Begin typing your search above and press return to search.

అమెరికా కంపెనీకి రూ. 145 కోట్ల జరిమానా ,,ఎందకంటే ?

By:  Tupaki Desk   |   29 Oct 2020 3:20 PM IST
అమెరికా కంపెనీకి రూ. 145 కోట్ల జరిమానా ,,ఎందకంటే ?
X
లంచం .. లంచం .. లంచం .. ప్రతిదానికి లంచం. రాబోయే రోజుల్లో గాలి పీల్చుకోవాలన్నా , నీళ్లు తాగాలన్నా కూడా లంచం ఇవ్వాల్సిన రోజులు కూడా వస్తాయేమో. ఎందుకంటే పరిస్థితి అలానే ఉంది. అయితే , అన్ని ప్రభుత్వాలు అలానే లంచం ఇచ్చి పనులు చేసుకుంటూపోతుంటే చూస్తూ ఉండవు. తమ ప్రతాపాన్ని చూపిస్తాయి. తాజాగా ఓ భారతీయ ఉన్నతాధికారికి రూ.10 లక్షల లంచం ఇచ్చినందుకు భారత్‌ లో వ్యాపారం చేస్తున్న ఓ అమెరికా మద్యం తయారీ సంస్థకు రూ.145 కోట్ల (19.5 మిలియన్‌ డాలర్లు) జరిమానా విధిస్తూ అమెరికా న్యాయశాఖ సంచలన నిర్ణయం తీసుకొంది.

అయితే , ఈ మొత్తాన్ని చెల్లించడానికి ఆ కంపెనీ అంగీకారం తెలిపింది. షికాగోకు చెందిన బీమ్‌ సన్‌ట్రాయ్‌ ఇంక్‌ సంస్థ.. బీమ్‌ గ్లోబల్‌ స్పిరిట్స్‌ అండ్‌ వైన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ .. బీమ్‌ ఇండియా పేరుతో రాజస్థాన్ ‌లోని ఆల్వార్‌ జిల్లా బెహ్‌రోర్ ‌లో మద్యం తయారీ సంస్థని నడిపిస్తుంది. ఆ సంస్థకి అవసరమైన లైసెన్సుల కోసం ఓ భారత ప్రభుత్వ ఉన్నతాధికారికి 18వేల డాలర్లు ( అంటే మన కరెన్సీ లో సుమారు రూ. 10 లక్షలు) లంచం ఇచ్చింది. 2006-2012 మధ్య కాలంలో పలుమార్లు ప్రభుత్వ అధికారులకు లంచాలు చెల్లించింది. వీటిని డిస్ట్రిబ్యూటర్లు, సేల్స్‌ ప్రమోటర్లు, ఇతర వర్గాల ద్వారా అందజేసి ఆమేరకు ఖాతాల్లో తప్పుడు వివరాలను నమోదు చేసింది.

ఈ విషయం తెలిసినా కంపెనీ న్యాయవాదులు వివరాలను తొక్కిపెట్టారని న్యాయశాఖ క్రిమినల్‌ విభాగం అటార్నీలు తెలిపారు. నిజాయతీగా, పోటీతత్వంతో వ్యాపారం చేయాల్సి ఉండగా, అక్రమ మార్గాలను అనుసరించినట్టు వెల్లడించారు. ఇలాంటి చర్యలపై ఫారిన్‌ కరప్ట్‌ ప్రాక్టీసెస్‌ చట్టం కింద చర్యలు తీసుకోవచ్చని వివరించారు. అక్రమాలకు పాల్పడవద్దని వివిధ వర్గాలు ఇచ్చిన సలహాలను ఆ కంపెనీ పట్టించుకోలేదని తెలిపారు. తగిన నివారణ చర్యలు తీసుకున్నామని, ఇందుకు బాధ్యులైన ఉద్యోగులను తొలగించామని ఆ కంపెనీ వర్గాలు తెలిపాయి. ఏదేమైనా 10 లక్షలు లంచం ఇచ్చినందుకు రూ. 145 కోట్లు జరిమానా విధించడం గమనార్హం.