప్ ప్రకటించారు. అమెరికా సైనిక స్థావరంపైన జరిపిన కాల్పులకు తామే కారణమని ప్రకటించుకున్న కొద్ది రోజులకే ఈ పరిణామం చోటు చేసుకోవటం విశేషం. డిసెంబరు ఆరున ఫ్లోరిడాలోని అమెరికా నావికా దళానికి చెందిన పెన్సకోలా వైమానికి స్థావరం లో భారీ ఎత్తున ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటన లో సౌదీకి చెందిన ఒక సైనిక అధికారితో పాటు మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయ పడ్డారు.

ఆ సందర్భంలో దాడికి పాల్పడిన ఉగ్రవాది ని అక్కడి భద్రతా సిబ్బంది మట్టుబెట్టింది. ఈ ఉదంతంతో తమకు సంబంధం ఉందని ఏక్యూఏపీ ప్రకటన విడుదల చేయగా.. దానికి కారణమైన కీలక నేతను తాజాగా ఏసేయటం చూస్తే.. తమను లక్ష్యంగా చేసుకున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదన్న విషయాన్ని తాజా ఉదంతంతో అమెరికా స్పష్టం చేసినట్లైంది.