Begin typing your search above and press return to search.

పోయిన చోటే వెతుక్కో సామెతను ఫాలో అవుతున్న ట్రంప్

By:  Tupaki Desk   |   24 May 2020 3:30 AM GMT
పోయిన చోటే వెతుక్కో సామెతను ఫాలో అవుతున్న ట్రంప్
X
ఊహించనిరీతిలో విరుచుకుపడిన మహమ్మారితో ప్రపంచం మాత్రమే కాదు.. ప్రపంచానికే పెద్దన్న అమెరికా సైతం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ ఏడాది ట్రంప్ కు కీలకం కానుంది. మరికొద్ది నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ.. అధికారాన్నితిరిగి చేజిక్కించుకోవటానికి వీలుగా భారీ వ్యూహాన్ని ఆయన సిద్ధం చేసుకుంటున్నారు. నిజానికి తొలుత అనుకున్న ప్లాన్ ను ఆయనిప్పుడు మార్చుకోనున్నారు.

కలలో కూడా ఊహించని రీతిలో విరుచుకు పడిన ఉపద్రవంతో ఉక్కిరిబిక్కిరి అయిన ట్రంప్.. తనను తీవ్రంగా డ్యామేజ్ చేసిన ఈ మహమ్మారితోనే తాను తిరిగి అధికారంలోకి రావాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. మాయదారి రోగాన్ని వ్యాప్తి కాకుండా ఆపే విషయంలో అమెరికా అధ్యక్షుడు దారుణంగా ఫెయిల్ అయ్యారన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తున్నదే. అందుకే.. మన పాత సామెత పోయిన చోటే వెతుక్కో అన్న దాన్ని పక్కాగా ఫాలో అవుతున్నట్లు చెబుతున్నారు.

ప్రపంచంలో అత్యధిక కేసులు నమోదైన దేశంగా అమెరికా నిలవటమే కాదు.. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటికే పెద్ద సంఖ్యలో మరణించారు. దీంతో.. ఈ మందులేని రోగానికి మందు కనుక్కునే బాధ్యతను మీదేసుకున్న అమెరికా.. ఇప్పుడు దాన్ని వాస్తవరూపంలోకి తీసుకురావాలని భావిస్తోంది. ఇందులో భాగంగా పరిశోధనల్ని తీవ్రతరం చేశారు. అంతేకాదు.. దీని వ్యాక్సిన్ కు సంబంధించి ఏ మాత్రం సానుకూల ఫలితాలు వచ్చినా.. దాని పెద్ద ఎత్తున ప్రజలకు పంపిణీ చేయటం ద్వారా సక్సెస్ సాధించాలన్న యోచనలో ట్రంప్ ఉన్నట్లు చెబుతున్నారు.

ఈ కారణంతోనే ఆక్స్ ఫర్డ్ వర్సిటీ ప్రయోగాల్లో వ్యాక్సిన్ మొదటి దశ సక్సెస్ అయి.. రెండోదశకు చేరటంతో ట్రంప్ సర్కారు 30 కోట్ల డోసుల ఉత్పత్తి కోసం 1.2 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తామని చెప్పటం వెనుక అసలు కారణం అధ్యక్ష ఎన్నికలే అంటున్నారు. ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికలకు కాస్త ముందుగా వ్యాక్సిన్ ను తీసుకు రావటం ద్వారా.. అమెరికన్లను ఆదుకున్న హీరో ఇమేజ్ ను తాను సొంతం చేసుకోవాలన్నది ట్రంప్ ప్లాన్ గా చెబుతున్నారు. మరి.. ఆయన వ్యూహాన్ని కాలం ఎంతలా సహకరిస్తుందో చూడాలి.